SP Vishal Gunni
-
‘నిర్భయంగా ఓటు వేయండి’
సాక్షి, జగ్గంపేట: జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ విశాల్ గున్నీ అన్నారు. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో మంగళవారం ఓటర్ల అవగాహన సదస్సులో పాల్గొన్న ఆయన కాట్రావులపల్లి గ్రామంలో మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 11న జరగనున్న ఎన్నికల్లో ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఎన్నికలను పకడ్బందీగా ఎదుర్కొనేందుకు పాత కేసులు, నాన్ బైయిలబుల్ వారెంట్లు ఉన్న నిందితులు ఐదు వేల మందిని బైండోవరు చేశామన్నారు. 22 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని ఇప్పటి వరకు రూ.కోటి స్వాధీనం చేసుకున్నామన్నారు. జిల్లా సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ బలగాలు వచ్చాయని, అదనంగా మరో ఆరు వేల ఫోర్సును కోరామన్నారు. ఏజన్సీలో 372 పోలింగ్ కేంద్రాల్లో సజావుగా ఎన్నికలు జరిగేలా చూస్తున్నామన్నారు. చత్తీస్ఘడ్, ఒడిశా సరిహద్దులో నిఘా ఉంచామన్నారు. మోడల్ కోడ్ ఉల్లంఘన, అసాంఘిక కార్యక్రమాలను ఎక్కడైనా జరిగితే వెంటనే ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన సీ విజల్ యాప్ ద్వారా ఫిర్యాదులు చేయాలని కేసు నమోదు చేసి తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో పెద్దాపురం డీఎస్పీ రామారావు, సీఐ రాంబాబు, ఎస్సై రామకృష్ణ పాల్గొన్నారు. -
పడవ ప్రమాదం.. మహిళ మృతదేహాం లభ్యం..
సాక్షి, తూర్పుగోదావరి : గోదావరిలో నదిలో గల్లంతైన వారిలో ఓ మహిళ మృతదేహాం లభ్యమైంది. కొమ్మలపల్లి వద్ద గల్లా నాగమణి మృతదేహాన్ని గాలింపు చర్యలో సిబ్బంది గుర్తించారు. గల్లంతైన ఆరుగురి విద్యార్ధుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సలాదివారిపాలెం లంక నుంచి పశువలలంకకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హెలికాఫ్టర్‌తో సెర్చ్ చేసినా స్పష్టత లేదు..! గోదావరి నదిలో గల్లంతైన విద్యార్థినుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. యానం బీచ్ నుంచి కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ విశాల్ గున్ని గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏకధాటిగా వర్షం కురుస్తున్నా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. రోజులో 45 నిమిషాలు మినహా వర్షం కురుస్తూనే ఉంది. అంతేకాక విద్యార్థినుల కోసం హెలికాప్టర్‌తో సెర్చ్ చేసినా స్పష్టత రావడం లేదని కలెక్టర్ చెప్పారు. రాత్రంతా గాలింపు చర్యలు కొనసాగిస్తామన్నారు. మూడు డ్రోన్లు కూడా వినియోగిస్తామని తెలిపారు. రేపు కూడా ఆపరేషన్ కొనసాగుతుందని తెలియజేశారు. గల్లంతైన విద్యార్ధుల వివరాలు.. తిరుకోటి ప్రియ(14), 8వ తరగతి, వలసలతిప్ప, ముమ్మిడివరం మండలం సుంకర శ్రీజ(15), 10వ తరగతి, సలాదివారి పాలెం పోలిశెట్టి వీర మనీషా(15), 10వ తరగతి పోలిశెట్టి అనూష(13), 9వ తరగతి, సలాదివారి పాలెం పోలిశెట్టి సుచిత్ర (11), 6 వ తరగతి, సలాది వారి పాలెం కొండేపూడి రమ్య(14), 9వ తరగతి, శేరిలంక -
గోదావరిలో పడవ ప్రమాదం.. ఓ మహిళ మృతదేహాం లభ్యం
-
ఈ వయస్సులో ఆపరేషన్ ఎందుకు?
తూర్పుగోదావరి, కాకినాడ రూరల్: తనయుడు బెదిరిస్తున్నాడంటూ సర్పవరం గ్రామానికి చెందిన పిట్టా అప్పారావు, పిట్టా లక్ష్మి అనే వృద్ధదంపతులు చేసిన ఫిర్యాదుపై చర్యలు చేపట్టాలని సర్పవరం సీఐని ఆదేశించినట్టు ఎస్పీ విశాల్ గున్ని సోమవారం ఒక ప్రకటనలో వివరించారు. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వమని వారు కోరలేదన్నారు. పిట్టా అప్పారావుకు కిడ్నీ పాడైనందున ఆపరేషన్ ఖర్చుల నిమిత్తం రూ.30 లక్షలు అవసరమవుతున్నందున తాను సంపాదించిన ఆస్తిలో కొంత ఆస్తిని అమ్మి వైద్యం చేయించుకోనేందుకు కుమారుడైన పిట్టా రవిని అడుగా ‘‘ఈ వయస్సులో ఆపరేషన్ ఎందుకు? ఇంకా ఎంత కాలం బతుకుతారు’’ అని అవమానపరిచినట్టుగా మాట్లాడాడని ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై వారి పరిస్థితిని అర్థం చేసుకొని చట్టప్రకారం సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని సర్పవరం సీఐని ఆదేశించినట్టు తెలిపారు. ఆత్మహత్యలకు అనుమతివ్వడం అనే విషయం చట్టపరిధిలోకి రాదని, పైగా ఆత్మహత్య అనేది చట్టప్రకారం నేరమన్నారు. దీనిని ఎవరూ ప్రోత్సహించరని, ప్రోత్సహించినా నేరమేనన్నారు. -
హెచ్‌సీయూ వీసీ హత్యకు కుట్ర!
