లోకోజుపల్లిలో ఎమ్మెల్యేను అడ్డగించిన డ్వాక్రా మహిళలు
సాక్షి, అమడగూరు : పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డికి చుక్కెదురైంది. మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో రోడ్లను ప్రారంభించడానికి శుక్రవారం విచ్చేసిన ఎమ్మెల్యేకు పరాభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. ఏ పుట్లవాండ్లపల్లిలో రోడ్లను ప్రారంభించడానికి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి వెళ్లగా ఊరిబయటే వేచి చూస్తున్న గ్రామస్తులు ఎమ్మెల్యే వాహనాలు రాగానే అడ్డగించారు. గ్రామంలో చాలా మందికి సబ్సిడీ రుణాలు ఇవ్వలేదని, మా గ్రామానికి మీరు ఏం చేశారని నిలదీశారు. అలాగే లోకోజుపల్లిలో రోడ్లను ప్రారంభించడానికి వెళ్లగా డ్వాక్రా సంఘాల మహిళలు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. పసుపు–కుంకుమ కింద చెక్కులు ఇచ్చారు కానీ వాటికి డబ్బులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పది రోజులు క్రితం అమడగూరులో పంపిణీ చేసిన చీరల కోసం తామంతా వచ్చినా ఒక చీర కూడా ఇవ్వలేదని, ఆ రోజు తిండి కూడా లేక కడుపు మాడ్చుకుని ఇళ్లకు వచ్చామన్నారు. అలాగే గుండువారిపల్లికి వెళ్లగా అక్కడ కూడా గోబ్యాక్ పల్లె అంటూ నినాదాలు చేశారు. అర్హులైన వారి ఇళ్లకు బిల్లులు ఇవ్వలేదని, ఇళ్లు కట్టని వారికి బిల్లులు ఇచ్చారని, సబ్సిడీ రుణాల్లో, ఆవులషెడ్ల మంజూరులో అర్హులకు అన్యాయం చేశారని గ్రామానికి రావద్దని అడ్డుకున్నారు. దీంతో విసిగిపోయిన పల్లె వెనుతిరిగారు.
Comments
Please login to add a commentAdd a comment