డీజీపీ రాముడు మనోడే
ఎస్కేయూ/బత్తలపల్లి/పుట్టపర్తి అర్బన్, న్యూస్‌లైన్ : ఆంధ్రప్రదేశ్ తొలి డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా సోమవారం బాధ్యతలు స్వీకరించిన జేవీ రాముడు మన జిల్లా వాసి కావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తాడిమర్రి మండలం నార్శింపల్లిలో 1954 ఆగస్టు 1న జన్మించారు.
అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ (1971-74 బ్యాచ్) పూర్తి చేశారు. ఎస్కేయూలో ఎంఏ (ఎకనామిక్స్) మొదటి సంవత్సరం (1974-75), ఎస్వీ యూనివర్సిటీలో ద్వితీయ సంవత్సరం(1975-76) పూర్తి చేశారు. 1978లో ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చారు.
ఇది వరకు ఉమ్మడి రాష్ట్రానికి డీజీపీ (ఆపరేషన్స్)గా బాధ్యతలు నిర్వర్తించారు. జేవీ రాముడు డీజీపీగా నియమితులు కావడంతో మండల కేంద్రమైన బత్తలపల్లిలో నార్శింపల్లి గ్రామస్తులు, ఆర్డీఎఫ్ పాఠశాల సిబ్బంది సంబరాలు చేసుకున్నారు. గ్రామానికి చెందిన రామకృష్ణ ఆధ్వర్యంలో బాణాసంచ కాల్చారు. కేక్ కట్ చేశారు. జేవీ రాముడు గ్రామాభివృద్ధిని, ప్రజల క్షేమాన్ని కోరుకునే వ్యక్తి అని, ఆయన పెద్ద పదవి చేపట్టడం ఆనందంగా ఉందని వారు అన్నారు. ఆయన వల్ల తమ గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
సంతోషంగా ఉంది
ఆంధ్రప్రదేశ్ డీజీపీగా జేవీ రాముడు ఎంపిక కావడం తమకు ఎంతో సంతోషాన్నిస్తోందని ఆయన సోదరి వెంకటలక్ష్మమ్మ, బావ రామయ్య అన్నారు. వీరు పుట్టపర్తి మండలం వీరాంజనేయపల్లిలో నివసిస్తున్నారు. డీజీపీగా జేవీ రాముడు బాధ్యతలు స్వీకరించడంతో సోమవారం గ్రామస్తులతో కలసి బాణాసంచ కాల్చారు. మిఠాయిలు పంచి పెట్టారు.