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్‌సీయూ) వైస్ ఛాన్సులర్ అప్పారావు హత్యకుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఇందుకు సంబంధించి ఇద్దరు హెచ్‌సీయూ విద్యార్థులను తూర్పు గోదావరి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రాచలం-చర్ల రహదారిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా హెచ్‌సీయూ విద్యార్థులు చందన్ మిశ్రా, పృధ్వీరాజ్ పోలీసులకు చిక్కారు. కాగా 2013లో రోహిత్ వేముల ఆత్మహత్యకు ప్రతీకారంగా వీసీ అప్పారావు హత్యకు వీరు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర చంద్రన్నదళ సెంట్రల్ కమిటీ సభ్యుడు హరిభూషణ్ అలియాస్ యాపా నారాయణ ఆదేశాలతో హత్యకు స్కెచ్ వేసినట్లు పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించారు. హెచ్‌సీయూలో ఎంఏ చదువుతున్న చందన్ కుమార్ మిశ్రా కోల్‌కతా వాసి. ఇక అంకల పృధ్వీరాజ్ కృష్ణాజిల్లా కేసరపల్లికు చెందినవాడు. వీరిద్దరికీ హెచ్‌సీయూలో పరిచయం ఉన్నట్లు జిల్లా ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. వీరిని శనివారం మీడియా ఎదుట హాజరు పరిచారు. మరోవైపు వీరిద్దర్ని వారం క్రితమే పోలీసులు పట్టుకున్నారని విరసం ఆరోపిస్తోంది. వారిద్దరినీ విడుదల చేయాలని విరసం ఇప్పటికే పోస్టర్లు విడుదల చేసింది. ఇక ఈ ఘటనపై హెచ్‌సీయూ వీసీ అప్పారావు స్పందిస్తూ...‘నాకు ఎటువంటి బెదిరింపులు రాలేదు. నన్ను చంపడం కోసం ఎవరు కుట్ర చేశారో కూడా తెలియదు. పోలీసులు కూడా నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ప్రస్తుతం హెచ్‌సీయూ ప్రశాంతంగా ఉంది.’ అని అన్నారు. -
కాకికాడలో శిశువు కిడ్నాప్ కేసు సుఖాంతం
సాక్షి, కాకినాడ : మూడు రోజుల క్రితం ప్రభుత్వ ఆస్పత్రిలో అపహరణకు గురైన శిశువు ఉదంతం సుఖాంతమైంది. అపహరణకు గురైన బుజ్జాయి ఆచూకీని పోలీసులు గుర్తించారు. శిశువును అపహరించిన మహిళను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ ఆ శిశువును తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా మూడు రోజుల క్రితం ముఖానికి ముసుగు ధరించి వచ్చిన ఓ మహిళ ... ప్రసూతి ఆస్పతి వార్డులో ఉన్న గంటా లక్ష్మి అనే మహిళ అనే బాలింత నుంచి ఒక్కరోజు వయస్సు ఉన్న ఆడశిశువును వ్యాక్సిన్ కోసమని నమ్మబలికి వెంట తీసుకు వెళ్లింది. చిన్నారి అమ్మమ్మ వెళ్లినా.. ఆమె కళ్లుగప్పి..శిశువును ఆగంతకురాలు అపహరించింది. సీసీ కెమెరాల పుటేజ్ ఆధారంగా పోలీసులు ఐ.పోలవరం మండలం ఎర్రగరువు గ్రామానికి చెందిన పండు రమణ అనే అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుండి శిశివును తీసుకుని తల్లి లక్ష్మీకి అందజేశారు. నిందితురాలు గతంలో కాకినాడలోని ఓ కార్పోరేట్ ఆసుపత్రిలో నర్సుగా పని చేసిందని...అయితే ఆరు నెలల క్రిందట ఆమెకు అబార్షన్ కావడంతో పిల్లలపై మమకారంతో కిడ్నాప్‌కు పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు. -
అభ్యర్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలి
కళాశాలల యాజమాన్యాలకు ఎస్పీ సూచన నెల్లూరు(క్రైమ్): కానిస్టేబుల్ ఉద్యోగ ఎంపికలకు హాజరయ్యే అభ్యర్థులకు కళాశాలల యాజమాన్యాలు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఎస్పీ విశాల్‌గున్నీ సూచించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 19వ తేదీ నుంచి పోలీసు కవాతుమైదానంలో పోలీసు కానిస్టేబుల్స్, జైలువార్డర్ల ఉద్యోగాలకు సంబంధించి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. పరీక్షలకు అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని ఇప్పటికే పలుమార్లు ప్రకటించామన్నారు. అయితే కొందరు అభ్యర్థులు సర్టిఫికెట్లు తీసుకురావడం లేదనీ, ఇదేమని అడిగితే కళాశాలలో ఉన్నాయని చెబుతున్నారన్నారు. దీనివల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఎవరైనా ఉద్యోగ ఎంపికలకు హాజరు కావ్వాల్సిన సమయంలో సరైన ఆధారాలు చూపి కళాశాల నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్లు తెచ్చుకోవచ్చని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని కళాశాలల యాజమాన్యాలు కానిస్టేబుల్ ఎంపికలకు హాజరయ్యే అభ్యర్థులు సరైన ఆధారాలు చూపి సర్టిఫికెట్లు కావాలని కోరితే వెంటనే ఇవ్వాలని సూచించారు. లేని పక్షంలో సదరు కళాశాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా కొందరు కళాశాలల యాజమాన్యాలు అభ్యర్థులు సర్టిఫికెట్ల కోసం వెళితే డబ్బులు అడుగుతున్నారని, డబ్బులు ఇస్తేనే సర్టిఫికెట్లు ఇస్తున్నారనే విషయాల తమ దృష్టికి వస్తున్నాయన్నారు. అలాంటి కళాశాలలపై సైతం చర్యలు తప్పవని ఆయన పేర్కొన్నారు. -
ఫ్రెండ్లీ పోలీస్ విధాన అమలు
కావలి డీఎస్పీ కార్యాలయంలో నూతన చాంబర్ ప్రారంభోత్సవంలో ఎస్పీ కావలిరూరల్ : జిల్లాలో ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని అమలు చేసే లక్ష్యంతో పనిచేస్తున్నామని జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ అన్నారు. బుధవారం ఆయన కావలి పట్టణంలో పర్యటించారు. ఈసందర్భంగా డీఎస్పీ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన డీఎస్పీ చాంబర్‌ను ప్రారంభించారు. అనంతరం విజిటర్స్‌బుక్‌లో తన సందేశాన్ని రాశారు. తర్వాత ఒకటో టౌన్ పోలీస్‌స్టేషన్‌లో నూతనంగా ఏర్పాటుచేసిన రిసెప్షన్ కేంద్రం, గార్డెనింగ్లను ప్రారంభించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌ను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సమస్యలు చెప్పుకొనేందుకు వచ్చే ఫిర్యాదుదారులను రిసెప్షన్లో ఽస్థిమితంగా కూర్చోబెట్టి స్నేహపూరిత వాతావరణంలో వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఫ్రెండ్లీ పోలీస్‌లో భాగంగా స్టేషన్లను ఆధునీకరించి వసతులు కల్పిస్తున్నామన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ శరత్‌బాబు, కావలి ఆర్డీఓ లక్ష్మీనరసింహం, డీఎస్పీ ఎస్.రాఘవరావు, సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది, పలువురు రాజకీయ, వ్యాపార ప్రముఖులు పాల్గొన్నారు. పోలీసు కుటుంబాల కలయిక: డీఎస్పీ కార్యాలయంలో పోలీసు కుటుంబాలతో గెట్ టూ గెదర్ ఏర్పాటుచేశారు. ఈకార్యక్రమంలో ఎస్పీ సతీమణితోబాటు డీఎస్పీ, సీఐలు, ఎస్సైలు, వారి కుటుంభసభ్యులతో కలిసి హాజరయ్యారు. దీంతో అక్కడ పండుగ వాతావారణం నెలకొంది. -
నేరాలు అదుపునకు ప్రత్యేక చర్యలు
జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ వెంకటాచలం : జిల్లాలో నేరాల అదుపునకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ చెప్పారు. నూతనంగా నిర్మించిన వెంకటాచలం పోలీస్‌స్టేషన్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో కార్పొరేట్ కార్యాలయానికి దీటుగా వెంకటాచలం పోలీస్‌స్టేషన్‌ను తీర్చిదిద్దడంలో కృషి చేసిన సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ వెంకటేశ్వరరావును ఎస్పీ అభినందించారు. జిల్లాలో 4 వేలకు పైగా పెండింగ్ కేసులున్నట్లు వివరించారు. మూడు నెలల్లో ప్రణాళికతో కేసులు పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామన్నారు. వెంకటాచలంలోని టోల్‌ప్లాజా వద్ద బంగారు బిస్కెట్ల దోపిడీ కేసు, జిల్లా కోర్టులో బాంబు పేలుడు కేసుల్లో ఇప్పటికే పురోగతి సాధించామన్నారు. బాంబు పేలుడు కేసులో అన్నీ ఆధారాలు సేకరించామన్నారు. బంగారు బిస్కెట్ల దోపిడీ కేసును సీఐ శ్రీనివాసరెడ్డి ఆ«ధ్వర్యంలో నిందితులను పట్టుకునేందుకు విచారణ జరుగుతుందన్నారు. జిల్లాలో కొత్త రూ.500, రూ.2 వేలు నోట్లు అందుబాటులో ఉన్నందున ప్రజలకు వారం తర్వాత కష్టాలు ఉండబోవని చెప్పారు. ఆయన వెంట రూరల్ డీఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి, సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ వెంకటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
భద్రతా ప్రమాణాలను పెంచండి
ఎస్పీ విశాల్‌గున్నీ నెల్లూరు(క్రైమ్): జిల్లా కేంద్రకారాగారంలో భద్రతా ప్రమాణాలను పెంచాలని ఎస్పీ విశాల్‌గున్నీ జైలు అధికారులకు సూచించారు. చెముడుగుంటలోని జిల్లా కేంద్రకారాగారంలో ఎస్పీ విశాల్‌గున్నీ జైలు అధికారులతో శుక్రవారం జిల్లాస్థాయి సెక్యూరిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఎస్పీ కారాగారంలో భద్రతా ఏర్పాట్లను, కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌ను పరిశీలించి పలు సూచనలు, సలహాలిచ్చారు. ఖైదీలతో ముఖాముఖి నిర్వహించి వారికందుతోన్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఓపెన్ ఎయిర్ (ఆరుబయలుక్షేత్రం)ను పరిశీలించి భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు. కారాగారం ప్రధాన ద్వారం వద్ద భద్రతను మరింత పెంచాలన్నారు. మెటల్ డిటెక్టర్లను, హ్యాండ్ డిటెక్టర్లను ఏర్పాటుచేసి ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే కారాగారంలోకి అనుమతించాలన్నారు. గార్డెనింగ్ స్టాఫ్ సంఖ్యను పెంచడంతో పాటు సెల్‌ఫోను జామర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఓపన్ఎయిర్ జైలులో జనరేటర్‌ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కేంద్రకారాగార సూపరింటెండెంట్ ఎంఆర్ రవికిరణ్, డిప్యూటీ జైలు సూపరింటెండెంట్ అంజయ్య, జైలర్లు కాంతరాజు, శివప్రసాద్, జైలు అధికారులు పాల్గొన్నారు. -
పనితీరు మెరుగుపడాలి
నేరాల నియంత్రణకు ప్రణాళిక ప్రజలకు మెరుగైన సేవలు నేర సమీక్షలో ఎస్పీ విశాల్‌గున్నీ నెల్లూరు (క్రైమ్): మారుతున్న కాలానికి అనుగుణంగా పని తీరు మెరుగుపరచుకుని ప్రజలకు మెరుగైన సేవలందించాలని ఎస్పీ విశాల్‌గున్నీ సిబ్బందికి సూచించారు. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. స్థానిక ఉమేష్‌చంద్రా మెమోరియల్ కాన్ఫరెన్స్‌హాలులో గురువారం ఆయన నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. సర్కిల్స్ వారీగా కేసులను పరిశీలించారు. కేసుల పెండెన్సీని తగ్గించాలని సూచించారు. ‘మన ఊరు–మన పోలీసు’ కార్యక్రమం అమలు తీరుపై సమీక్షింఽచ్చారు. బాధితుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించి వారి సమస్యను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల కోసమే తాము పని చేస్తున్నామని మనకు మనం చెప్పుకునే కంటే బాధితులే మన సేవలపై ప్రచార కర్తలుగా మెలిగే విధంగా నడుచుకోవాలని సిబ్బందికి సూచించారు. దొంగతనాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. పాతనేరస్తుల కదలికలపై నిఘా ఉంచడంతో పాటు గస్తీని ముమ్మరం చేయాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులపై నిçఘా ఉంచాలన్నారు. విజిబుల్ పోలీసింగ్‌ను నిర్వహించాలన్నారు. దొంగతనాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పాతనోట్ల రద్దు నేపథ్యంలో ఉత్పన్నమవుతున్న సమస్యలను చాకచక్యంగా పరిష్కరించాలన్నారు. బ్యాంకుల వద్ద, ఏటీఎం కేంద్రాల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. దూకుడుగా వ్యవహరించకుండా చట్టపరిధికి లోబడి చర్యలు తీసుకోవాలనిసూచించారు. నగదు అక్రమ రవాణా, నోట్లమార్పిడి పేరిట మోసాలపై కఠినంగా వ్యవహరించాలన్నారు. బాధితులకు అండగా నిలవని.. సరిగా స్పందించని.. పారదర్శకంగా విధులు నిర్వహించని వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాఫిక్ అధికారులపై అసహనం ట్రాఫిక్ అధికారులపై ఎస్పీ విశాల్‌గున్నీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నెల్లూరు నగర వాసులకు మెరుగైన ట్రాఫిక్‌ను అందించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నా ఫలితాలు నామమాత్రంగా ఉండటంపై ఆయన మండిపడ్డారు. ప్రతి రోజు ట్రాఫిక్‌పై తనకు ఫిర్యాదులు అందుతున్నాయని, దీన్ని బట్టి అధికారులు, సిబ్బంది పనితీరు ఏ పాటిదో చెప్పాల్సిన అవసరం లేదన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వీడకపోతే ఎవరూ కాపాడరని సిబ్బందిని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ బి. శరత్‌బాబు, ఏఆర్ ఏఎస్పీ వీరభద్రుడు, క్రైం ఓఎస్డీ విఠలేశ్వర్, డీఎస్పీలు ఎన్. కోటారెడ్డి, జి. వెంకటరాముడు, తిరుమలేశ్వర్‌రెడ్డి, సుబ్బారెడ్డి, రాఘవరావు, శ్రీనివాసులు, శ్రీనివాసాచారి, బాలసుందరం, సుధాకర్, శ్రీనివాసరావు, రామారావు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
ఆందోళన చెందొద్దు
డిసెంబర్ 31 వరకు నోట్లు మార్చుకోవచ్చు టోల్‌ప్లాజాల్లో టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు శని, ఆదివారాల్లో బ్యాంక్ సేవలు సమస్యలెదురైతే 1090, 1091ను సంప్రదించండి బ్యాంకర్లు, వ్యాపార సంస్థల ప్రతినిధుల సమావేశంలో ఎస్పీ నెల్లూరు(క్రైమ్): డిసెంబర్ 31వ తేదీ వరకు రూ.500, రూ.1,000 నోట్లు మార్చుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటి నుంచే కొందరు అవి చెల్లవని ప్రచారం చేస్తూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోన్నారని అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ విశాల్‌గున్నీ స్పష్టం చేశారు. నగరంలోని ఉమేష్‌చంద్రా మెమోరియల్ కాన్ఫరెన్స్‌హాలులో ఆయన బుధవారం రాత్రి బ్యాంక్ అధికారులు, పోస్ట్‌మాస్టర్ జనరల్, చాంబర్ ఆఫ్ కామర్స్, ట్రేడ్యూనియన్లు, వ్యాపారసంస్థల ప్రతినిధులతో ఎస్పీ సమావేశం నిర్వహించారు. అనంతరం‡ ఆయన మాట్లాడుతూ మంగళవారం రాత్రి ప్రధాని నరేంద్రమోదీ రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారన్నారు. అయితే వాటిని రద్దు చేసినా నోట్ల విలువ మారదన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఎవరైనా ప్రజలు తమ అవసరాలకు రూ. 500, రూ 1,000 నోట్లు నిర్ణీత గడవు లోపల ఇస్తే వ్యాపార వర్గాలు, బ్యాంక్‌లు తీసుకోవాలని సూచించారు. ప్రజలు నోట్ల మార్పిడితో సహా అన్ని లావాదేవీలు సజవుగా జరిగేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని వర్గాలతో కలిసి సమన్వయంతో పని చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. సీనియర్ బ్యాంక్ అధికారులు ఆర్బీఐ నిబంధనల మేరకు అదనపు కౌంటర్లు, అదనపు సమయంలో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అన్ని ఆర్టీసీ, రైల్వేస్టేషన్లు, మీసేవ, హాస్పిటల్స్‌తో పాటు అన్నీ నిత్యావసర విభాగాల వ్యాపార సంస్థల్లో రూ. 500, రూ1000నోట్లు స్వీకరించబడుతాయన్నారు. 11వ తేదీ వరకు టోల్‌ప్లాజాల వద్ద రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. అన్నీ బ్యాంకులు ప్రజల సౌకర్యం కోసం శని, ఆదివారాల్లో కూడా పనిచేస్తాయని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా 1090, 1091లకు ఫోనుచేయ్యవచ్చని తగిన చర్యలు తీసుకొంటామని తెలిపారు. ఈ సమావేశంలో ఎఎస్పీ బి. శరత్‌బాబు, బ్యాంక్ సీనియర్ అధికారులు, పోస్టుమాస్టర్ జనరల్, చాంబర్ ఆఫ్ కామర్స్, వ్యాపార సంస్థల ప్రతినిధులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
మెరుగైన ట్రాఫిక్‌ను అందించాలి
ఎస్పీ విశాల్‌గున్నీ నెల్లూరు(క్రైమ్): నగర ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన ట్రాఫిక్‌ను అందించాలని ఎస్పీ విశాల్‌గున్నీ సూచించారు. నగరంలో బుధవారం రాత్రి ఎస్పీ పర్యటించి ట్రాఫిక్ తీరు తెన్నులను పరిశీలించారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ అధ్వానంగా ఉండటంతో తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో పాటు ఏమి చేస్తున్నారంటూ ట్రాఫిక్ అధికారులపై మండిపడ్డారు. వీఆర్సీ సెంటర్ నుంచి జెడ్పీకి వెళ్లే రహదారి మొదట్లో ట్రాన్స్ఫార్మర్ రోడ్డుపైకి వచ్చి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తుండటాన్ని గుర్తించిన ఎస్పీ వెంటనే విద్యుత్ అధికారులతో మాట్లాడి ట్రాన్స్ఫార్మర్ను ఓ పక్కగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తన చాంబర్లో ట్రాఫిక్, నగర పోలీస్ అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో ట్రాఫిక్ పరిస్థితి రోజురోజుకూ అధ్వానంగా మారుతోందని అసహనం వ్యక్తం చేశారు. ఎక్కడపడితే అక్కడ వాహనాలను నిలిపేస్తున్నా.. తోపుడుబండ్లను రోడ్లపైనే పెడతున్నా.. నో పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలను ఆపుతున్నా పట్టించుకోరానని ప్రశ్నించారు. నగర ట్రాఫిక్‌పై ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని, పనితీరును మార్చుకోకపోతే సిబ్బందిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నగర పోలీసులు రోజూ సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల వరకు విజిబుల్ పోలీసింగ్‌ను నిర్వహించాలన్నారు. ఏదో ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా స్టేషన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించడంతో పాటు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వన్‌వేలను ఏర్పాటు చేయండి నగరంలోని రద్దీ ప్రాంతాలను గుర్తించి వన్‌వేలను ఏర్పాటు చేయాలన్నారు. నో పార్కింగ్, యూ టర్న్, తదితరాలకు సంబంధించిన సైన్బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎక్కడపడితే అక్కడ ఆటో స్టాండ్లను ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను నగరంలోకి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదన్నారు. కోవూరు వైపు నుంచి వచ్చే వాహనాలను రైల్వేస్టేషన్ వద్ద, కోడూరు వైపు నుంచి వచ్చే వాహనాలను స్టోన్‌హౌస్‌పేట వద్ద, ముత్తుకూరు నుంచి వచ్చే వాహనాలను ముత్తుకూరు బస్టాండ్ వద్ద, అలా అన్ని ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను నగర శివార్లకే పరిమితం చేయాలన్నారు. వాహనాలకు సంబంధించిన పత్రాల్లేకపోతే కేసులు నమోదు చేయాలని సూచించారు. కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌లో ఓ ఎస్సైను ఏర్పాటు చేస్తున్నామని, ఆయన ట్రాఫిక్‌ను పరిశీలించి తగిన సూచనలిస్తారని వివరించారు. కొన్ని రహదారులు ఆక్రమణకు గురయ్యాయని, వీటిని గుర్తించి సంబంధిత అధికారుల సహకారంతో తొలగించాలని చెప్పారు. ప్రజలు సహకరించాలి ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు. సీసీ కెమెరాల ఫుటేజీతో ఆయా వాహనదారులకు ఈ చలాన్‌ను ఇంటికే పంపుతున్నామన్నారు. వాహనానికి సంబంధించిన పత్రాలను తమ వెంట ఉంచుకోవాలని కోరారు. తనిఖీ సమయాల్లో వాహన పత్రాల్లేకపోతే వాహనాన్ని సీజ్ చేస్తామన్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఐల్యాండ్లను కుదించాల్సి ఉందని, రెండో విడతలో చేస్తామన్నారు. ఏఎస్పీ శరత్‌బాబు, ఎస్బీ, నగర, ట్రాఫిక్ డీఎస్పీలు కోటారెడ్డి, వెంకటరాముడు, నిమ్మగడ్డ రామారావు, నగర ఇన్స్పెక్టర్లు రామకృష్ణారెడ్డి, రామారావు, సీతారామయ్య, మంగారావు, తదితరులు పాల్గొన్నారు. -
భద్రత కట్టుదిట్టం
వీఐపీలకు భద్రత పెంపు క్విక్ రెస్పాన్స్ టీంలు ఏర్పాటు ఎస్పీ విశాల్‌గున్నీ నెల్లూరు (క్రైమ్) : మావోల బంద్ నేపథ్యంలో జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశామని ఎస్పీ విశాల్‌గున్నీ వెల్లడించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏఓబీ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోలు బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో సిబ్బందిని అప్రమత్తం చేయడంతో పాటు అటవీ ప్రాంతంలో కూంబింగ్ జరుగుతుందన్నారు. తీరప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేశామన్నారు. సివిల్ పోలీసులతో పాటు మెరైన్, సీఐఎస్ఎఫ్ సిబ్బంది తనిఖీలు చేపట్టాయన్నారు. జాతీయ రహదారి వెంబడి వాహన తనిఖీలు సాగుతున్నాయని, అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. కోర్టులో మాదిరిగా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయంలో మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే కార్యాలయాల్లోకి అనుమతించేలా చర్యలు తీసుకున్నామన్నారు. జనచైతన్య యాత్రలో పాల్గొనే వీఐపీలతో పాటు జిల్లాలోని ప్రజాప్రతినిధులకు భద్రతను పెంచామన్నారు. వారు పర్యటించే ప్రాంతాలో బాంబ్, డాగ్స్క్వాడ్లతో తనిఖీలు చేపట్టామని చెప్పారు. ప్రతి సబ్‌డివిజన్‌కు ఒక్కో క్విక్ రెస్పాన్స్ టీంను ఏర్పాటు చేశామన్నారు. టీంలో ఆరుగురు సభ్యులు ఉంటారని, వీరు ఏదైనా సంఘటన జరిగిన వెంటనే ఆయా ప్రాంతాలకు వెళ్లి అవసరమైన చర్యలు తీసుకుంటారన్నారు. ప్రజలు తమ ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు తారసపడినా, అసాంఘిక శక్తుల కదలికలు ఉన్నా వెంటనే పబ్లిక్ ఐ 93907 77727 నంబరుకు ఫోన్ చేసి సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. -
నాణ్యతతో పెట్రోల్ బంకు నిర్వహణ
ఎస్పీ విశాల్ గున్నీ నెల్లూరు(క్రైమ్): నాణ్యత ప్రమాణాలతో పోలీస్ పెట్రోల్‌బంకును నిర్వహిస్తామని ఎస్పీ విశాల్‌గున్నీ వెల్లడించారు. పోలీస్ కవాతు మైదానానికి సంబంధించిన స్థలంలో హిందుస్థాన్ పెట్రోలియం సహకారంతో ఏర్పాటు చేసిన పోలీస్ పెట్రోల్ బంకును బుధవారం ప్రారంభించిన అనంతరం ఎస్పీ మాట్లాడారు. జిల్లా ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలను అందిస్తున్నామని, అదే విధంగా నాణ్యత ప్రమాణాలతో పెట్రోల్, డీజిల్‌ను ప్రజలకు అందిస్తామని చెప్పారు. పెట్రోల్ బంకు ద్వారా వచ్చే ఆదాయాన్ని జిల్లా పోలీస్ సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమానికి వెచ్చిస్తామన్నారు. అనంతరం ఆయనే స్వయంగా పలు వాహనాలకు డీజిల్, పెట్రోల్ పట్టారు. అడిషనల్ ఎస్పీ శరత్‌బాబు, హెచ్‌పీసీఎల్ మేనేజర్ సత్యనారాయణ, డిప్యూటీ మేనేజర్లు చంద్రకాంత్, పవన్‌కుమార్, క్రైమ్ఓఎస్డీ విఠలేశ్వర్, డీఎస్పీలు కోటారెడ్డి, జీవీ రాముడు, చెంచురెడ్డి, శ్రీనివాసరావు, సుధాకర్, నిమ్మగడ్డ రామారావు, తదితరులు పాల్గొన్నారు. -
అమర వీరుల ఆశయాలను సాధిద్దాం
సంస్మరణ సభలో కలెక్టర్ ముత్యాలరాజు నెల్లూరు(క్రై మ్): శాంతి భద్రతల పరిరక్షణలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలు అజారామరమని కలెక్టర్ ఆర్ ముత్యారాజు కొనియాడారు. వారి ఆశయసాధనకు అందరం కలిసికట్టుగా కృషిచేద్దామని పిలుపునిచ్చారు. స్థానిక పోలీసు కవాతు మైదానంలో శుక్రవారం అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించాచారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లోని జవాన్లు యుద్ధం వచ్చినప్పుడే పోరాటం చేస్తారన్నారు. పోలీసులు సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు నిత్యం పోరాడుతూనే ఉంటారన్నారు. పోలీసు విధి నిర్వహణ కత్తిమీద సామేనన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలను కోల్పోయిన అమరుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ, సమాజ సంరక్షణలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఎస్పీ విశాల్‌గున్నీ మాట్లాడుతూ దేశ, సమాజ రక్షణలో అసువులు బాసిన వారి పవిత్ర బలిదానం, త్యాగనిరతి అందరికి స్పూర్తిదాయకమన్నారు. అవినీతి, అక్రమాలకు దూరంగా ఉంటూ సమాజంలో మెరుగైన శాంతిభద్రతలను ప్రజలకు అందించడమే అమరులకు ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. జిల్లాలో ఈ ఏడాది 16 మంది విధి నిర్వహణలో మృతి చెందారనీ, వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. అనంతరం జిల్లా అదనపు ఎస్పీ బీ శరత్‌బాబు ఈ ఏడాది విధి నిర్వహణలో దేశవ్యాప్తంగా మృతిచెందిన అమరవీరుల పేర్లను చదివి వారికి నివాళులర్పించారు. అమర వీరులకు నివాళి పోలీసు గ్రౌండ్‌లోని అమర వీరుల స్థూపానికి కలెక్టర్ ముత్యాలరాజు, ఎస్పీ విశాల్‌గున్నీ నివాళులర్పించారు. అలాగే ఏఎస్పీలు బీ శరత్‌బాబు, సూరిబాబు, క్రైం ఓఎస్డి విఠలేశ్వర్, డీఎస్పీలు ఎన్ కోటారెడ్డి, జీ వెంకటరాముడు, కే తిరుమలేశ్వర్‌రెడ్డి, నమ్మగడ్డ రామారావు, బాలసుందరం, శ్రీనివాసరావు, చెంచురెడ్డి, కే శ్రీనివాసరావు, ఏపీ పోలీసు అధికారుల సేవా సంఘం అధ్యక్షుడు మద్దిపాటి ప్రసాదరావు, తదితరులు పాల్గొన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటాం స్థానిక ఉమేష్‌చంద్రా మెమోరియల్ కాన్ఫరెన్స్ హాల్లో పోలీసు అమరవీరుల కుటుంబాలతో కలెక్టర్, ఎస్పీలు సమావేశమై వారి సమస్యలపై చర్చించారు. షరతులతో కూడిన కారుణ్య నియామకాలు ఇవ్వాలనీ, చనిపోయిన పోలీసు కుటుంబాలకు తహసీల్దార్ కార్యాలయంలో త్వరితగతిన సర్టిఫికెట్లు మంజూరు చేయాలని, ఇళ్లస్థలాలను కేటాయించాలని పోలీసు అధికారుల సంఘ నాయకులు కలెక్టర్, ఎస్పీలను కోరారు. ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని ఎస్పీ సైతం కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్ స్పందిస్తూ బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు. కారుణ్యనియామకాలు ఆలస్యమైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎస్పీ బాధిత కుటుంబసభ్యులకు బెనిఫిట్స్‌కు సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు. బాధితుల కుటుంబ సభ్యులతో కలిసి ఎస్పీ, ఏఎస్పీ, పోలీసు అధికారులు, పోలీసు అసోసియేషన్ సభ్యులు భోజనం చేశారు. -
భారీ భద్రత ఏర్పాట్లు
నెల్లూరు(క్రైమ్): రొట్టెల పండగ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. దర్గాకు వెళ్లే మూడు రహదారుల్లో మెటల్ డిటెక్టర్లు, హ్యాండ్‌మేడ్ డిటెక్టర్లను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కర్నీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే దర్గా ఆవరణలోకి అనుమతిస్తున్నారు. స్వర్ణాల చెరువు వద్ద భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రత్యేక సేవాదళ్ సిబ్బంది దర్గా ఆవరణలో తిరుగుతూ వయోవృద్ధులు, వికలాంగులను దగ్గరుండి దర్గాను దర్శించుకునేలా చర్యలు చేపట్టారు. కొందరు చిన్నారులు తమ వారి నుంచి తప్పిపోయి ఏడుస్తూ కనిపించడంతో వారిని పోలీస్ ఔట్‌పోస్ట్ ద్వారా బాధిత కుటుంబసభ్యులకు అప్పగించేలా చర్యలు చేపట్టారు. వయోవృద్ధులు, వికలాంగులు దర్గాను దర్శించుకునేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. çవికలాంగులు, వయోవృద్ధుల వాహనాలను దర్గా సమీపంలోని చర్చి వరకు అనుమతించారు. అక్కడి నుంచి సేవాదళ్ సిబ్బంది వారిని వీల్చైర్లలో దర్గాను దర్శించుకునేలా చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీస్ అధికారులు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో పరిశీలన దర్గా ఆవరణలో పోలీస్ అధికారులు సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని పోలీస్ కంట్రోల్‌రూమ్‌లోని కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌కు అనుసంధానం చేశారు. ఇందులో భాగంగా అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకొని ఫింగర్ ప్రింట్స్ స్కానింగ్ సిస్టమ్ ద్వారా వారిని పరిశీలించారు. వారి ఫింగర్‌ప్రింట్స్‌ను నేరగాళ్ల వేలిముద్రలతో పోల్చిచూశారు. ఏఎస్పీ శరత్‌బాబు పోలీస్ కంట్రోల్‌రూమ్‌లో ఉంటూ భద్రతను పర్యవేక్షించారు. భద్రత ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ దర్గా, స్వర్ణాల చెరువు, తదితర ప్రాంతాల్లో భద్రత ఏర్పాట్లను ఎస్పీ విశాల్‌గున్నీ పరిశీలించారు. దర్గా ఆవరణలోకి వాహనాలను అనుమతించరాదని, వీఐపీలను సైతం పూర్తిగా తనిఖీ చేసిన అనంతరమే లోపలికి అనుమతించాలని ఆదేశించారు. అధికారుల హెచ్చరికలు బేఖాతరు బారాషహీదులను దర్శించుకునేందుకు ప్రత్యేక మార్గాలను ఏర్పాటుచేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలో గంటల తరబడి నిలిచిపోయారు. చక్కదిద్దాల్సిన కొందరు పోలీస్ అధికారులు, సిబ్బంది తమ విధులను పక్కనబెట్టి రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకొని పిచ్చాపాటి కబుర్లతో గడిపారు. -
పనిచేయని పోలీసు అధికారులపై వేటు
ఎస్పీ విశాల్ గున్నీ పొదలకూరు : పని చేయకుండా ప్రజల పట్ల అమర్యాదగా వ్యవహరించే పోలీసు అధికారులపై వేటు తప్పదని ఎస్పీ విశాల్ గున్నీ పేర్కొన్నారు. పొదలకూరు పోలీసుస్టేషన్‌ను శుక్రవారం ఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పుష్కరాల సందర్భంగా పోలీసు పాలనలో కొంత పట్టు తప్పిందన్నారు. తిరిగి పరిపాలను యాథాతదంగా కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. స్టేషన్‌కు వచ్చే బాధితులపై మర్యాదగా వ్యవహరించడం వారి సమస్యను తెలుసుకుని న్యాయం చేయాల్సిందిగా పదేపదే ఆదేశిస్తున్నట్టు తెలిపారు. పనితీరు మార్చుకోని పోలీసు అధికారులపై ఇంటెలిజెన్స్ ద్వారా నిఘా పెట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పోలీసు సేవాదళ్ ద్వారా సేవా కార్యక్రమాలను సైతం చేపడుతున్నట్టు వెల్లడించారు. ఇందులో భాగంగానే తొలిసారిగా శరన్నవరాత్రి మహోత్సవాల్లో నెల్లూరు రాజరాజేశ్వరీ దేవస్థానంలో పోలీసులు సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్టు వెల్లడించారు. పొదలకూరు పట్టణంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉందన్నారు. ఆక్రమణలు తొలగిస్తే ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ఎస్పీ వెంట ఎస్సై కే.ప్రసాద్‌రెడ్డి ఉన్నారు. -
చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి
ఎస్పీ విశాల్ గున్నీ అట్టహాసంగా రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభం గూడూరు: యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎస్పీ విశాల్‌గున్నీ పిలుపునిచ్చారు. స్థానిక అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలను గురువారం ఎస్పీ ప్రారంభించారు. తొలుత స్పోర్ట్స్ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం ఎన్సీసీ విద్యార్థులు మార్చ్ఫాస్ట్ నిర్వహించగా, రాష్ట్రంలోని అన్ని జిల్లాల క్రీడాకారుల నుంచి గౌరవ వందనాన్ని అందుకున్నారు. కేరళ యువతుల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ గెలుపోటములు సహజమన్నారు. క్రీడల్లో పాల్గొనడమే ముఖ్యమన్నారు. డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలకు గూడూరు వేదిక కావడం సంతోషకరమన్నారు. అనంతరం వాలీబాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి రమణారావు, శాప్ డైరెక్టర్ రవీంద్రబాబు, వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి , ఎన్బీకేఆర్ విద్యా సంస్థల అధినేత నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి, కనుమూరు హరిచంద్రారెడ్డి, మునిగిరీష్, తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షుడు గోపాల్‌రావు, రొటేరియన్లు కేఎస్‌రెడ్డి, జానకిరాంరెడ్డి, సురేంద్రరెడ్డి, దయాకర్‌రెడ్డి, మనపాటి రవీంద్రబాబు, లక్ష్మీ పీఎంరావు, తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు విజేతలు వీరే.. రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో పురుషుల విభాగంలో శ్రీకాకుళం జట్టుపై విజయనగరం జట్టు, విశాఖపట్నంపై ప్రకాశం, గుంటూరుపై అనంతపూర్ జట్లు విజయం సాధించాయి. అలాగే స్త్రీల విభాగంలో చిత్తూరు జట్టుపై కృష్ణా జట్టు , తూర్పు గోదావరిపై పశ్చిమ గోదావరి జట్టు విజయం సాధించాయి. -
శాంతిభద్రతల పరిరక్షణలో సహకారం అవసరం
ఎస్పీ విశాల్ గున్నీ నెల్లూరు(క్రైమ్): శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం ఎంతో అవసరమని ఎస్పీ విశాల్‌గున్నీ పేర్కొన్నారు. నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన వ్యాపారులు, నగర ప్రజలతో ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం నిర్వహించిన ఆత్మీయ సదస్సులో ఆయన మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నగర ప్రజలకు మెరుగైన సేవలందించాలనే లక్ష్యంతో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని వివరించారు. ఇందులో భాగంగా నగరంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని దాతలను కోరామని, అనేక మంది ముందుకొచ్చి ఏర్పాటుకు తమ వంతు సహకారం అందించారని పేర్కొన్నారు. వీరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు కొంత మంది నగదు చెల్లించారని, వీరికి నగదును ఇచ్చేస్తామని, డీడీ, చెక్కుల రూపంలోనే సహకారం అందించాలని కోరారు. దాతలు తాము అందించిన విరాళాలకు సంబంధించిన రసీదులను పొందాలని సూచించారు. వ్యాపారులు తమ వ్యాపార సంస్థల వద్ద సీసీ కెమెరాలు, మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. లాడ్జీల యజమానులు తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు గది అద్దెకు కావాలనే వారి నుంచి ఆధార్‌కార్డు, ఓటర్‌కార్డు, తదితరాలకు సంబంధించిన జిరాక్స్‌లను సేకరించిన అనంతరమే అద్దెకు ఇవ్వాలని చెప్పారు. లాడ్జిలో ఎవరెవరు ఉంటున్నారనే విషయాలను స్థానిక పోలీసులకు తెలియజేయాలని సూచించారు. మొబైల్‌షాపు నిర్వాహకులు సరైన గుర్తింపు కార్డులను తీసుకున్నాకే సిమ్‌లను విక్రయించాలని ఆదేశించారు. నగరంలో ఇప్పటికే 106 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, వీటిని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌కు అనుసంధానం చేశామన్నారు. విజయవాడ తర్వాత నెల్లూరు జిల్లాలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సిస్టమ్‌ను ఏర్పాటు చేశామని, త్వరలోనే డీజీపీ సాంబశివరావు చేతుల మీదుగా ప్రారంభించి శాంతిభద్రతలను పూర్తిస్థాయిలో అదుపులోకి తీసుకొస్తామని చెప్పారు. ఏఎస్పీ శరత్‌బాబు, ఎస్బీ, నగర డీఎస్పీలు కోటారెడ్డి, వెంకటరాముడు, ఇన్స్పెక్టర్లు మాణిక్యరావు, అబ్దుల్ కరీమ్, సుధాకర్‌రెడ్డి, రామారావు, సీతారామయ్య, మంగారావు, చెంచురామారావు, ఎస్బీ ఎస్సై శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
చోరీల నియంత్రణకు యాక్షన్‌ప్లాన్
ఎస్పీ విశాల్‌గున్నీ ముత్తుకూరు : జిల్లాలో తాళాలు వేసిన ఇళ్లలో జరుగుతున్న చోరీలను అరికట్టడానికి యాక్షన్‌ప్లాన్ సిద్ధం చేస్తున్నామని ఎస్పీ విశాల్‌గున్నీ వెల్లడించారు. ముత్తుకూరు, కృష్ణపట్నంపోర్టు పోలీసుస్టేషన్లను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రూరల్ డీఎస్పీ తిరుమలేశ్వరరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. యాక్షన్‌ప్లాన్ అమల్లో డీఎస్పీ, సీఐ, ఎస్సైలు చురుగ్గా వ్యవహరిస్తారన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు జాతీయ రహదారి, ముఖ్య కూడళ్లలో జిగ్‌జాగ్ బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తడ నుంచి కావలి వరకు ఆటోల ఓవర్‌లోడును అదుపు చేసేందుకు స్పెషల్ డ్రైవ్‌లు అమలు చేపట్టనున్నట్లు తెలిపారు. జియో ట్యాగింగ్ విధానం ద్వారా తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి నివారణకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. బాంబు పేలుడుపై ఆధారాలు లభించలేదు: జిల్లా కోర్టులో జరిగిన బాంబు పేలుడుకు సంబంధించి ఇప్పటి వరకు సరైన ఆధారాలు లభించలేదని ఎస్పీ తెలిపారు. పేలుడు జరిగిన చోట ఒక ప్రెషర్ కుక్కర్, బ్యాటరీలు లభించాయన్నారు. ఈ ఘటనతో రద్దీ ప్రదేశాలు, వాణిజ్య కేంద్రాల్లో భద్రత కట్టుదిట్టం చేశామన్నారు. లాడ్జీల్లో బస చేసే వ్యక్తులపై నిఘా పెంచుతున్నామన్నారు. పారిశ్రామిక భద్రత కోసం ప్రత్యేక వెబ్సైట్ రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణపట్నం సీఐ శ్రీనివాసరావు, ఎస్సై శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
వెయ్యి మందితో బందోబస్తు
జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ వెంకటగిరి: పోలేర మ్మజాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 1000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్సీ విశాల్ గున్నీ తెలిపారు. శుక్రవారం ఆయన జాతర జరిగే ప్రదేశాన్ని పరిశీలించి మాట్లాడారు. 800 మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు, మరో 200 మందిని ఎమర్జెన్సీ దళాలుగా వినియోగిస్తామన్నారు. అమ్మవారి ఊరేగింపు సమయంలో రోప్ పార్టీతో భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ సమస్య, క్యూలైన్లు నిర్వాహణలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామన్నారు. అంతకు మందు దేవస్థానం వద్ద ఏర్పాటు చేయనున్న బారికేడ్ల మ్యాప్ పరిశీలించి ఏఈ బాబును వివరాలు అడిగి తెలుసుకున్నారు. శనివారం ట్రయిల్ బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పోలేరమ్మకు పూజలు అనంతరం పోలేరమ్మకు పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యుడు తాండవ చంద్రారెడ్డి ఎస్పీకు శాలువ కప్పి సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగోండ్ల రామకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ దొంతుశారద, గూడూరు డీఎస్సీ శ్రీనివాస్, సీఐ శ్రీనివాసరావు, ఎస్సైలు ఆంజనేయరెడ్డి, రహీమ్‌రెడ్డి పాల్గొన్నారు. -
నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన
నెల్లూరు(క్రైమ్) : పెన్నావారది వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ బుధవారం పరిశీలించారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి సూచించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కల్గకుండా చూడాలన్నారు. నిమజ్జనం జరిగే ప్రాంతంలో గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగర ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో నిమజ్జనంపూర్తిచేసుకోవాలన్నారు. బాణాసంచా, మద్యం జోలికి వెళ్లకూడదన్నారు. మహిళలు, యువతులు, చిన్నారులను నిమజ్జనం జరిగే ప్రదేశాలకు తీసుకురాకూడదన్నారు. కార్యక్రమంలో నగర, ట్రాఫిక్ డీఎస్పీలు జి.వి రాముడు, నిమ్మగడ్డ రామారావు, మూడు, నాలుగు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు జి.రామారావు, సీహెచ్ సీతారామయ్య, జి.వెంకటరావు, ఎస్ఐల రామకృష్ణ, ఆర్ఎస్ఐలు శ్రీహరిరెడ్డి పాల్గొన్నారు. నేడు డయల్ యువర్ ఎస్పీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి గురువారం నిర్వహిస్తోన్న డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం 8వ తేదీ ఉదయం 11 గంటలకు జరుగుతుందని ఎస్బీ ఎస్ఐ బి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇటీవల కృష్ణాపుష్కరాల సందర్భంగా కార్యక్రమం జరగలేదన్నారు. ప్రజలు తమ సమస్యలను 0861–2331700 నెంబర్ ద్వారా ఉదయం 11గంటల నుంచి 12 గంటల వరకు ఎస్పీ విశాల్‌గున్నీకి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. -
పనితీరు మార్చుకోండి
అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవు నేర సమీక్షలో ఎస్పీ విశాల్ గున్నీ నెల్లూరు(క్రైమ్): విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చూస్తు ఊరుకోనేది లేదు. పని తీరు మెరుగు పరచుకుని ప్రజలకు మెరుగైన శాంతి భద్రతలను అందించండి. అలసత్వం ప్రదర్శిస్తే వేటు తప్పదని ఎస్పీ విశాల్‌గున్నీ సిబ్బందిని హెచ్చరించారు. స్థానిక ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్‌హాలులో గురువారం ఆయన నేరసమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ప్రతి పోలీస్‌స్టేషన్‌లో పెద్ద ఎత్తున కేసులు పెండింగ్ కేసులు ఉండటంపై ఆయన ఆసహనం వ్యక్తం చేశారు. కేసుల విచారణలో ఎందుకు జాప్యం జరుగుతోందని ప్రశ్నించారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామన్నారు. వీలైనంత త్వరితగతిన కేసులను పరిష్కరించి పెండెన్సీని తగ్గించాలన్నారు. జిల్లాలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నాయన్నారు. ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. జాతీయ రహదారి వెంబడి గస్తీని ముమ్మరం చేసి నేర నియంత్రణతో పాటు ప్రమాదాల జరగకుండా చూడాలన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై దృష్టి సారించాలన్నారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో విచారణ వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నార. గొలుసు, ఇంటి, గుళ్లలో రోజూ దొంగతనాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. నేరస్తుల కదలికలపై నిఘా ఉంచడంతో పాటు పాతనేరస్తులు, అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించాలన్నారు. రాత్రి, పగలు గస్తీని ముమ్మరం చేయాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడితే అందుకు సంబంధిత పోలీసు అధికారే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఇకపై ప్రతి పోలీసుస్టేషన్ పనితీరును నిశితంగా పరిశీలించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీలు బి. శరత్‌బాబు, కె.సూరిబాబు, క్రైం ఓఎస్డి విఠలేశ్వర్, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. నోడల్ అధికారుల నియామకం సిబ్బంది పని తీరును మెరుగు పరచడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు ఎస్పీ ప్రత్యేక చర్యలు చేపట్టారు. అందులో భాగంగా వివిధ విభాగాలను ఏర్పాటు చేసి డీఎస్పీలను నోడల్ అధికారులుగా నియమించారు. ఇకపై నోడల్ అధికారులు తమకు కేటాయించిన విభాగాలను పర్యవేక్షించి నివేదికను తనకు అందజేయాలని సూచించారు. -
రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు ప్రారంభం
వెంకటాచలం: మండలంలోని సరస్వతీనగర్‌లోని అక్షర విద్యాలయంలో రాష్ట్ర స్థాయి అండర్–17 బాల, బాలికల చెస్ చాంపియన్‌షిప్ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఎస్సీ విశాల్ గున్నీ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. క్రీడాకారుల మధ్య పోటీతత్వం ఉండాలన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. అనంతరం అక్షర విద్యాలయ డైరెక్టర్ హరగోపాల్‌తో కాసేపు చెస్ ఆడారు. ఈ కార్యక్రమంలో శాప్ డైరెక్టర్ రవీంద్రబాబు, అక్షర విద్యాలయ వైస్ ప్రిన్సిపల్ హరిప్రసాద్, జిల్లా చెస్ అసోషియేషన్ ప్రధాన కార్యదర్శి వై సుమన్, తదితరులు పాల్గొన్నారు. చెస్ పోటీలకు 138మంది హాజరు అండర్–17 చెస్ చాంపియన్‌షిప్ పోటీలకు బాల, బాలికలు మొత్తం 138 మంది హాజరయ్యారు. శుక్రవారం జరిగిన మొదటి రౌండ్ పోటీల్లో బాలుర విభాగంలో వై గ్రహేష్కుమార్, నాగసంపత్, చైతన్యసాయిరాం మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. అలాగే బాలికల విభాగంలో హర్షిత, మౌనిక అక్షయ, అలేఖ్యలు కొనసాగుతున్నారు. మొత్తం 8 రౌండ్లు పోటీలు ఉంటాయని జిల్లా చెస్ అసోషియేషన్ ప్రధాన కార్యదర్శి వై సుమన్ తెలిపారు.