మంత్రి పీతల దళిత జాతికి క్షమాపణ చెప్పాలి
కడప కార్పొరేషన్ : రాష్ట్ర మంత్రి పీతల సుజాత దళిత జాతికి బహిరంగ క్షమాపణ చెప్పాలని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు. మంత్రి పీతల సుజాత ముఖ్యమంత్రి చంద్రబాబును అంబేద్కర్‌తో పోల్చడాన్ని నిరసిస్తూ మంగళవారం వైఎస్‌ఆర్‌సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు పులి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పులి సునీల్ కుమార్ మాట్లాడుతూ దళిత, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌తో అవినీతిపరుడైన చంద్రబాబును పోల్చడం మంత్రి సుజాతకు తగదన్నారు.
దేశంలో అణగారిన వర్గాలంతా అంబేద్కర్‌ను దేవునిలా పూజిస్తారని, ఇటీవలే ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుకు ఆ మహానుభావుడిని పోలికా...అని ప్రశ్నించారు. దళితురాలై ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు మంత్రి పీతల సుజాత క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మంత్రి పీతల సుజాతకు, సీఎం చంద్రబాబుకు వ్యతిరేఖంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ మహిళా అధ్యక్షురాలు పత్తిరాజేశ్వరి, బోలా పద్మావతి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చల్లా రాజశేఖర్, నగర అధ్యక్షుడు ఆదిత్య, మైనార్టీ విభాగం నగర అధ్యక్షుడు ఎస్‌ఎండీ షఫీ, నాయకులు సంజీవరాయుడు, మాతంగి సుబ్బరాయుడు, త్యాగరాజు, కంచుపాటి బాబు, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.