శాంతిభద్రతల పరిరక్షణలో సహకారం అవసరం
నెల్లూరు(క్రైమ్): శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం ఎంతో అవసరమని ఎస్పీ విశాల్‌గున్నీ పేర్కొన్నారు. నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన వ్యాపారులు, నగర ప్రజలతో ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం నిర్వహించిన ఆత్మీయ సదస్సులో ఆయన మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నగర ప్రజలకు మెరుగైన సేవలందించాలనే లక్ష్యంతో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని వివరించారు. ఇందులో భాగంగా నగరంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని దాతలను కోరామని, అనేక మంది ముందుకొచ్చి ఏర్పాటుకు తమ వంతు సహకారం అందించారని పేర్కొన్నారు. వీరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు కొంత మంది నగదు చెల్లించారని, వీరికి నగదును ఇచ్చేస్తామని, డీడీ, చెక్కుల రూపంలోనే సహకారం అందించాలని కోరారు. దాతలు తాము అందించిన విరాళాలకు సంబంధించిన రసీదులను పొందాలని సూచించారు. వ్యాపారులు తమ వ్యాపార సంస్థల వద్ద సీసీ కెమెరాలు, మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. లాడ్జీల యజమానులు తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు గది అద్దెకు కావాలనే వారి నుంచి ఆధార్‌కార్డు, ఓటర్‌కార్డు, తదితరాలకు సంబంధించిన జిరాక్స్‌లను సేకరించిన అనంతరమే అద్దెకు ఇవ్వాలని చెప్పారు. లాడ్జిలో ఎవరెవరు ఉంటున్నారనే విషయాలను స్థానిక పోలీసులకు తెలియజేయాలని సూచించారు. మొబైల్‌షాపు నిర్వాహకులు సరైన గుర్తింపు కార్డులను తీసుకున్నాకే సిమ్‌లను విక్రయించాలని ఆదేశించారు. నగరంలో ఇప్పటికే 106 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, వీటిని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌కు అనుసంధానం చేశామన్నారు. విజయవాడ తర్వాత నెల్లూరు జిల్లాలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సిస్టమ్‌ను ఏర్పాటు చేశామని, త్వరలోనే డీజీపీ సాంబశివరావు చేతుల మీదుగా ప్రారంభించి శాంతిభద్రతలను పూర్తిస్థాయిలో అదుపులోకి తీసుకొస్తామని చెప్పారు. ఏఎస్పీ శరత్‌బాబు, ఎస్బీ, నగర డీఎస్పీలు కోటారెడ్డి, వెంకటరాముడు, ఇన్‌స్పెక్టర్లు మాణిక్యరావు, అబ్దుల్ కరీమ్, సుధాకర్‌రెడ్డి, రామారావు, సీతారామయ్య, మంగారావు, చెంచురామారావు, ఎస్బీ ఎస్సై శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.