new groups
-
చంటి బిడ్డతో ప్రయాణమా? మీకోసమే 'ట్రావెల్ విత్ కిడ్స్'
ప్రయాణాల మీద బోలెడు ఆసక్తి ఉన్నప్పటికీ పిల్లలు ఒక వయసు వచ్చాకగానీ ఇల్లు దాటని తల్లులు ఎందరో ఉంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్, డెంటిస్ట్‌లు సాక్షి గులాటీ, నికిత మాథుర్‌లు యంగ్ మదర్స్ కోసం ‘ట్రావెల్ విత్ కిడ్స్’ అనే ట్రావెల్ గ్రూప్‌ను ప్రారంభించారు. ప్రయాణాలలో తల్లీపిల్లలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నారు... సాక్షి గులాటీ, నికిత మాథుర్‌లు పర్యాటక ప్రేమికులు. వృత్తిలో ఎంత బిజీగా ఉన్నా సరే ప్రయాణాలకు మాత్రం దూరంగా ఉండేవారు కాదు. నాలుగున్నర సంవత్సరాల క్రితం సాక్షి ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లడానికి ఆలోచనలు చేస్తున్నప్పుడు ‘చంటి బిడ్డతో ప్రయాణమా!!’ అని ఆశ్చర్యపోవడమే కాదు ప్రయాణాలు వద్దంటే వద్దన్నారు చాలామంది. ఒక బిడ్డకు తల్లి అయిన నికితకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఎవరి మాటలు పట్టించుకోకుండా చెన్నైకి చెందిన సాక్షి తన మూడు నెలల బిడ్డతో కలిసి మహాబలిపురానికి వెళ్లింది. చాలా కాలం తరువాత పర్యాటక ప్రదేశానికి వచ్చింది. మరోవైపు బెంగళూరుకు చెందిన నికిత మూడు నెలల పిల్లాడితో కలిసి మైసూర్‌కు వెళ్లింది. ‘బేబీతో ప్రయాణం కష్టమని చాలామంది భయపెట్టారు. ఇది నిజం కాదని అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాను. మొదటి మూడు నాలుగు నెలలు మాత్రమే కష్టం’ అంటుంది సాక్షి. చెన్నైలో ఉండే సాక్షి, బెంగళూరులో ఉండే నికితలు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యారు. ఒకే రకమైన వృత్తి, అభిరుచులు వారిని సన్నిహిత స్నేహితులుగా మార్చాయి. సినిమాల నుంచి పర్యాటకం వరకు ఇద్దరు స్నేహితులు ఎన్నో విషయాలు మాట్లాడుకునేవారు. అలా ఒకరోజు వారి మధ్య చంటిబిడ్డలు ఉన్న తల్లుల ప్రస్తావన వచ్చింది. మహిళల కోసం ఎన్నో ట్రావెల్ గ్రూప్స్ ఉన్నాయి. సోలో ట్రావెలర్స్, సీనియర్ సిటిజన్లు... మొదలైన వారి కోసం ఎన్నో ట్రావెల్ గ్రూప్స్ ఉన్నాయి. కాని మదర్స్ అండ్ కిడ్స్ కోసం మాత్రం లేవు. ఈ లోటును భర్తి చేయడానికి రెండు సంవత్సరాల క్రితం ‘ట్రావెల్ విత్ కిడ్స్’ పేరుతో ట్రావెల్ గ్రూప్‌ను ప్రారంభించారు. తొలి ‘మదర్ అండ్ కిడ్స్’ ట్రిప్‌ను పాండిచ్చేరికి ప్లాన్ చేశారు. సాక్షికి పాండిచ్చేరి కొట్టిన పిండి. పాండిచ్చేరి ట్రిప్‌కు సంబంధించిన వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తే మంచి స్పందన లభించింది. ఈ ట్రిపుల్ ఆరుగురు తల్లులు వారి పిల్లలను తీసుకువెళ్లారు. ఈ ప్రయాణం విజయవంతం కావడంతో ఇద్దరు స్నేహితులకు ఎంతో ఉత్సాహం వచ్చింది. ఆ తరువాత వివిధ ప్రాంతాలకు సంబంధించి అయిదు ట్రిప్‌లు ప్లాన్ చేశారు. తమ వృత్తిలో బిజీగా ఉండే సాక్షి, నికితలు వీకెండ్స్‌లో ప్లానింగ్ చేస్తుంటారు. ‘చంటి బిడ్డలు ఉన్నారని ఇంటి నాలుగు గోడలకే పరిమితం కానక్కర్లేదు. బయటి ప్రపంచలోకి వస్తే కొత్త ఉత్సాహం, శక్తి వస్తాయి’ అంటున్నారు సాక్షి, నికిత. ‘పర్యాటక ప్రదేశాలకు వెళ్లి కొత్త అనుభూతిని సొంతం చేసుకునేలా చంటి బిడ్డల తల్లులను ప్రేరేపించడం ఒక లక్ష్యం అయితే, ప్రయాణాలలో తల్లీబిడ్డలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవడం అనేది మా ప్రధాన లక్ష్యం’ అంటుంది నికిత. ఈ ట్రావెల్ గ్రూప్ ప్రత్యేకత ఏమిటంటే, ఒక ట్రిప్ ప్లాన్ చేయడానికి ముందు సాక్షి, నికితలలో ఒకరు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లి వస్తారు. అక్కడి పరిస్థితులను అంచనా వేస్తారు. రకరకాల జాగ్రత్తలు తీసుకుంటారు. ‘ట్రిప్ బుక్ చేసుకున్న వారి కోసం వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాం. దీనిద్వారా తల్లుల ఆహారపు అలవాట్లతో పాటు వారి ఇష్టయిష్టాలు, తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తల గురించి వివరంగా తెలుసుకునే అవకాశం దొరికింది’ అంటుంది సాక్షి. చెన్నై. బెంగళూరు, ముంబై, జైపుర్, కోచి, కోల్‌కతా... ఇలా ఎన్నో నగరాల నుంచి తల్లులు ఈ ట్రిప్‌లలో భాగం అవుతున్నారు. తన పిల్లాడితో కలిసి పాండిచ్చేరికి వెళ్లిన దీపిక ఇలా అంటుంది... ‘ట్రిప్‌ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు. ఎప్పుడైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు తిండి సహించేది కాదు. ఈ ప్రయాణంలో మాత్రం ఇంటి తిండిని మరిపించేలా చేశారు. ఈ ట్రిప్ ద్వారా ఎంతోమంది స్నేహితులయ్యారు’ ట్రిప్‌ల ద్వారా పరిచయం అయిన వారు ఒకరి ఇంటికి ఒకరు వెళ్లి కలుసుకోవడం, ఆ కుటుంబంలో వ్యక్తిలా మారడం మరో విషయం. ‘కిడ్–ఫ్రెండ్లీగా లేవని కొన్ని ప్రదేశాలకు దూరంగా ఉంటాం. అయితే పిల్లలు మొరాకో నుంచి ఈజిప్ట్ వరకు ఎక్కడైనా సరే తమ ఆనందాన్ని తామే వెదుక్కుంటారు. పిల్లలు పార్క్‌లు, జూలలలో మాత్రమే ఆనందిస్తారనేది సరికాదు’ అంటుంది సాక్షి. సింగిల్ మదర్స్ ఈ ట్రిప్స్‌పై ఆసక్తి ప్రదర్శించడం మరో కోణం. స్థూలంగా చెప్పాలంటే ‘ట్రావెల్ విత్ కిడ్స్’ తల్లుల పర్యాటక సంతోషానికి మాత్రమే పరిమితం కావడం లేదు. ఒకే రకంగా ఆలోచించే వారిని ఒక దగ్గరికి తీసుకువచ్చింది. కొత్త స్నేహితుల రూపంలో కొత్త బలాన్ని కానుకగా ఇస్తోంది. -
