Tribal student
-
పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. చికిత్స పొందుతూ విద్యార్థిని శైలజ మృతి
సాక్షి, హైదరాబాద్ : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజన అశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్కి గురై గత కొన్ని రోజులుగా నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ సోమవారం మృతి చెందింది. అక్టోబర్ 30న వాంకిడి ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరగగా 64 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ముగ్గురు (మహాలక్ష్మి, జ్యోతి, శైలజ) పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చేర్పించారు.వీరిలో మహాలక్ష్మి, జ్యోతి కోలుకోగా శైలజ ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆమెకు ఉపిరితిత్తుల సమస్యతో పాటు మూత్రపిండాలపై ప్రభావం పడింది. దీంతో పలుసార్లు వైద్యులు డయాలసిస్ చేశారు. ఈ నెల 11 నుంచి శైలజను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో శైలజ నేడు మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. కాగా దీనిపై బీఆర్ఎస్ నేతలు స్పందిస్తూ శైలజ మృతి ప్రభుత్వం చేసిన హత్య అని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యానికి బలైపోయిన వాంకిడి గిరిజన గురుకుల విద్యార్థిని శైలజకు కన్నీటి నివాళి అర్పిస్తున్నట్లు మాజీ మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు. మీ ప్రాణాలు బలి తీసుకున్న పాపం.. ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతదన్నారు. గిరిజన విద్యార్థినీ కుటుంబానికి బాధ్యత వహించి రూ. 50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పరిపాలన మరో పేదబిడ్డ ప్రాణం తీసిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కన్నతల్లికి కడుపు కోత మిగిల్చింది. వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం వల్ల అస్వస్థతకు గురై 20 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శైలజ మరణ వార్త తననును ఎంతగానో కలచి వేసింది అని కవిత పేర్కొన్నారు.ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం వందలాది ప్రాణాలు బలి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సంక్షేమ పాఠశాలలో కనీసం బుక్కెడు బువ్వ కూడా పెట్టకుండా, పదకొండు నెలల్లో 43 మంది విద్యార్థుల ప్రాణాలు తీసింది. ఇవన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్యలే అని కవిత ఆరోపించారు. -
అనారోగ్యంతో గిరిజన విద్యార్థి మృతి
సాక్షి శృంగవరపుకోట(విజయనగరం) : మండలంలోని మూలబొడ్డవర గ్రామానికి చెందిన డిప్పల సింహాచలం (14) అనే గిరిజన విద్యార్థి అనారోగ్యంతో బుధవారం తెల్లవారుజామున ఇంటి వద్ద మృతి చెందాడు. సింహాచలం మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 21వ తేదీన గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న వరుసకు అన్నయ్య అయిన తోటి విద్యార్థితో కలిసి సింహాచలం మూలబొడ్డవరలో గల ఇంటికి వెళ్లాడు. అప్పటి నుంచి సింహాచలం హాస్టల్‌కు వెళ్లకపోవడంతో వసతిగృహ సంక్షేమాధికారి ఎం. భాస్కర్ ఆరా తీయగా ఇంటి వద్ద ఉన్నట్లు తేలింది. ఇంతలో హఠాత్తుగా ఈ నెల 30న సింహాచలం అనారోగ్యానికి గురయ్యాడు. వెంటనే తండ్రి అడివేసు కుమారుడ్ని ఎస్.