మరింత దూరం | The more distance | Sakshi
Sakshi News home page

మరింత దూరం

Published Wed, Jun 18 2014 12:11 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

The more distance

సాక్షి, గుంటూరు : సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవటంతో పార్టీలో ఉన్నతస్థాయి పదవులు అనుభవించిన ముఖ్య నేతలు పార్టీకి దూరంగా ఉంటున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో గెలిచే అవకాశాలు లేవని భావించిన కొందరు నేతలు టికెట్‌లు వచ్చినా పోటీ నుంచి తప్పుకున్నారు.
 
 దీంతో ఆయా స్థానాల్లో చెందిన ద్వితీయ స్థాయి నేతలు పోటీలో నిలిచారు. విజయవాడలో మంగళవారం జరిగిన ఏపీసీసీ సమీక్ష సమావేశానికి సైతం జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రులు పనబాక లక్ష్మి, గాదె వెంకటరెడ్డి, శాసనసభ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌లు గైర్హాజరయ్యారు. వీరిలో గాదె వెంకటరెడ్డి ఎన్నికల ముందు నుంచి పార్టీకి దూరంగా ఉంటుండగా, పనబాక, నాదెండ్ల మాత్రం పార్టీ విధేయులుగా ఉంటూ ఎన్నికల్లో పోటీ కూడా చేశారు.
 
 మంగళవారం జరిగిన రాష్ట్రస్థాయి తొలి సమీక్ష సమావేశానికి వీరిరువురూ హాజరు కాకపోవడంపై పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. మరో మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి హాజరైనా మధ్యలోనే వె ళ్లిపోయారు. ముఖ్య నేతల తీరుపై ద్వితీయ శ్రేణి నాయకులు సైతం మండిపడుతున్నారు. పదవులు అనుభవించి పోటీలో నిలవకుండా ఎన్నికల్లో తమను పావులుగా వాడుకుని నియోజకవర్గాల్లో ఇన్‌చార్జ్‌లుగా చలామణి కావాలని చూస్తున్నారని కొందరు నేతలు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
 
 నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాధ్యతలు తమకే అప్పగించాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఎన్నికల్లో ధైర్యంగా నిలబడిన వారికి పార్టీ అండగా ఉంటుందని, అధిష్టానం తగు న్యాయం చేస్తుందని రఘువీరారెడ్డి వారికి హామీ ఇచ్చినట్లు తెలిసింది. టిక్కెట్లు ఇచ్చినా పోటీకి తిరస్కరించిన నేతలపై పార్టీ అధిష్టానం కూడా సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఎన్నికల అనంతరం అధిష్టాన పెద్దలను కలిసేందుకు వెళ్లిన వీరికి అపాయింట్‌మెంట్‌లు దక్కకపోవడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement