కొనసాగిన దేహదారుఢ్య పరీక్షలు
-
రాత పరీక్షకు 670 మంది అర్హత
నెల్లూరు(క్రైమ్): పోలీస్(సివిల్ / ఏఆర్) కానిస్టేబుళ్లు, జైలు వార్డర్ ఉద్యోగ ఎంపికలు మంగళవారం రెండో రోజుకు చేరుకున్నాయి. మంచుదట్టంగా పడుతూ చలి భయపెడుతున్నా లెక్కచేయకుండా ఉద్యోగ లక్ష్యాన్ని చేరుకునేందుకు అభ్యర్థులు ఉదయం ఐదు గంటలకే స్థానిక పోలీస్ కవాతు మైదానానికి చేరుకున్నారు. విధుల్లో ఉన్న సిబ్బంది వారిని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం లోపలికి అనుమతించారు. తొలుత అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలించారు. కొందరు అభ్యర్థులకు కళాశాల సిబ్బంది ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో జిరాక్స్‌లను చూపించి అనుమతించాలని కోరారు. విషయం ఎస్పీ విశాల్‌గున్నీ దృష్టికి వెళ్లడంతో అభ్యర్థులకు కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీచేశారు. కళాశాలలకు వెళ్లి సర్టిఫికెట్లు తెచ్చుకొని 24వ తేదీలోపు పరీక్షలకు హాజరుకావాలని సూచించారు. అపీల్ చేసుకున్న అభ్యర్థులకు 24వ తేదీన తిరిగి ఎంపికలు, పోటీలు ఉంటాయని తెలిపారు. మంగళవారం వెయ్యి మంది హాజరుకావాల్సి ఉండగా, 846 మంది పాల్గొన్నారు. వారికి ఎత్తు, ఛాతి చుట్టు కొలతలు, పరుగుపందెం, లాంగ్‌జంప్ పోటీలను నిర్వహించారు. వీరిలో 670 మంది రాణించి రాతపరీక్షకు అర్హత సాధించారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా ఎస్పీ స్వయంగా పర్యవేక్షించారు.
పలువురికి గాయాలు
దేహదారుఢ్య పరీక్షల్లో అభ్యర్థులు తమ తోటివారికన్నా ఎక్కువ ప్రతిభ కనబర్చే క్రమంలో పలువురు గాయపడ్డారు. వీరిని సిబ్బంది వెంటనే స్రె ్టచర్‌పై తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. కొందరు అభ్యర్థులు అనర్హులవడంతో కన్నీటిపర్యంతమవడాన్ని గమనించిన ఎస్పీ స్వయంగా వారి ఛాతి, ఎత్తు కొలతలను పరిశీలించారు. వారికి దైర్యం చెప్పి ఈ సారి జరిగే పోటీలకు ఇప్పటి నుంచే సిద్ధపడాలని సూచించారు.
కోలాహలం
పోలీస్ కవాతు మైదానం పరిసర ప్రాంతాల్లో కోలాహలం నెలకొంది. అభ్యర్థులు, వారి బంధువులు, సన్నిహితులు పెద్ద సంఖ్యలో కవాతుమైదానం వద్దకు చేరుకున్నారు. ఎంపికల సందర్భంగా గుర్తింపు కార్డులు ఉన్న వ్యక్తులను మినహా ఇతరులను లోపలికి అనుమతించలేదు. ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు.