- వీఐపీలకు భద్రత పెంపు
- క్విక్ రెస్పాన్స్ టీంలు ఏర్పాటు
- ఎస్పీ విశాల్‌గున్నీ
భద్రత కట్టుదిట్టం
Published Thu, Nov 3 2016 10:45 PM | Last Updated on Mon, Sep 4 2017 7:05 PM
నెల్లూరు (క్రైమ్) : మావోల బంద్ నేపథ్యంలో జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశామని ఎస్పీ విశాల్‌గున్నీ వెల్లడించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏఓబీ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోలు బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో సిబ్బందిని అప్రమత్తం చేయడంతో పాటు అటవీ ప్రాంతంలో కూంబింగ్ జరుగుతుందన్నారు. తీరప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేశామన్నారు. సివిల్ పోలీసులతో పాటు మెరైన్, సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది తనిఖీలు చేపట్టాయన్నారు. జాతీయ రహదారి వెంబడి వాహన తనిఖీలు సాగుతున్నాయని, అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. కోర్టులో మాదిరిగా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయంలో మెటల్ డిటెక్టర్‌లను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే కార్యాలయాల్లోకి అనుమతించేలా చర్యలు తీసుకున్నామన్నారు. జనచైతన్య యాత్రలో పాల్గొనే వీఐపీలతో పాటు జిల్లాలోని ప్రజాప్రతినిధులకు భద్రతను పెంచామన్నారు. వారు పర్యటించే ప్రాంతాలో బాంబ్, డాగ్‌స్క్వాడ్‌లతో తనిఖీలు చేపట్టామని చెప్పారు. ప్రతి సబ్‌డివిజన్‌కు ఒక్కో క్విక్ రెస్పాన్స్ టీంను ఏర్పాటు చేశామన్నారు. టీంలో ఆరుగురు సభ్యులు ఉంటారని, వీరు ఏదైనా సంఘటన జరిగిన వెంటనే ఆయా ప్రాంతాలకు వెళ్లి అవసరమైన చర్యలు తీసుకుంటారన్నారు. ప్రజలు తమ ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు తారసపడినా, అసాంఘిక శక్తుల కదలికలు ఉన్నా వెంటనే పబ్లిక్ ఐ 93907 77727 నంబరుకు ఫోన్ చేసి సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
Advertisement
Advertisement