అభ్యర్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలి
-
కళాశాలల యాజమాన్యాలకు ఎస్పీ సూచన
నెల్లూరు(క్రైమ్):
కానిస్టేబుల్ ఉద్యోగ ఎంపికలకు హాజరయ్యే అభ్యర్థులకు కళాశాలల యాజమాన్యాలు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఎస్పీ విశాల్‌గున్నీ సూచించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 19వ తేదీ నుంచి పోలీసు కవాతుమైదానంలో పోలీసు కానిస్టేబుల్స్, జైలువార్డర్ల ఉద్యోగాలకు సంబంధించి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. పరీక్షలకు అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని ఇప్పటికే పలుమార్లు ప్రకటించామన్నారు. అయితే కొందరు అభ్యర్థులు సర్టిఫికెట్లు తీసుకురావడం లేదనీ, ఇదేమని అడిగితే కళాశాలలో ఉన్నాయని చెబుతున్నారన్నారు. దీనివల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఎవరైనా ఉద్యోగ ఎంపికలకు హాజరు కావ్వాల్సిన సమయంలో సరైన ఆధారాలు చూపి కళాశాల నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్లు తెచ్చుకోవచ్చని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని కళాశాలల యాజమాన్యాలు కానిస్టేబుల్ ఎంపికలకు హాజరయ్యే అభ్యర్థులు సరైన ఆధారాలు చూపి సర్టిఫికెట్లు కావాలని కోరితే వెంటనే ఇవ్వాలని సూచించారు. లేని పక్షంలో సదరు కళాశాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా కొందరు కళాశాలల యాజమాన్యాలు అభ్యర్థులు సర్టిఫికెట్ల కోసం వెళితే డబ్బులు అడుగుతున్నారని, డబ్బులు ఇస్తేనే సర్టిఫికెట్లు ఇస్తున్నారనే విషయాల తమ దృష్టికి వస్తున్నాయన్నారు. అలాంటి కళాశాలలపై సైతం చర్యలు తప్పవని ఆయన పేర్కొన్నారు.