గుప్తనిధుల దొంగలు అరెస్ట్
-
పట్టుబడిన వారిలో కానిస్టేబుల్, హోంగార్డు
-
కలకలం రేపిన ఘటన
అనుమసముద్రంపేట : మండలంలోని రాజవోలు గ్రామంలోని కొండ కింద ప్రాంతంలో గుప్తనిధులు కోసం తవ్వకాలు చేస్తున్న తొమ్మిదిమంది నిందితులను ఏఎస్‌పేట హెడ్ కానిస్టేబుల్స్ మస్తాన్ సాహెబ్, వెంకటేశ్వర్లు సోమవారం అర్ధరాత్రి సంఘటన స్థలంలోనే పట్టుకున్నారు. నిందితులను ఏఎస్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆత్మకూరు డీఎస్‌పీ సుబ్బారెడ్డి, సీఐ ఖాజావలీ విషయం తెలుసుకుని మంగళవారం వచ్చి నిందితుల వివరాలు సేకరించారు. సీఐ విలేకరులతో మాట్లాడుతూ రాజవోలు గ్రామంలో వారంరోజుల క్రితం గుప్తనిధుల కోసం గుర్తుతెలియని వ్యక్తులు గోతులు తీశారన్నారు. దీంతో ఈ వ్యవహారంపై నిఘా పెట్టామన్నారు. ఈ క్రమంలో తవ్వకాలపై సమాచారం రావడంతో సిబ్బంది ఆ ప్రాంతానికి వెళ్లగా తొమ్మిది మంది దొరికారన్నారు. పట్టుబడ్డ వారిలో ఉదయగిరికి చెందిన షేక్ సుల్తాన్, మొగల్ యూసిఫ్, షేక్ నౌషద్, సయ్యద్ షఫీ, సైదాపురం మండలం కలిచేడుకు చెందిన డి.రవి, మందా వెంకటయ్య, మందా శివయ్య, రాపూరు కృష్ణయ్య, తురకా మహేష్‌లున్నారు. వీరిలో కలిచేడుకు చెందిన డి.రవి పొదలకూరు స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ఉదయగిరికి చెందిన సుల్తాన్ షేక్ అదే స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. వీరందరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు.
కలకలం..
పొదలకూరు : గుప్తనిధుల తవ్వకాల్లో పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల్లో పొదలకూరు స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్, హోంగార్డు ఉండడంతో కలకలం రేగింది. సమాచారం తెలుసుకున్న స్టేషన్ అధికారులు, సిబ్బంది ఆశ్చర్యపోయారు. కానిస్టేబుల్ మహ్మద్ సుల్తాన్, హోంగార్డు రవిలకు గతంలో నేరచరిత్ర లేదు. అయితే బయటి విధులనే ఎక్కువగా నిర్వర్తించేవారు. ఈ నేపథ్యంలోనే గుప్తనిధుల వేటసాగిస్తున్న నేరస్తులతో కలిసినట్టుగా చెప్పుకొంటున్నారు. సుల్తాన్ ఇటీవల ఆర్థికంగా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. స్థానికంగా ప్రైవేటు చిట్స్ వేసి పాడుకుని సంబంధిత వ్యక్తులకు నగదు చెల్లించకుండా ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కష్టపడకుండా డబ్బు సంపాదించాలనే ఉద్ధేశ్యంతో గుప్తనిధుల తవ్వకాల కోసం వెళ్లినట్టుగా చర్చించుకుంటున్నారు.