ప్రశాంతంగా ముగిసిన ప్రిలిమనరీ రాతపరీక్ష
-
1,585 మంది గైర్హాజరు
నెల్లూరు(క్రైమ్):
పోలీసు కానిస్టేబుల్స్ ప్రిలిమనరీ రాత పరీక్ష ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 42పరీక్ష కేంద్రాల్లో 21,142 మంది పరీక్ష రాయాల్సి ఉంది. వీరిలో 1,585మంది వివిధ కారణాలతో గైర్హాజరయ్యారు. 19,557మంది పరీక్ష రాశారు. ఉదయం 9గంటలకే పరీక్ష కేంద్రాల వద్దకు పెద్ద ఎత్తున అభ్యర్థులు చేరుకున్నారు. కేంద్రాల బయటే పోలీసు అధికారులు, సిబ్బంది అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీలు చేసి లోనికి అనుమతించారు. ఉదయం 10గంటలకు పరీక్ష ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటిగంటకు ముగిసింది. ఎస్పీ విశాల్‌గున్నీ, నెల్లూరు రీజియన్ ప్రాంతీయ సమన్వయకర్త వై.రామ్మోహన్‌రావులు నెల్లూరు నగరంలోని పలు కేంద్రాలను పరిశీలించారు. కావలి రీజియన్‌లో అక్కడి ప్రాంతీయ సమన్వయకర్త సురేష్‌బాబు పరీక్ష కేంద్రాలను పరిశీలించారు.
1,579మంది గైర్హాజరు
ప్రిలిమనరీ రాత పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 1,585మంది గైర్హాజరైయ్యారు. నెల్లూరులో 15,259మంది అభ్యర్థులకుగాను 1,015మంది, కావలిలో 5,883మందికి గాను 570మంది గైర్హాజరైయ్యారు. నిమిషం ఆలస్యమైన కేంద్రంలోకి అనుమతించేది లేదని రెండు రోజులుగా అధికారులు చెబుతూ వచ్చారు. అయినా పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నిర్దేశించిన సమయానికి కేంద్రాలకు చేరుకోలేకపోయారు. పరీక్ష ప్రారంభమైన అనంతరం వారు కేంద్రాల వద్దకు రావడంతో వారిని లోనికి అనుమతించలేదు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు గుర్తింపు కార్డు లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగగా, కొందరు సమీపంలోని నెట్‌సెంటర్లకు వెళ్లి ఫొటో గుర్తింపుకార్డులను డౌన్‌లోడ్ చేసుకుని పరీక్ష రాశారు.
కేంద్రాలను పరిశీలించిన అధికారులు
నెల్లూరులోని డీకేడబ్ల్యూ, వీఆర్ కళాశాలల్లోని పరీక్ష కేంద్రాలను ఎస్పీ విశాల్‌గున్నీ, నగర డీఎస్పీ జి.వెంకటరాముడు పరిశీలించారు.