
మిస్టరీ వీడని విద్యార్థినుల అదృశ్యం కేసు
తిరువూరు : పట్టణానికి చెందిన ఇరువురు విద్యార్థినులు 15 రోజుల క్రితం అదృశ్యమైన ఘటన రెండు కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నింపింది. ఈ కేసు మిస్టరీ ఇంతవరకూ వీడలేదు. తిరువూరు రాజుపేటకు చెందిన ధర్మపురి రాంబాబు కుమార్తె ఉమామహేశ్వరి జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో 9వ తరగతి, రోలుపడి శివారు సూరవరానికి చెందిన గోసు శ్రావణి స్థానిక ప్రైవేటు జూనియర్ కళాశాలలో ద్వితీయ ఇంటర్ చదువుతున్నారు. వారిద్దరు స్నేహితులు.
ఈ నెల 4 నుంచి కనిపించడంలేదని వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికల కోసం తాము బంధువుల ఇళ్లలో, తెలిసిన ప్రాంతాల్లో గాలించినా ప్రయోజనం లేదని పేర్కొన్నారు. తిరువూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారి దర్యాప్తులో బాలికలు ఇద్దరు మహిళలతో ఫోనులో మాట్లాడినట్టు గుర్తించారని పేర్కొన్నారు. బాలికల ఆచూకీ లభ్యం కాలేదని ఏఎస్‌ఐ మోహనరావు తెలిపారు.