కోట ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల ప్రైవేట్ ల్యాబ్‌కు తీసుకువచ్చి రక్తపరీక్షలు చేయించగా.. హిమోగ్లోబిన్ 2.6 శాతం ఉన్నట్లు తేలింది. వెంటనే సింహాచలంను ప్రైవేట్ క్లినిక్‌కు తీసుకెళ్లి వైద్యసేవలందించి.. ఇంటికి తీసుకెళ్లిపోయాడు. బుధవారం మరో ఆస్పత్పికి తీసుకెళ్దామనుకున్న సమయంలో ఘోరం జరిగిపోయిందని విద్యార్థి తల్లిదండ్రులు అంకాలమ్మ, అడివేసి బోరున రోదిస్తూతెలిపారు. ఆడుతూ పాడుతూ కళ్లముందు తిరుగుతున్న విద్యార్థి సింహాచలం మృతి చెందడంతో మూలబొడ్డవర గ్రామంలో విషాదం నెలకొంది. ప్రభుత్వం ఆదుకోవాలి.. మృతి చెందిన గిరిజన విద్యార్థి డి.సింహాచలం కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని ఏపీ గిరిజన సంఘ డివిజన్ కార్యదర్శి జె.గౌరీష్, సభ్యులు ఆర్.శివ, జి.గౌరినాయుడు డిమాండ్ చేశారు. బుధవారం వారు మాట్లాడుతూ, గిరిజన విద్యార్థులు విషజ్వరాల బారిన పడుతున్నప్పటికీ హాస్టల్ వార్డెన్, ఐటీడీఏ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వారి నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు మృతి చెందుతున్నారన్నారు. దీర్ఘకాలిక రోగంతో బాధపడుతున్నాడు.. విద్యార్థి సింహాచలం సికిల్‌సెల్ ఎనీమియా, రుమటాయిడ్ ఆర్థ్రరైటిస్ అనే వ్యాధితో దీర్ఘకాలంగా బాధపడుతున్నాడని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల హాస్టల్ వార్డెన్ ఎం.భాస్కర్ తెలిపారు. 2014లో విశాఖలోని కేజీహెచ్‌లో కూడా చికిత్స తీసుకున్నాడన్నారు. గతేడాది జనవరిలో ఆశ్రమ పాఠశాలలో చేరి అంతలోనే డ్రాపౌట్ అయ్యాడని తెలిపారు. మరలా జూన్ 2019లో విద్యార్థి డి.సింహాచలం 5వ తరగతిలో చేరాడని, ఈ నెల 21వ తేదీన ఇంటికి వెళ్లిపోయాడని స్పష్టం చేశారు. హాస్టల్లో ఏఎన్ఎం ఉంటున్నారని, ఎప్పటికప్పుడు కొట్టాం పీహెచ్సీ వైద్యులు, సిబ్బంది విద్యార్థులను పరీక్షించి వెళ్తుంటారని తెలిపారు. ఇదిలా ఉంటే సింహాచలం మృతి వార్త తెలుసుకున్న ఆశ్రమ పాఠశాల హెచ్ఎం పీవీ ప్రసాదరావు, ఏటీడబ్ల్యూఓ వరలక్ష్మి, వార్డెన్ ఎం.భాస్కర్ మూలబొడ్డవర వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దహన సంస్కారాల నిమిత్తం హెచ్ఎం ప్రసాదరావు రూ. ఐదు వేల ఆర్థిక సాయం చేశారు. కుమారుడి మృతదేహం వద్ద దీనంగా రోదిస్తున్న తల్లి, కుటుంబసభ్యులు -
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
విశాఖపట్నం, అనంతగిరి: పరీక్షలలో ఫెయిలు అయ్యానన్న మనస్తాపంతో ఓ గిరిజన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు అందించిన వివరాలు ప్రకారం..మండలంలోని గుమ్మకోట పంచాయతీకి భీమవారం గ్రామానికి చెందిన బిడ్డ తులసి(17) శృంగవరపుకోట ఓ ప్రయివేటు కళాశాలలోని ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. శుక్రవారం విడుదలైన పరీక్షల ఫలితా లలో తన పరీక్ష తప్పిందని తెలుసుకుని క్లోరోకిన్ మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్ప డింది. దీంతో కొన ఊపిరితో ఉన్న ఆమెను గమనించిన కుటుంబ సభ్యులు స్థానికులు శృంగవరపుకోటకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్య సేవల కోసం కేజీహెచ్‌కు తరలించారు. కేజీహెచ్‌లో వైద్య సేవలు పొందుతూ ఆమె మృత్యువాత పడింది. తులసి మృతి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
కొండరెడ్డి గిరిజన విద్యార్థిని మృతి
పశ్చిమగోదావరి, బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల ప్రాంతమైన రెడ్డికోపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న పాములేటి సీతమ్మ (10) అనే కొండరెడ్డి గిరిజన విద్యార్థిని గురువారం వైద్యం పొందుతూ విజయవాడలో మృతి చెందింది. గత నెల 30న జ్వరంతో బాధపడుతున్న సీతమ్మను పులిరామన్నగూడెం ఆస్పత్రిలో చేర్పించినట్టు డాక్టర్ సురేష్ తెలిపారు. అయితే ఆ సమయంలో రక్తపరీక్షలు చేయగా మలేరియా జ్వరంగా నమోదైందని చెప్పారు. మూడు రోజులపాటు మెరుగైన వైద్యం అందించామన్నారు. ఈనేపథ్యంలో ఈనెల 1వ తేదీ రాత్రి సీతమ్మకు వాంతులు కావడంతోపాటు కాళ్లు, చేతులు బిగుసుకుపోవడంతో పాఠశాల సిబ్బంది మళ్లీ పీహెచ్‌సీకి తీసుకువచ్చారన్నారు. ప్రాథమిక వైద్యం చేసి జంగారెడ్డిగూడెం రిఫర్ చేశామని అక్కడి నుంచి ఏలూరు, విజయవాడకు తరలించగా అక్కడ వైద్యం పొందుతూ మృతి చెందినట్టు డాక్టర్ సురేష్ చెప్పారు. పాఠశాలలో రెండో మరణం రెడ్డికోపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఇప్పటికే ఇద్దరు విద్యార్థినులు మృతి చెందారు. గతంలో కెచ్చెల పద్మ అనే విద్యార్థిని మృతి చెందగా ఇప్పుడు సీతమ్మ కన్నుమూసింది. అనా రోగ్యంతో ఉన్న సీతమ్మను పులిరామన్నగూడెం ఆస్పత్రిలో చేర్పించినప్పుడు మలేరియా కేస్‌గా నమోదైంది. అయితే విజయవాడలో వచ్చిన రిపోర్ట్‌లో మాత్రం క్లబిసెలా బాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల మృతి చెందినట్టు ఉంది. అయితే ఎక్కడా మలేరియా ప్రస్తావన లేకపోవడం గమనార్హం. చదువుకోవడానికి వచ్చి మృత్యుఒడికి.. పశ్చిమ ఏజెన్సీలో మారుమూల చిలకలూరు గ్రామానికి చెందిన పాములేటి సీతమ్మ చదువు కోసం రెడ్డికోపల్లి గురుకుల పాఠశాలలో చేరింది. గతనెలలో దసరా సెలవులకు ఇంటికి వెళ్లి పాఠశాల పునఃప్రారంభం తర్వాత వచ్చిన సీతమ్మ జ్వరం బారినపడింది. పది రోజులపాటు వైద్యం పొందినా ప్రయోజనం లేకపోయింది. ఐటీడీఏ పీఓ ఎంఎన్ హరేంధిరప్రసాద్ సీతమ్మను బతి కించేందుకు సుమారు రూ.2 లక్షల వరకూ ఖర్చు చేసినట్టు సిబ్బంది చెబుతున్నారు. అయినా సీతమ్మ మృత్యు ఒడికి చేరింది. మృతురాలు సీతమ్మ తల్లి రామమ్మ ఐదేళ్ల క్రితం జ్వరంతోనే మృతిచెందింది. తండ్రి చిన్నారెడ్డి అడవే ఆధారంగా జీవించే సాధారణ కూలీ. సీతమ్మకు అక్క, తమ్ముడు ఉన్నారు. -
ఎవరెస్టు అధిరోహణకు రేణుక పయనం
