చోరీల నియంత్రణకు యాక్షన్‌ప్లాన్
ముత్తుకూరు : జిల్లాలో తాళాలు వేసిన ఇళ్లలో జరుగుతున్న చోరీలను అరికట్టడానికి యాక్షన్‌ప్లాన్ సిద్ధం చేస్తున్నామని ఎస్పీ విశాల్‌గున్నీ వెల్లడించారు. ముత్తుకూరు, కృష్ణపట్నంపోర్టు పోలీసుస్టేషన్లను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రూరల్ డీఎస్పీ తిరుమలేశ్వరరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. యాక్షన్‌ప్లాన్ అమల్లో డీఎస్పీ, సీఐ, ఎస్సైలు చురుగ్గా వ్యవహరిస్తారన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు జాతీయ రహదారి, ముఖ్య కూడళ్లలో జిగ్‌జాగ్ బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తడ నుంచి కావలి వరకు ఆటోల ఓవర్‌లోడును అదుపు చేసేందుకు స్పెషల్ డ్రైవ్‌లు అమలు చేపట్టనున్నట్లు తెలిపారు. జియో ట్యాగింగ్ విధానం ద్వారా తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి నివారణకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
బాంబు పేలుడుపై ఆధారాలు లభించలేదు:
జిల్లా కోర్టులో జరిగిన బాంబు పేలుడుకు సంబంధించి ఇప్పటి వరకు సరైన ఆధారాలు లభించలేదని ఎస్పీ తెలిపారు. పేలుడు జరిగిన చోట ఒక ప్రెషర్ కుక్కర్, బ్యాటరీలు లభించాయన్నారు. ఈ ఘటనతో రద్దీ ప్రదేశాలు, వాణిజ్య కేంద్రాల్లో భద్రత కట్టుదిట్టం చేశామన్నారు. లాడ్జీల్లో బస చేసే వ్యక్తులపై నిఘా పెంచుతున్నామన్నారు. పారిశ్రామిక భద్రత కోసం ప్రత్యేక వెబ్‌సైట్ రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణపట్నం సీఐ శ్రీనివాసరావు, ఎస్సై శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.