రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ దుర్మరణం
నెల్లూరు రూరల్: విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ హసీంజాన్(51) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన ఘటన వెంకటేశ్వరపురం, భగత్‌సింగ్ కాలనీ జాతీయ రహదారిపై సోమవారం చోటు చేసుకుంది. రూరల్ పోలీసుల కథనం మేరకు.. చింతారెడ్డిపాళెం నారాయణ నర్సింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థి మౌనిక కనిపించడంలేదంటూ గత నెల అమె తండ్రి వెంకటేశ్వర్లు రూరల్ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కరీంనగర్‌లో అమ్మాయి ఆచూకీ లభించడంతో రూరల్ ఏఎస్సై రాధాసింగ్, కానిస్టేబుల్ హసీంజాన్ ఈ నెల 8న కరీంనగర్ వెళ్లారు. 9వ తేదీ మౌనికను తీసుకొని కారులో నెల్లూరు బయల్దేరారు. భగత్‌సింగ్ కాలనీ జాతీయ రహదారిపై వస్తున్న కారు డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో సోమవారం తెల్లవారుజామున ముందు వెళ్తున్న ట్యాంకర్‌ను వేగంగా ఢీకొంది. తీవ్రంగా గాయపడిన హసీంజాన్ అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్సై సుబ్బారావు ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహన్ని జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గాయపడిన ఏఎస్సై రాధాసింగ్, డ్రైవర్‌ను చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. డీఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి, సీఐ దుర్గాప్రసాద్ పరిశీలించారు. మృతి చెందిన కానిస్టేబుల్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.