సాక్షి, నికిత
ప్రయాణాల మీద బోలెడు ఆసక్తి ఉన్నప్పటికీ పిల్లలు ఒక వయసు వచ్చాకగానీ ఇల్లు దాటని తల్లులు ఎందరో ఉంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్స్, డెంటిస్ట్‌లు సాక్షి గులాటీ, నికిత మాథుర్‌లు యంగ్ మదర్స్ కోసం ‘ట్రావెల్ విత్ కిడ్స్’ అనే ట్రావెల్ గ్రూప్‌ను ప్రారంభించారు. ప్రయాణాలలో తల్లీపిల్లలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నారు...
సాక్షి గులాటీ, నికిత మాథుర్‌లు పర్యాటక ప్రేమికులు. వృత్తిలో ఎంత బిజీగా ఉన్నా సరే ప్రయాణాలకు మాత్రం దూరంగా ఉండేవారు కాదు. నాలుగున్నర సంవత్సరాల క్రితం సాక్షి ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లడానికి ఆలోచనలు చేస్తున్నప్పుడు ‘చంటి బిడ్డతో ప్రయాణమా!!’ అని ఆశ్చర్యపోవడమే కాదు ప్రయాణాలు వద్దంటే వద్దన్నారు చాలామంది.
ఒక బిడ్డకు తల్లి అయిన నికితకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది.
ఎవరి మాటలు పట్టించుకోకుండా చెన్నైకి చెందిన సాక్షి తన మూడు నెలల బిడ్డతో కలిసి మహాబలిపురానికి వెళ్లింది. చాలా కాలం తరువాత పర్యాటక ప్రదేశానికి వచ్చింది. మరోవైపు బెంగళూరుకు చెందిన నికిత మూడు నెలల పిల్లాడితో కలిసి మైసూర్‌కు వెళ్లింది.
‘బేబీతో ప్రయాణం కష్టమని చాలామంది భయపెట్టారు. ఇది నిజం కాదని అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాను. మొదటి మూడు నాలుగు నెలలు మాత్రమే కష్టం’ అంటుంది సాక్షి.
చెన్నైలో ఉండే సాక్షి, బెంగళూరులో ఉండే నికితలు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యారు. ఒకే రకమైన వృత్తి, అభిరుచులు వారిని సన్నిహిత స్నేహితులుగా మార్చాయి.
సినిమాల నుంచి పర్యాటకం వరకు ఇద్దరు స్నేహితులు ఎన్నో విషయాలు మాట్లాడుకునేవారు. అలా ఒకరోజు వారి మధ్య చంటిబిడ్డలు ఉన్న తల్లుల ప్రస్తావన వచ్చింది.
మహిళల కోసం ఎన్నో ట్రావెల్ గ్రూప్స్ ఉన్నాయి. సోలో ట్రావెలర్స్, సీనియర్ సిటిజన్‌లు... మొదలైన వారి కోసం ఎన్నో ట్రావెల్ గ్రూప్స్ ఉన్నాయి. కాని మదర్స్ అండ్ కిడ్స్ కోసం మాత్రం లేవు. ఈ లోటును భర్తి చేయడానికి రెండు సంవత్సరాల క్రితం ‘ట్రావెల్ విత్ కిడ్స్’ పేరుతో ట్రావెల్ గ్రూప్‌ను ప్రారంభించారు.
తొలి ‘మదర్ అండ్ కిడ్స్’ ట్రిప్‌ను పాండిచ్చేరికి ప్లాన్ చేశారు.
సాక్షికి పాండిచ్చేరి కొట్టిన పిండి. పాండిచ్చేరి ట్రిప్‌కు సంబంధించిన వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తే మంచి స్పందన లభించింది. ఈ ట్రిపుల్ ఆరుగురు తల్లులు వారి పిల్లలను తీసుకువెళ్లారు. ఈ ప్రయాణం విజయవంతం కావడంతో ఇద్దరు స్నేహితులకు ఎంతో ఉత్సాహం వచ్చింది. ఆ తరువాత వివిధ ప్రాంతాలకు సంబంధించి అయిదు ట్రిప్‌లు ప్లాన్ చేశారు.
