
నెగ్గిన రాజకీయ ఒత్తిళ్లు
ఎస్పీ డాక్టర్ గజరావు భూపాల్ బదిలీ
నూతనఎస్పీగా విశాల్ గున్నీ
నెల్లూరు(క్రైమ్): జిల్లాలో రాజకీయ ఒత్తిళ్లే నెగ్గాయి. ప్రభుత్వం ఓటుబ్యాంకు రాజకీయాన్ని ప్రదర్శించింది. ఎస్పీ డాక్టర్ గజరావుభూపాల్‌ను సీఐడీకి బదిలీచేస్తూ ఆయన స్థానంలో డీజీపీ వీఆర్‌లో ఉన్న విశాల్‌గున్నీని నియమిస్తూ శనివారం డీజీపీ జె. వెంకటరాముడు ఉత్తర్వులు జారీచేశారు. జిల్లా ఎస్పీగా డాక్టర్ గజరావుభూపాల్ గతేడాది మార్చి 27వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. అన్ని వర్గాలకు అందుబాటులో ఉంటూ వచ్చారు. విధి నిర్వహణలో అవినీతి, అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని స్పష్టంచేశారు.
నిఘా విభాగమైన ఎస్‌బీలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీ స్థాయి అధికారిని బదిలీచేశారు. తప్పుచేసిన వారు ఏస్థాయిలో ఉన్నా, ఎవరైనా సరే చట్టానికి అందరూ సమానమని నిరూపించారు. నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైలుదోపిడీ ఘటనలో సూత్రధారి అప్పటి మార్కాపురం ఓఎస్‌డీ సమయ్‌జాన్‌రావును అరెస్ట్‌చేశారు. పోలీసు సిబ్బంది సంక్షేమానికి తనవంతు కృషిచేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించారు. అయితే అదేక్రమంలో ఆరోపణల ను మూటగట్టుకొన్నారు. కిందిస్థాయి సిబ్బందిని పట్టించుకోకుండా కేవలం అధికారులకే ప్రాధాన్యమిచ్చారన్న విమర్శలున్నాయి.
సిబ్బంది బదిలీల్లో అధికారులు,నేతల సిఫార్సులకే పెద్దపీట వేశారన్న అపవాదును మూటగట్టుకొన్నారు. బదిలీల వ్యవహరంలో పారదర్శకత లోపించిందని అప్పట్లో పోలీసు అధికారుల సంఘం బాహాటంగానే విమర్శలు గుప్పించింది.
జనవరి 30నాటి ఘటనే కారణం
యువత పెడత్రోవ పడుతోందని వారిని సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఓ వర్గం ప్రజలతో జనవరి 29న ఎస్పీ గజరావుభూపాల్ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన విధానం తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని ఆవర్గం ప్రజలు 30వ తేదీన ఒకటోనగర పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఎస్పీ క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. అక్కడికి వచ్చిన ఎస్పీ కారుపై దాడి చేశారు. దీంతో పోలీసులు వారిపై కేసులు నమో దు చేశారు. ఈ వివాదం చినికిచినికి గాలివనలా మారింది. ఎస్పీపై చర్యలు తీసుకోవాల్సిందేనని ఆవర్గం ప్రజలు పట్టుబట్టారు.
క్రమంలోనే అధికారపార్టీ నేతలు ఓటుబ్యాంకు రాజకీయం చేశారు. సంఘటనను సీఎం దృష్టికి తీసుకెళ్లి ఎస్పీ, నగర డీఎస్పీలను సస్పెండ్ చేయిస్తామని స్వయంగా ఎమ్మెల్సీ సోమిరెడ్డి ప్రకటించారు. ఎస్పీ బదిలీపై వారు సీఎంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే డాక్టర్ గజరావుభూపాల్ సైతం జిల్లాలో కొనసాగేందుకు ఇష్టపడలేదు. ఈనేపథ్యంలో గజరావుభూపాల్‌ను సీఐడీకి బదిలీచేస్తూ డీజీపీ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు.
నూతన ఎస్పీగా విశాల్‌గున్నీ
జిల్లా నూతన ఎస్పీగా విశాల్‌గున్నీని నియమించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆయన 2010 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. 2013 ఏప్రిల్ 14న ఆయన విశాఖ జిల్లా నర్సీపట్నం ఓఎస్‌డీగా బాధ్యతల్లో చేరారు. గిరిజనుల సంక్షేమం కోసం ఎంతో కృషిచేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు మావోల కార్యకలాపాలవైపు మొగ్గుచూపకుండా ఉండేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహించారు. వారందరికీ ఉపాధి మార్గాలు చూపించారు.
ఆయన పనిచేస్తున్న సమయంలోనే అనేకమంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారు. విధి నిర్వహణలో అందరి మన్ననలు పొందారు. విశాఖ రూరల్ ఏఎస్పీగా పనిచేశారు. ఇటీవల ఎస్పీగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం ఆయన డీజీపీ కార్యాలయంలో పోస్టింగ్ కోసం వేచి ఉన్నారు. తాజా బదిలీల్లో ఆయనను జిల్లా ఎస్పీగా నియమించారు. ఎస్పీగా పదోన్నతి పొందిన తర్వాత ఆయనకిది తొలి పోస్టింగ్.
నేడు బాధ్యతలు స్వీకరణ
జిల్లా ఎస్పీగా విశాల్‌గున్నీ ఆదివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో అధికారులు అవసరమైన ఏర్పాట్లును చేస్తున్నారు.