‘ఇన్‌స్టా’లో ‘బాయిస్’ బీభత్సం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో ‘బాయిస్ లాకర్ రూమ్’అనే గ్రూప్‌ను ఏర్పాటు చేసుకుని బాలికల ఫొటోలను మార్ఫింగ్ చేసి, వారిపై అసభ్యంగా కామెంట్స్ చేస్తున్న మైనర్ విద్యార్థులపై ఢిల్లీ పోలీస్‌కు చెందిన సైబర్ క్రైమ్ విభాగం చర్యలు తీసుకుంది. ఆ గ్రూప్ అడ్మిన్‌ను బుధవారం అదుపులోకి తీసుకుంది. అతడి నుంచి గ్రూప్‌లోని ఇతర విద్యార్థుల సమాచారం సేకరించింది. ఢిల్లీలోని 3 ప్రముఖ పాఠశాలలకు చెందిన విద్యార్థులుగా వారిని గుర్తించింది. బాలికల ఫొటోలను నగ్న ఫొటోలుగా మార్ఫ్ చేయడం, వాటిని ఆ గ్రూప్ చాట్ రూమ్‌లో షేర్ చేసుకుంటూ అసభ్యంగా, గ్యాంగ్ రేప్ చేయాలంటూ నేరపూరితంగా సందేశాలు పంపుకునేవారు. ఆ డిస్కషన్స్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇతర మాధ్యమాల్లో వైరల్ అయ్యి, సంచలనం సృష్టించడంతో సైబర్ క్రైమ్ రంగంలోకి దిగింది. ముఖ్యంగా ఒక బాలిక ఈ గ్రూప్ సంభాషణల స్క్రీన్ షాట్స్‌ను బహిర్గతపర్చడంతో మొదట ఈ గ్రూప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చదవండి: అమెరికాలో లాక్డౌన్ ఎత్తివేత ఫలితం? గ్రూప్‌లో 13–18 ఏళ్లలోపువారు.. నోయిడాలోని ఒక ప్రముఖ స్కూల్లో 12వ తరగతి పూర్తి చేసుకున్న 18 ఏళ్ల విద్యార్థి ఆ గ్రూప్ అడ్మిన్‌గా గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 27 మంది గ్రూప్ సభ్యులను పోలీసులు గుర్తించారు. వారి ఫోన్లను స్వాధీనం చేసుకుని ప్రశ్నిస్తున్నారు. వారిలో చాలామంది 11, 12 తరగతుల వారే. గ్రూప్‌లో 13 ఏళ్ల విద్యార్థి నుంచి 18 ఏళ్ల వయస్సున్న విద్యార్థి వరకు ఉన్నారు. ఆ గ్రూప్‌లోని మైనర్ సభ్యులను పోలీసులు వారి తల్లిదండ్రులు, ఎన్జీఓ ప్రతినిధుల ముందు ప్రశ్నిస్తున్నారు. మొత్తం 51 మంది సభ్యులున్నారని, మార్చి నెలాఖరులో తమను చేర్చుకున్నారని పలువురు విద్యార్థులు తెలిపారు. బాలికలు తమ ఇన్‌స్టాగ్రామ్‌ల్లో పోస్ట్ చేసుకున్న ఫొటోలను వీరు అసభ్యంగా మార్ఫ్ చేసి బాయిస్ లాకర్ రూమ్ గ్రూప్‌లో షేర్ చేసేవారు. ఈ గ్రూప్ వివరాలను ఇన్స్టాగ్రామ్ నుంచి కోరామని, వారి నుంచి సమాచారం కోసం ఎదురు చూస్తున్నామని పోలీసులు తెలిపారు. జువనైల్ జస్టిస్ చట్టం ప్రకారం మైనర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంపై ఢిల్లీ పోలీసులు, ఇన్‌స్టాగ్రామ్‌కు ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. కేసును సుమోటాగా స్వీకరించాలని కోరుతూ ఇద్దరు న్యాయవాదులు బుధవారం ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్ డీఎన్ పటేల్‌కు లేఖ రాశారు. పోక్సో, ఐటీ చట్టాలు, ఐపీసీ కింద వారిపై కేసులు నమోదు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరారు. చదవండి: డర్టీ ఛాట్ -
జిల్లాలో మావోయిస్టుల కదలికలు !
