37 తులాల బంగారు నగలు, రూ.50 వేల నగదు అపహరణ
పుట్టపర్తి అర్బన్: పుట్టపర్తి సమీపంలోని కర్ణాటక నాగేపల్లి వద్ద ఉన్న సాయి సందీప్ విల్లాస్–2లో భారీ చోరీ జరిగింది. పుట్టపర్తి రూరల్ సీఐ సురేష్, ఎస్‌ఐ కృష్ణమూర్తి తెలిపిన వివరాల మేరకు... సాయి సందీప్ విల్లాస్–2లోని 40 నంబర్ ఇంట్లో పుట్టపర్తి వ్యవసాయాధికారి వెంకట బ్రహ్మం, కొత్తచెరువు అగ్రి ల్యాబ్ ఏవో శ్రీవాణి దంపతులు నివాసం ఉంటున్నారు. వారు బుధవారం రాత్రి తమ ఇంట్లోని పై అంతస్తు గదిలో నిద్రించారు. అర్ధరాత్రి వేళ కింద హాలులో చప్పుడు రావడంతో వెంకట బ్రహ్మం కిందకు వచ్చి చూడగా, ఇంటి తలుపు తెరిచి ఉంది. బెడ్ రూంలోకి వెళ్లి చూడగా బీరువా పగులగొట్టి ఉంది. అందులో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు కనిపించలేదు.
ఆయన వెంటనే అదే అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న పుట్టపర్తి ‘దిశ’ డీఎస్పీ శ్రీనివాసరావుకు సమాచారం ఇచ్చారు. శ్రీనివాసరావు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్‌ఐ కృష్ణమూర్తి వచ్చి దొంగల కోసం చుట్టపక్కల వెదికినా కనిపించలేదు. గురువారం ఉదయం రూరల్ సీఐ సురేష్ ఘటనాస్థలానికి వచ్చి ఆధారాలు సేకరించారు.
ఏడో తరగతి చదువుతున్న తమ కూతురుకు ప్రతి జన్మదినం రోజున బహుమతిగా ఒక బంగారు నగ చేయిస్తామని, ఆ విధంగా చేయించిన లాంగ్ చైను, పూసల దండ, డాలర్‌లు, కమ్మలు, చైన్లు కలిపి మొత్తం 37 తులాల బంగారు ఆభరణాలు, రూ.50వేలు నగదును దొంగలు అపహరించారని వెంకట బ్రహ్మం, శ్రీవాణి దంపతులు తెలిపారు. దొంగలు పక్కాగా రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
విల్లాస్‌లో ప్రవేశించిన దొంగలు తొలుత ఓ ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లారని, ఆ ఇంట్లో ఏమీ లభించకపోవడంతో పక్కనే ఉన్న వెంకట బ్రహ్మం ఇంట్లో చోరీ చేశారని గుర్తించారు. కాగా, దొంగలు విల్లాస్‌లోకి ప్రవేశించే సమయంలో అదే కాలనీలో ఉన్న ఒకతను గుర్తించి సెక్యూరిటీని అప్రమత్తం చేశారని, అయినా ఉపయోగం లేకపోయిందని స్థానికులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment