మెరుగైన ట్రాఫిక్‌ను అందించాలి
-
ఎస్పీ విశాల్‌గున్నీ
నెల్లూరు(క్రైమ్): నగర ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన ట్రాఫిక్‌ను అందించాలని ఎస్పీ విశాల్‌గున్నీ సూచించారు. నగరంలో బుధవారం రాత్రి ఎస్పీ పర్యటించి ట్రాఫిక్ తీరు తెన్నులను పరిశీలించారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ అధ్వానంగా ఉండటంతో తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో పాటు ఏమి చేస్తున్నారంటూ ట్రాఫిక్ అధికారులపై మండిపడ్డారు. వీఆర్సీ సెంటర్ నుంచి జెడ్పీకి వెళ్లే రహదారి మొదట్లో ట్రాన్స్‌ఫార్మర్ రోడ్డుపైకి వచ్చి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తుండటాన్ని గుర్తించిన ఎస్పీ వెంటనే విద్యుత్ అధికారులతో మాట్లాడి ట్రాన్స్‌ఫార్మర్‌ను ఓ పక్కగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తన చాంబర్‌లో ట్రాఫిక్, నగర పోలీస్ అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో ట్రాఫిక్ పరిస్థితి రోజురోజుకూ అధ్వానంగా మారుతోందని అసహనం వ్యక్తం చేశారు. ఎక్కడపడితే అక్కడ వాహనాలను నిలిపేస్తున్నా.. తోపుడుబండ్లను రోడ్లపైనే పెడతున్నా.. నో పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలను ఆపుతున్నా పట్టించుకోరానని ప్రశ్నించారు. నగర ట్రాఫిక్‌పై ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని, పనితీరును మార్చుకోకపోతే సిబ్బందిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నగర పోలీసులు రోజూ సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల వరకు విజిబుల్ పోలీసింగ్‌ను నిర్వహించాలన్నారు. ఏదో ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా స్టేషన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించడంతో పాటు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
వన్‌వేలను ఏర్పాటు చేయండి
నగరంలోని రద్దీ ప్రాంతాలను గుర్తించి వన్‌వేలను ఏర్పాటు చేయాలన్నారు. నో పార్కింగ్, యూ టర్న్, తదితరాలకు సంబంధించిన సైన్‌బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎక్కడపడితే అక్కడ ఆటో స్టాండ్లను ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను నగరంలోకి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదన్నారు. కోవూరు వైపు నుంచి వచ్చే వాహనాలను రైల్వేస్టేషన్ వద్ద, కోడూరు వైపు నుంచి వచ్చే వాహనాలను స్టోన్‌హౌస్‌పేట వద్ద, ముత్తుకూరు నుంచి వచ్చే వాహనాలను ముత్తుకూరు బస్టాండ్ వద్ద, అలా అన్ని ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను నగర శివార్లకే పరిమితం చేయాలన్నారు. వాహనాలకు సంబంధించిన పత్రాల్లేకపోతే కేసులు నమోదు చేయాలని సూచించారు. కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌లో ఓ ఎస్సైను ఏర్పాటు చేస్తున్నామని, ఆయన ట్రాఫిక్‌ను పరిశీలించి తగిన సూచనలిస్తారని వివరించారు. కొన్ని రహదారులు ఆక్రమణకు గురయ్యాయని, వీటిని గుర్తించి సంబంధిత అధికారుల సహకారంతో తొలగించాలని చెప్పారు.
ప్రజలు సహకరించాలి
ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు. సీసీ కెమెరాల ఫుటేజీతో ఆయా వాహనదారులకు ఈ చలాన్‌ను ఇంటికే పంపుతున్నామన్నారు. వాహనానికి సంబంధించిన పత్రాలను తమ వెంట ఉంచుకోవాలని కోరారు. తనిఖీ సమయాల్లో వాహన పత్రాల్లేకపోతే వాహనాన్ని సీజ్ చేస్తామన్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఐల్యాండ్లను కుదించాల్సి ఉందని, రెండో విడతలో చేస్తామన్నారు. ఏఎస్పీ శరత్‌బాబు, ఎస్బీ, నగర, ట్రాఫిక్ డీఎస్పీలు కోటారెడ్డి, వెంకటరాముడు, నిమ్మగడ్డ రామారావు, నగర ఇన్‌స్పెక్టర్లు రామకృష్ణారెడ్డి, రామారావు, సీతారామయ్య, మంగారావు, తదితరులు పాల్గొన్నారు.