విజయవాడ క్రైం, న్యూస్‌లైన్ : జిల్లాలో మావోయిస్టుల కార్యకలాపాలు మళ్లీ మొదలయ్యాయా? శనివారం సీపీఐ మావోయిస్టు(ఎఎఎ) పేరిట పత్రికా కార్యాలయాలకు అందిన లేఖ అవుననే సమాధానం చెపుతోంది. రాష్ట్ర కార్యదర్శి సాగర్ పేరిట ఉన్న లేఖను జిల్లా కార్యదర్శిగా పేర్కొన్న అశోక్ పంపారు. జగ్గయ్యపేటలో బియ్యం కల్తీ, నకిలీ పురుగుల మందుల విక్రయాలు, అనధికారికంగా బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వహణ, గ్యాస్ పంపిణీ అక్రమాలపై వీరు దృష్టి సారించారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అధిక ఫీజుల వసూళ్లను నిలిపేయాలని డిమాండ్ చేశారు. మళ్లీ షురూ జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాలు మళ్లీ మొదలైనట్టు తెలుస్తోంది. గతంలో విజయవాడ నగరంలో నక్సల్స్ కార్యకలాపాలు సాగిన విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా జిల్లాను మావోయిస్టులు షెల్టర్ జోన్‌గానే వాడుకుంటున్నారు. అనారోగ్యానికి గురైన రాష్ట్ర స్థాయి నేతలు ఇక్కడ ఆశ్రయం తీసుకొని వైద్యం చేయించుకొని వెళుతున్నారు. కొత్త గ్రూపులు జిల్లాలో కొత్త గ్రూపుల ఏర్పాటు ద్వారా కార్యకలాపాలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మావోయిస్టు పార్టీ సహా అన్ని విప్లవ గ్రూపుల సమాచారం పోలీసుల వద్ద ఉంది. దీనిని నుంచి దృష్టి మరల్చి కార్యకలాపాల నిర్వహణకు కొత్త గ్రూపులు ఏర్పాటు చేసి ఉండొచ్చని తెలుస్తోంది. ఇందులో భాగంగానే సిపిఐ మావోయిస్టు(మార్క్సిస్టు-లెనినిస్టు)కు బదులుగా సీపీఐ మార్క్సిస్టు(ఎఎఎ) గ్రూపును ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇది వాస్తవం కాకపోవచ్చనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఢిల్లీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఏఏపీ) సత్తా చూపడంతో..దానిని పోలిన రీతిలో స్థానికుల్లో కొందరు అక్రమ వ్యాపారులను బెదిరించేందుకు మావోయిస్టుల పేరును వాడుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. టార్గెట్ జగ్గయ్యపేట ఖమ్మం, నల్గొండ జిల్లాల సరిహద్దు సమీపంలోని జగ్గయ్యపేట పట్టణాన్ని మావోయిస్టులు టార్గెట్‌గా ఎంచుకున్నట్టు చెప్పొచ్చు. ఈ రెండు జిల్లాల్లో కార్యకలాపాలు నిర్వహించే గ్రూపు లు జగ్గయ్యపేట పరిసర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ క్రమంలోనే స్థానికుల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఇక్కడ దృష్టి సారించినట్టు చెప్పొచ్చు. ఏదేమైనా జిల్లాలో మావోయిస్టుల పేరిట విడుదల చేసిన లేఖ కలకలం రేపుతోంది.