నిందితులపై నిర్భయ కేసు
► మంత్రి సునీత, కలెక్టర్ కోన శశిధర్
► బాధిత గిరిజన విద్యార్థినికి పరామర్శ
అనంతపురం అర్బన్: గిరిజన విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన కామాంధులపై నిర్భయ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత, కలెక్టర్ కోన శశిధర్ ప్రకటించారు. అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత విద్యార్థినిని బుధవారం వారు పరామర్శించారు. ‘భయపడొద్దు. నీకు అండగా ఉంటామంటూ’ బాధితురాలితో పాటు వారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. బాగా చదువుకుని ఉన్నత స్థాయి చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం తరఫున తక్షణ సాయం కింద రూ.లక్ష అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
గిరిజన విద్యార్థినిపై జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. బాలికకు మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. బాలిక తనకు ఇష్టమైన చోట చదువుకునేందుకు సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని ప్రభుత్వ వసతి గృహాలు, కళాశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తామన్నారు. దోషులను చట్టప్రకారం శిక్షిస్తామన్నారు.
ఘటనపై నివేదిక ఇవ్వండి
గిరిజన విద్యార్థినిపై జరిగిన అత్యాచారానికి సంబంధించి నివేదిక ఇవ్వాలని జిల్లా అధికారులను ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారం శివాజీ ఆదేశించారు. ఈ మేరకు సమాచార శాఖ అధికారులు పత్రికలకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.