నేరాలు అదుపునకు ప్రత్యేక చర్యలు
-
జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ
వెంకటాచలం : జిల్లాలో నేరాల అదుపునకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ చెప్పారు. నూతనంగా నిర్మించిన వెంకటాచలం పోలీస్‌స్టేషన్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో కార్పొరేట్ కార్యాలయానికి దీటుగా వెంకటాచలం పోలీస్‌స్టేషన్‌ను తీర్చిదిద్దడంలో కృషి చేసిన సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఐ వెంకటేశ్వరరావును ఎస్పీ అభినందించారు. జిల్లాలో 4 వేలకు పైగా పెండింగ్ కేసులున్నట్లు వివరించారు. మూడు నెలల్లో ప్రణాళికతో కేసులు పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామన్నారు. వెంకటాచలంలోని టోల్‌ప్లాజా వద్ద బంగారు బిస్కెట్ల దోపిడీ కేసు, జిల్లా కోర్టులో బాంబు పేలుడు కేసుల్లో ఇప్పటికే పురోగతి సాధించామన్నారు. బాంబు పేలుడు కేసులో అన్నీ ఆధారాలు సేకరించామన్నారు. బంగారు బిస్కెట్ల దోపిడీ కేసును సీఐ శ్రీనివాసరెడ్డి ఆ«ధ్వర్యంలో నిందితులను పట్టుకునేందుకు విచారణ జరుగుతుందన్నారు. జిల్లాలో కొత్త రూ.500, రూ.2 వేలు నోట్లు అందుబాటులో ఉన్నందున ప్రజలకు వారం తర్వాత కష్టాలు ఉండబోవని చెప్పారు. ఆయన వెంట రూరల్ డీఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి, సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఐ వెంకటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.