పగలు ఎలక్ట్రికల్ పని..రాత్రులు చోరీలు
Published Fri, Apr 1 2016 1:09 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM
గణపవరం : పగలు ఎలక్ట్రికల్ పని చేస్తూ రాత్రులు చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు పోలీసులకు చిక్కారు. వీరిలో ఇద్దరు బాలలు కావడం విశేషం. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో గణపవరం సీఐ దుర్గాప్రసాద్ కేసు వివరాలు వెల్లడించారు. గణపవరం పంచాయతీ పరిధిలో చిన రామచంద్రపురానికి చెందిన గునుపూడి ఉదయ్‌కుమార్ ఎలక్ట్రికల్ వైండింగ్ పని చేస్తుంటాడు. ఇతని వద్ద ఇద్దరు బాలురు హెల్పర్‌లుగా పనిచేస్తున్నారు. వీరు ముగ్గురు కలిసి రాత్రులు చోరీలకు పాల్పడుతున్నారు.
కారు అద్దాలు పగుల కొట్టి..
2014 డిసెంబర్ 8వ తేదీన గణపవరం డిగ్రీ కళాశాల వద్ద పార్కింగ్ చేసిన కారు వెనుక అద్దాలు బద్దలు కొట్టి బ్యాగ్‌తో పాటు బంగారం వస్తువులు దొంగిలించారు. ఇటీవల గణపవరం బొబ్బిలి వంతెన దిగువన కూల్‌డ్రింక్‌షాపులో మూడు సెల్‌ఫోన్లు, రూ.4 వేల నగదు అపహరించారు. ముత్యాలరాజు ఆసుపత్రి కాంప్లెక్స్‌లోని రామభద్రిరాజు మెడికల్ షాపు షట్టర్లు బద్దలుకొట్టి బంగారం, వెండి వస్తువులు, కొంత నగదు దొంగిలించారు. అప్పట్లో ఈ కేసులు నమోదయ్యాయి. నిందితులు ముగ్గురి కదలికలపై అనుమానం వచ్చి అరెస్ట్ చేయగా నేరాలు ఒప్పుకున్నారని సీఐ చెప్పారు.
వీరి వద్ద నుంచి సుమారు రూ.2 లక్షల విలువైన వస్తువులు రికవరీ చేసినట్టు తెలిపారు. నిందితుల్లో ఇద్దరి బాల నేరస్తులను ఏలూరు జువైనల్ జస్టిస్ బోర్డులో హాజరు పరిచినట్టు చెప్పారు. ఉదయ్‌కుమార్‌ను తాడేపల్లిగూడెం కోర్టుకు తరలించినట్టు సీఐ తెలిపారు. ఏఎస్సై జాన్‌మోజెస్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. 6 నెలల క్రితం క్లోజ్ అయిన 2014 నాటి కారులో చోరీ కేసును ఏలూరు డీఎస్పీ అనుమతి మేరకు తిరిగి మళ్లీ తెరిచి దర్యాప్తు చేసి ఛేదించినందుకు సిబ్బందిని సీఐ అభినందించారు. గణపవరం ఎస్సై హరికృష్ణ, హెడ్ కానిస్టేబుల్ అనంద్‌బాబు, లెనిన్ ప్రసాద్, రవికుమార్, శ్రీనివాస్‌లకు ప్రోత్సాహక నగదు బహుమతులు అందించారు. రివార్డుల కోసం జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్టు సీఐ చెప్పారు.
Advertisement