తమ వృత్తిలో బిజీగా ఉండే సాక్షి, నికితలు వీకెండ్స్‌లో ప్లానింగ్ చేస్తుంటారు.
‘చంటి బిడ్డలు ఉన్నారని ఇంటి నాలుగు గోడలకే పరిమితం కానక్కర్లేదు. బయటి ప్రపంచలోకి వస్తే కొత్త ఉత్సాహం, శక్తి వస్తాయి’ అంటున్నారు సాక్షి, నికిత.
‘పర్యాటక ప్రదేశాలకు వెళ్లి కొత్త అనుభూతిని సొంతం చేసుకునేలా చంటి బిడ్డల తల్లులను ప్రేరేపించడం ఒక లక్ష్యం అయితే, ప్రయాణాలలో తల్లీబిడ్డలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవడం అనేది మా ప్రధాన లక్ష్యం’ అంటుంది నికిత.
ఈ ట్రావెల్ గ్రూప్ ప్రత్యేకత ఏమిటంటే, ఒక ట్రిప్ ప్లాన్ చేయడానికి ముందు సాక్షి, నికితలలో ఒకరు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లి వస్తారు. అక్కడి పరిస్థితులను అంచనా వేస్తారు. రకరకాల జాగ్రత్తలు తీసుకుంటారు.
‘ట్రిప్ బుక్ చేసుకున్న వారి కోసం వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాం. దీనిద్వారా తల్లుల ఆహారపు అలవాట్లతో పాటు వారి ఇష్టయిష్టాలు, తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తల గురించి వివరంగా తెలుసుకునే అవకాశం దొరికింది’ అంటుంది సాక్షి.
చెన్నై. బెంగళూరు, ముంబై, జైపుర్, కోచి, కోల్‌కతా... ఇలా ఎన్నో నగరాల నుంచి తల్లులు ఈ ట్రిప్‌లలో భాగం అవుతున్నారు. తన పిల్లాడితో కలిసి పాండిచ్చేరికి వెళ్లిన దీపిక ఇలా అంటుంది...
‘ట్రిప్‌ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు. ఎప్పుడైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు తిండి సహించేది కాదు. ఈ ప్రయాణంలో మాత్రం ఇంటి తిండిని మరిపించేలా చేశారు. ఈ ట్రిప్ ద్వారా ఎంతోమంది స్నేహితులయ్యారు’
ట్రిప్‌ల ద్వారా పరిచయం అయిన వారు ఒకరి ఇంటికి ఒకరు వెళ్లి కలుసుకోవడం, ఆ కుటుంబంలో వ్యక్తిలా మారడం మరో విషయం.
‘కిడ్–ఫ్రెండ్లీగా లేవని కొన్ని ప్రదేశాలకు దూరంగా ఉంటాం. అయితే పిల్లలు మొరాకో నుంచి ఈజిప్ట్ వరకు ఎక్కడైనా సరే తమ ఆనందాన్ని తామే వెదుక్కుంటారు. పిల్లలు పార్క్‌లు, జూలలలో మాత్రమే ఆనందిస్తారనేది సరికాదు’ అంటుంది సాక్షి.
సింగిల్ మదర్స్ ఈ ట్రిప్స్‌పై ఆసక్తి ప్రదర్శించడం మరో కోణం. స్థూలంగా చెప్పాలంటే ‘ట్రావెల్ విత్ కిడ్స్’ తల్లుల పర్యాటక సంతోషానికి మాత్రమే పరిమితం కావడం లేదు. ఒకే రకంగా ఆలోచించే వారిని ఒక దగ్గరికి తీసుకువచ్చింది. కొత్త స్నేహితుల రూపంలో కొత్త బలాన్ని కానుకగా ఇస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment