అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్: జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం రోజురోజుకి హోరెత్తుతోంది. 37వ రోజు గురువారం కూడా ఉద్యమ జోరు కొనసాగింది. తాడిపత్రిలో నిర్వహించిన లక్ష జన గళ ఘోషకు జనం పోటెత్తారు. సమైక్య నినాదంతో తాడిపత్రి మార్మోగింది.
ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఉపాధ్యాయులు దీక్ష శిబిరాల్లోనూ, రోడ్లపైనా వినూత్న రీతిలో నిర్వహించారు. ఈనెల 7న హైదరాబాద్‌లో తలపెట్టిన ఏపీ ఎన్జీవోల సమైక్య సభకు జిల్లా నుంచి భారీగా తరలివెళ్లడానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు సిద్ధమవుతున్నారు. ఏ మాత్రం సంయమనం కోల్పోకుండా సమైక్యవాదులు శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. 37 రోజులుగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమం కాగా.. ప్రభుత్వ కార్యాలయాల తలుపులు తెరచుకోలేదు. పాలన అస్తవ్యస్తమైనా పట్టువీడకుండా సమరంలో మమేకమవుతున్నారు.
అనంతపురం నగరంలో పంచాయతీరాజ్ జేఏసీ, ఎన్‌జీవో, ఉపాధ్యాయ జాక్టో, అధ్యాపకుల జేఏసీ, మున్సిపల్ ఉద్యోగ జేఏసీ, వాణిజ్యపన్నుల శాఖ, న్యాయవాదులు, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కుల సంఘాల జేఏసీ రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. సహకారశాఖ, రాజీవ్ విద్యామిషన్, మీసేవ ఉద్యోగులు గురువారం ర్యాలీలు నిర్వహించారు. న్యాయవాదులు బైక్ ర్యాలీ చేశారు. హైదరాబాద్‌లో సీమాంధ్ర ఉద్యోగులపై దాడికి నిరసనగా ‘మనమంతా ఒక్కటే’ అని జిల్లా పశుసంవర్ధకశాఖ జేఏసీ ఆధ్వర్యంలో ఆ శాఖ జాయింట్ డెరైక్టర్ తెలంగాణకు చెందిన డాక్టర్ శ్యాంమోహన్‌రావు కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. శింగనమలలో నిర్వహించిన సమైక్యాంధ్ర సింహ గర్జనకు వేలాది మంది తరలివచ్చారు.
సమరోత్సాహం నింపిన షర్మిల
పామిడిలో గురువారం సకల జనుల సమైక్య గర్జనకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మద్దతు ప్రకటించారు. సమైక్యాంధ్ర ఉద్యమ వీరులకు అభినందనలు తెలిపిన షర్మిల.. ఉద్యమంలో కదంతొక్కే సమైక్యవాదులందరికీ వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని హామీ ఇవ్వడం సమైక్యవాదుల్లో సమరోత్సాహాన్ని నింపింది. పెద్దవడుగూరులో ముస్లింలు ప్రార్థనలు చేసి ర్యాలీ నిర్వహించారు. గుంతకల్లులో సమైక్య ఆందోళనలు మిన్నంటాయి. ఉద్యోగ జేఏసీ, వైస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. కదిరిలో ప్రైవేట్ పాఠశాలల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేశారు. కళ్యాణదుర్గంలో న్యాయవాదులు పంచెకట్టుతో నిరసన ర్యాలీ చేశారు. సీమాంధ్ర మంత్రులకు సిగ్గు ఎగ్గు వుంటే పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని వైఎస్సార్‌సీపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త తిప్పేస్వామి అన్నారు. ఐదు మండలాల నుంచి మాదిగ దండోరా నాయకులు భారీ సంఖ్యలో తరలిరావడంతో మడకశిరలో సమైక్యాంధ్ర నినాదం మారుమోగింది. ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే సుధాకర్‌కు సమైక్యవాదుల నుంచి నిరసన సెగ తగిలింది. రాజీనామా ఆమోదింపజేసుకుని ఉద్యమంలోకి రావాలని ఉద్యోగ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేశానని లేఖను చూపించినా వారు వినలేదు. అమరాపురంలో ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఓడీచెరువులో ఉపాధ్యాయులు అర్ధనగ్న ప్రదర్శన, వంటావార్పు నిర్వహించారు.
అమడగూరులో సర్పంచులు రిలే దీక్ష చేపట్టారు. పెనుకొండలో ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించి విద్యార్థులతో మానవహారం ఏర్పాటు చేశారు. పరిగి మండలం పెద్దిరెడ్డిపల్లి గ్రామస్తులు సామూహిక రిలే దీక్ష చేశారు. గోరంట్లలో ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. రాయదుర్గంలో యాదవసంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించగా... వినాయక సర్కిల్‌లో హిజ్రాలు నృత్యం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. కణేకల్లులో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో రిలే దీక్ష చేపట్టారు. ఆత్మకూరులో కస్తూర్బా పాఠశాల ఉపాధ్యాయులు రిలే దీక్షలకు దిగారు. ఉరవకొండలో ఉపాధ్యాయులు రోడ్డుపైనే ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకున్నారు. ధర్మవరంలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
ఆటోవాలాలు భారీ ర్యాలీ నిర్వహించారు. హిందూపురంలో ఆర్టీసీ కార్మికులు, ఎన్జీవోలు ర్యాలీ నిర్వహించారు. బాలయేసు కళాశాల విద్యార్థులు 500 అడుగుల జాతీయ పతాకంతో ప్రదర్శన నిర్వహించారు. హిందూపురంలో ఆర్డీఓ సమావేశాన్ని సమైక్యవాదులు అడ్డుకున్నారు. సమైక్య ప్రకటన వెలువడేదాకా ఉద్యమం ఆగదని సమైక్యాంధ్ర జేఏసీ నేతలు స్పష్టం చేశారు. హిందూపురం శివారు మోతుకపల్లి గ్రామస్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. చిలమత్తూరులో ఎస్సీలు సమైక్య ర్యాలీ చేశారు. లేపాక్షిలో ప్రైవేట్ పాఠశాలల ఆధ్వర్యంలో ర్యాలీ చేయగా, ఏపీఆర్‌ఎస్ విద్యార్థులు రోడ్డుపైనే ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు.
రగులుతున్న సెగ
Published Fri, Sep 6 2013 4:13 AM | Last Updated on Fri, Sep 1 2017 10:28 PM
Advertisement
Advertisement