విజయవాడ క్రైం, న్యూస్‌లైన్ : జిల్లాలో మావోయిస్టుల కార్యకలాపాలు మళ్లీ మొదలయ్యాయా? శనివారం సీపీఐ మావోయిస్టు(ఎఎఎ) పేరిట పత్రికా కార్యాలయాలకు అందిన లేఖ అవుననే సమాధానం చెపుతోంది. రాష్ట్ర కార్యదర్శి సాగర్ పేరిట ఉన్న లేఖను జిల్లా కార్యదర్శిగా పేర్కొన్న అశోక్ పంపారు. జగ్గయ్యపేటలో బియ్యం కల్తీ, నకిలీ పురుగుల మందుల విక్రయాలు, అనధికారికంగా బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వహణ, గ్యాస్ పంపిణీ అక్రమాలపై వీరు దృష్టి సారించారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అధిక ఫీజుల వసూళ్లను నిలిపేయాలని డిమాండ్ చేశారు.
మళ్లీ షురూ
జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాలు మళ్లీ మొదలైనట్టు తెలుస్తోంది. గతంలో విజయవాడ నగరంలో నక్సల్స్ కార్యకలాపాలు సాగిన విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా జిల్లాను మావోయిస్టులు షెల్టర్ జోన్‌గానే వాడుకుంటున్నారు. అనారోగ్యానికి గురైన రాష్ట్ర స్థాయి నేతలు ఇక్కడ ఆశ్రయం తీసుకొని వైద్యం చేయించుకొని వెళుతున్నారు.
కొత్త గ్రూపులు
జిల్లాలో కొత్త గ్రూపుల ఏర్పాటు ద్వారా కార్యకలాపాలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మావోయిస్టు పార్టీ సహా అన్ని విప్లవ గ్రూపుల సమాచారం పోలీసుల వద్ద ఉంది. దీనిని నుంచి దృష్టి మరల్చి కార్యకలాపాల నిర్వహణకు కొత్త గ్రూపులు ఏర్పాటు చేసి ఉండొచ్చని తెలుస్తోంది. ఇందులో భాగంగానే సిపిఐ మావోయిస్టు(మార్క్సిస్టు-లెనినిస్టు)కు బదులుగా సీపీఐ మార్క్సిస్టు(ఎఎఎ) గ్రూపును ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇది వాస్తవం కాకపోవచ్చనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఢిల్లీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఏఏపీ) సత్తా చూపడంతో..దానిని పోలిన రీతిలో స్థానికుల్లో కొందరు అక్రమ వ్యాపారులను బెదిరించేందుకు మావోయిస్టుల పేరును వాడుకొని ఉండొచ్చని భావిస్తున్నారు.
టార్గెట్ జగ్గయ్యపేట
ఖమ్మం, నల్గొండ జిల్లాల సరిహద్దు సమీపంలోని జగ్గయ్యపేట పట్టణాన్ని మావోయిస్టులు టార్గెట్‌గా ఎంచుకున్నట్టు చెప్పొచ్చు. ఈ రెండు జిల్లాల్లో కార్యకలాపాలు నిర్వహించే గ్రూపు లు జగ్గయ్యపేట పరిసర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ క్రమంలోనే స్థానికుల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఇక్కడ దృష్టి సారించినట్టు చెప్పొచ్చు. ఏదేమైనా జిల్లాలో మావోయిస్టుల పేరిట విడుదల చేసిన లేఖ కలకలం రేపుతోంది.
జిల్లాలో మావోయిస్టుల కదలికలు !
Published Sun, Jan 12 2014 12:49 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement