రాజధానిలో కొత్త మోసాలు
► ఎకరాకు పది సెంట్లుఇస్తేనే పూలింగ్‌లో
► చేరుస్తామంటున్న అధికారులు
► లేదంటే పూలింగ్ నిలిపేస్తామని బెదిరింపు
► ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు
నీరుకొండ (తాడేపల్లి రూరల్): కంచె చేను మేస్తే..అన్న చందం గా ఉంది రాజధాని ప్రాంతంలో అధికారుల తీరు. కన్నతల్లిలాంటి భూములు వదులుకోవడానికి సిద్ధపడిన రైతులకు చేతనైనంత చేయూతనివ్వాల్సిన అధికా రులు దీనికి విరుద్ధంగా వ్యవహరి స్తున్నారు. రాజధాని అవసరం కోసం ప్రభుత్వం 25 వేల మంది రైతుల వద్ద నుంచి వేల ఎకరాలను తీసుకుని, వారి బాగోగులను మాత్రం పట్టించుకోవడం మాత్రం మానేసింది.
గతంలో ల్యాండ్ పూలింగ్‌కు ఇస్తామని ఏడాది క్రితం సీఆర్‌డీఏ అధికారులకు రాసిచ్చినా, ఇప్పటి వరకు స్పందన లేదని మంగళగిరి మండలం నీరుకొండకు చెందిన రైతులు ఆరోపిస్తున్నారు. ఎకరం పొలం పూలింగ్‌కు ఇస్తే పది సెంట్లు నజరానాగా ఇవ్వాలని ఓ అధికారి అల్టిమేటం జారీ చేశారని, అదేమంటే జిల్లా అధికారుల ఒత్తిళ్లు అంటూ సదరు అధికారిణి సెలవిస్తున్నారని వాపోతున్నారు. స్వచ్ఛందంగా భూము లు అప్పగించేందుకు సిద్ధమై సర్వే నిర్వహించాలని అడిగితే తనకున్న 1.5 ఎకరాల్లో పది సెంట్లు వేరే సర్వే నంబర్‌లో కేటాయించారని నీరుకొండకు చెందిన ఓ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఆ పది సెంట్ల భూమిని వారికి అమ్మినట్టు దస్తావేజులు రాయాలంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోతున్నాడు. తాడేపల్లికి చెందిన ఓ మహిళకు సర్వే నంబర్ 86(సీ)లో 1.5 ఎకరాల భూమి ఉంది. 86 సర్వే నంబర్‌లోనే ఓ జిల్లా అధికారి సన్నిహితుడు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి నాలుగు నెలల క్రితం అర ఎకరం పొలం కొనుగోలు చేశారు. ఆ భూమిని ఆఘమేఘాల మీద ల్యాండ్ పూలింగ్‌లో చేర్చారు. కానీ 86 (సీ)లో ఉన్న ఎకరన్నర పొలం ల్యాండ్ పూలింగ్‌కు ఇస్తామన్నా తీసుకోవడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘మీ పొలం ల్యాండ్ పూలింగ్‌కు తీసుకోవాలంటే పది సెంట్లు కేటాయించాలని, లేదంటే భూసేకరణ కింద భూమి పోతుందని, చాలా నష్టపోతార’ని అధికారులు బెదిరిస్తున్నట్లు చెబుతున్నారు.
సదరు వ్యక్తి భయపడి పది సెంట్లు ఇవ్వగా, మిగతా ఎకరం 40 సెంట్లు 86(ఈ)లో ఉన్నట్టు చెబుతున్నారని, మాకు చెందిన పది సెంట్ల భూమిని ఓ మహిళ అధికారి తమ కుటుంబ సభ్యుల పేరు మీద బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపిస్తున్నారు. నిడమర్రులో తమలా మోసపోయిన వారు చాలా మంది ఉన్నారని చెబుతున్నారు. కొందరు సీఆర్‌డీఏ అధికారులు బినామీ పేర్ల మీద ఇలా బెదిరించి భూములు రాయించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై విచారణ చేపట్టాలని కోరుతున్నారు.
వాస్తవమని తేలితే క్రిమినల్ కేసులు
నిజంగా అధికారులు అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకోవడమే కాకుండా, క్రిమినల్ కేసులు కూడా పెడతాం. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు రైతులు నేరుగా సీఆర్‌డీఏ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయొచ్చు. - చెన్నకేశవులు, సీఆర్‌డీఏ ల్యాండ్ పూలింగ్ డెరైక్టర్