భారీ భద్రత ఏర్పాట్లు
భారీ భద్రత ఏర్పాట్లు
Published Thu, Oct 13 2016 2:34 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
నెల్లూరు(క్రైమ్): రొట్టెల పండగ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. దర్గాకు వెళ్లే మూడు రహదారుల్లో మెటల్ డిటెక్టర్లు, హ్యాండ్‌మేడ్ డిటెక్టర్లను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కర్నీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే దర్గా ఆవరణలోకి అనుమతిస్తున్నారు. స్వర్ణాల చెరువు వద్ద భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రత్యేక సేవాదళ్ సిబ్బంది దర్గా ఆవరణలో తిరుగుతూ వయోవృద్ధులు, వికలాంగులను దగ్గరుండి దర్గాను దర్శించుకునేలా చర్యలు చేపట్టారు. కొందరు చిన్నారులు తమ వారి నుంచి తప్పిపోయి ఏడుస్తూ కనిపించడంతో వారిని పోలీస్ ఔట్‌పోస్ట్ ద్వారా బాధిత కుటుంబసభ్యులకు అప్పగించేలా చర్యలు చేపట్టారు. వయోవృద్ధులు, వికలాంగులు దర్గాను దర్శించుకునేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. çవికలాంగులు, వయోవృద్ధుల వాహనాలను దర్గా సమీపంలోని చర్చి వరకు అనుమతించారు. అక్కడి నుంచి సేవాదళ్ సిబ్బంది వారిని వీల్‌చైర్లలో దర్గాను దర్శించుకునేలా చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీస్ అధికారులు చర్యలు చేపట్టారు.
సీసీ కెమెరాలు, డ్రోన్లతో పరిశీలన
దర్గా ఆవరణలో పోలీస్ అధికారులు సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని పోలీస్ కంట్రోల్‌రూమ్‌లోని కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌కు అనుసంధానం చేశారు. ఇందులో భాగంగా అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకొని ఫింగర్ ప్రింట్స్ స్కానింగ్ సిస్టమ్ ద్వారా వారిని పరిశీలించారు. వారి ఫింగర్‌ప్రింట్స్‌ను నేరగాళ్ల వేలిముద్రలతో పోల్చిచూశారు. ఏఎస్పీ శరత్‌బాబు పోలీస్ కంట్రోల్‌రూమ్‌లో ఉంటూ భద్రతను పర్యవేక్షించారు.
భద్రత ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
దర్గా, స్వర్ణాల చెరువు, తదితర ప్రాంతాల్లో భద్రత ఏర్పాట్లను ఎస్పీ విశాల్‌గున్నీ పరిశీలించారు. దర్గా ఆవరణలోకి వాహనాలను అనుమతించరాదని, వీఐపీలను సైతం పూర్తిగా తనిఖీ చేసిన అనంతరమే లోపలికి అనుమతించాలని ఆదేశించారు.
అధికారుల హెచ్చరికలు బేఖాతరు
బారాషహీదులను దర్శించుకునేందుకు ప్రత్యేక మార్గాలను ఏర్పాటుచేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలో గంటల తరబడి నిలిచిపోయారు. చక్కదిద్దాల్సిన కొందరు పోలీస్ అధికారులు, సిబ్బంది తమ విధులను పక్కనబెట్టి రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకొని పిచ్చాపాటి కబుర్లతో గడిపారు.
Advertisement