
ఎస్పీ విశాల్ గున్నీ
తూర్పుగోదావరి, కాకినాడ రూరల్: తనయుడు బెదిరిస్తున్నాడంటూ సర్పవరం గ్రామానికి చెందిన పిట్టా అప్పారావు, పిట్టా లక్ష్మి అనే వృద్ధదంపతులు చేసిన ఫిర్యాదుపై చర్యలు చేపట్టాలని సర్పవరం సీఐని ఆదేశించినట్టు ఎస్పీ విశాల్ గున్ని సోమవారం ఒక ప్రకటనలో వివరించారు. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వమని వారు కోరలేదన్నారు. పిట్టా అప్పారావుకు కిడ్నీ పాడైనందున ఆపరేషన్ ఖర్చుల నిమిత్తం రూ.30 లక్షలు అవసరమవుతున్నందున తాను సంపాదించిన ఆస్తిలో కొంత ఆస్తిని అమ్మి వైద్యం చేయించుకోనేందుకు కుమారుడైన పిట్టా రవిని అడుగా ‘‘ఈ వయస్సులో ఆపరేషన్ ఎందుకు? ఇంకా ఎంత కాలం బతుకుతారు’’ అని అవమానపరిచినట్టుగా మాట్లాడాడని ఫిర్యాదు చేశారన్నారు.
దీనిపై వారి పరిస్థితిని అర్థం చేసుకొని చట్టప్రకారం సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని సర్పవరం సీఐని ఆదేశించినట్టు తెలిపారు. ఆత్మహత్యలకు అనుమతివ్వడం అనే విషయం చట్టపరిధిలోకి రాదని, పైగా ఆత్మహత్య అనేది చట్టప్రకారం నేరమన్నారు. దీనిని ఎవరూ ప్రోత్సహించరని, ప్రోత్సహించినా నేరమేనన్నారు.