చాట్రాయి, న్యూస్‌లైన్ : సినీ ఫక్కీలో పట్టపగలు నడిరోడ్డుపై చోరీకి పాల్పడిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో సోమవారం జరిగింది. నగదు బ్యాగ్‌తో బైక్‌పై పరారై వస్తున్న ముగ్గురు నిందితుల్లో ఒకరిని చాట్రాయి పోలీసులు విస్సన్నపేట మండలం నర్సాపురం వద్ద అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ ఘటనలో ఐదుగురు పాల్గొనగా మరో ఇద్దరు వేరొక బైక్‌పై పరారయ్యారని పోలీసులు తెలిపారు.
వారి కథనం ప్రకారం వివరాలివీ... చింతలపూడిలోని భారత్ గ్యాస్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ ఎన్.శ్రీనివాసరావు సోమవారం ఉదయం 10.30 గంటలకు రూ.4.90 లక్షల నగదును అక్కడి ఆంధ్రాబ్యాంక్‌లో జమచేసేందుకు బయల్దేరారు. మార్గంలో వెనుక నుంచి పల్సర్ బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు సత్తుపల్లి ఎటు వెళ్లాలని అడిగారు. ఆయన దారి చూపే క్రమంలో మెడలోని నగదు బ్యాగ్‌ను లాక్కొని పరారయ్యారు.
బాధితుడు శ్రీనివాసరావు వెంటనే చింతలపూడి సీఐ ఎం.వెంకటేశ్వరరావుకు విషయం తెలుపగా, ఆయన లింగపాలెం, ధర్మాజీగూడెం స్టేషన్లతో పాటు చాట్రాయి స్టేషన్ ఎస్‌ఐ సతీష్‌కు సమాచారం అందించారు. చాట్రాయి ఎస్‌ఐ వెంటనే అప్రమత్తమై స్టేషన్ వద్ద కానిస్టేబుల్ చారిని నిఘా ఉంచారు. విస్సన్నపేట మండలం నర్సాపురంలోని స్థానికులకు కూడా సమాచారం అందించారు. దీంతో వారు కూడా అప్రమత్తమయ్యారు.
కానిస్టేబుల్‌ను ఢీకొట్టి పరారీ...
బైక్‌పై చాట్రాయి చేరుకున్న నిందితులు పోలీస్‌స్టేషన్ వద్ద తమను అడ్డగించబోయిన కానిస్టేబుల్ చారిని ఢీకొట్టి నర్సాపురం సెంటర్‌కు చేరుకున్నారు. దీంతో అక్కడి హోంగార్డు శ్రీను వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా వారు బైక్ అదుపుతపిప కిందపడ్డారు. అదే సమయానికి చాట్రాయి పోలీసులు కూడా రావడంతో బైక్‌పై వెనుక ఉన్న ఇద్దరు నిందితులు స్థానిక దళితవాడలోకి పరారయ్యారు.
కిందపడిపోయిన పిల్లి ప్రవీణ్ అనే మూడో నిండితుడిని, నగదుతో సహా స్థానికుల సహకారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి నగదును లెక్కించగా రూ.3.40 లక్షలు మాత్రమే ఉన్నాయి. మిగతా రూ.1.50 లక్షలు పారిపోయిన నిందితుల వద్ద ఉండవచ్చని సమాచారం. అనంతరం చింతలపూడి సీఐ, ఎస్‌ఐ బి.మోహనరావులకు తిరువూరు సీఐ శ్యాంకుమార్ ఆధ్వర్యంలో నిందితుడిని బైక్, నగదు సహా అప్పగించారు.
ముందుగానే రెక్కీ...
చోరీకి పాల్పడిన వ్యక్తులు కొన్ని రోజులు ముందుగానే రెక్కీ నిర్వహించారని తిరువూరు సీఐ శ్యాంకుమార్ చెప్పారు. అదుపులోకి తీసుకున్న నిందితుడిని విచారించగా ఈ విషయం వెల్లడించాడని వివరించారు. స్థానికుల సహకారంతో ఆ గ్రామంలో ఎక్కువ మొత్తంలో బ్యాంక్ లావాదేవీలు జరిపేవారి వివరాలు సేకరించి, ఏ సమయంలో బ్యాంక్‌కు వెళ్లేదీ పూర్తి సమాచారం తెలుసుకొని చోరీలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. బ్యాంక్‌ల మేనేజర్లు కార్యాలయాల వద్ద తగిన సెక్యూరిటీ కల్పించి గట్టి నిఘా ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ చోరీ ఘటనలో మొత్తం ఐదుగురు వ్యక్తులు పాల్గొన్నారని, రెండు బైక్‌లపై వారు పరారయ్యారని ఆయన వివరించారు. ఎస్సై సతీష్, సిబ్బంది, సహకరించిన స్థానికులను ఆయన ప్రశంసించారు.
పట్టపగలు నడిరోడ్డుపై భారీ చోరీ
Published Tue, Nov 12 2013 1:18 AM | Last Updated on Sat, Sep 2 2017 12:31 AM
Advertisement
Advertisement