సీతంపేట: ఎవరెస్టు శిఖర అధిరోహణకు కొండగొర్రె రేణుక అనే గిరిజన విద్యార్థిని శుక్రవారం తన స్వగ్రామమైన భామిని మండలం నులకజోడు నుంచి పయనమై వెళ్లింది. పది రోజుల పాటు విజయవాడలోని కేతాని కొండ వద్ద శిక్షణ అనంతరం మరో పది రోజులు లడక్‌లో మంచు పర్వతాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. తదుపరి 20 రోజుల తర్వాత ఎవరెస్టు అధిరోహణకు వెళ్లనున్నారు. రేణుక ఎవరెస్టు ఎక్కితే జిల్లా నుంచి ఊయక కృష్ణారావు తర్వాత అధిరోహించిన రెండో గిరిజన విద్యార్థినిగా గుర్తింపు దక్కుతుంది. ఈమె సీతంపేట గిరిజన బాలికల గురుకుల కళాశాలలో వృత్తివిద్యాకోర్సు ( అక్కౌంట్స్ అండ్ ట్యాక్సేషన్) గ్రూపు ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు రాసింది. ఇప్పటికే 6,620 మీటర్ల ఎత్తయిన రినాక్ పర్వతశిఖరాన్ని అధిరోహించింది. 8,848 మీటర్ల ఎత్తున్న ఎవరెస్టు శిఖరాగ్రాన చేరుకోవడానికి ఉవ్విళ్లూరుతోంది. తల్లిదండ్రులు సంజీవరావు, కృష్ణవేణిలు కొండపోడు వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తుంటారు. రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం వారిది. అన్నయ్య గణపతి పదో తరగతి వరకు చదివి డ్రాపౌట్ అయ్యాడు. మరో అన్నయ్య సంతోష్ సీతంపేటలో ఐటీఐ చేస్తున్నాడు. ప్రాథమిక విద్యాబ్యాసం స్వగ్రామంలో పూర్తి చేసి, ఐదు నుంచి పదోతరగతి వరకు హడ్డుబంగి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో పూర్తి చేసింది. ఇంటర్మీడియట్ సీతంపేట బాలికల కళాశాలలో చేరింది. గురుకుల సొసైటీ ఇచ్చిన పర్వతారోహణ శిక్షణ అందిపుచ్చుకుంది. -
అంతర్జాతీయ సదస్సుకు గిరిజన విద్యార్థి
వరంగల్ రూరల్, కొడకండ్ల(పాలకుర్తి): మలేషియాలో ఈనెల 19 నుంచి 22 వరకు జరుగనున్న అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు జనగామ జిల్లా కొడకండ్ల మండలం లక్ష్మక్కపెల్లి శివారు లాలుతండాకు చెందిన యువ పరిశోధక విద్యార్థి వాంకుడోత్ నరేందర్‌పవార్‌కు ఆహ్వానం లభించింది. క్యేన్సర్ వ్యాధి, జటిలమైన సోయాసిస్ చర్మ వ్యాధులకు జన్యు స్థాయిలో ఔషధ మొక్కలపై ఆయన చేసిన పరిశోధనలు, ప్రచురించిన పరిశోధక పత్రాలతో పాటు పరిశోధనలో చూపిస్తున్న ప్రతిభను గుర్తించిన ఇన్నోవేటివ్ సింటిఫిక్ రీసెర్చ్ ఫ్రొఫెషనల్ మలేషియా సంస్థ వారు మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో నిర్వహించే అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానించారు. కాగా, నరేందర్ పవార్ అంతర్జాతీయ సదస్సుకు ఎంపిక కావడంపై తండావాసులు అభినందించారు. -
రేపు కొరాపుట్‌లో బందు
జయపురం: కొరాపుట్ జిల్లా పొట్టంగి పోలీసు స్టేషన్ పరిధి సోరిసపొదర్ గ్రామం అడవిలో ఆదివాసీ విద్యార్థినిపై ఇటీవల జరిగిన సామూహిక లైంగికదాడిని మావోయిస్టులు తీవ్రంగా ఖండించారు. ఈ అమానుష సంఘటనతో మావోయిస్టులకు సంబంధం ఉండవచ్చని పోలీసు ఉన్నతాధికారులు వెల్లబుుచ్చిన అభిప్రాయంపై ఆంధ్ర–ఒడిశా బోర్డర్ మావో స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు జగబందు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేకరులతో శనివారం ఆయన ఫోన్లో మాట్లాడారు. సంఘటన జరిగి నాలుగు రోజులు అయినా దోషులను గుర్తించి, అదుపులోకి తీసుకోవడంలో పోలీసులు, క్రైం బ్రాంచ్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. ఇటువంటి అమానుష ఘటనలో పోలీసులు మమేకమయ్యారని ఆరోపించారు. పోలీసుల తీరును ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మావోయిస్టులు తీవ్రంగా ఖండిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే ఈ సంఘటనలో దోషులను శిక్షించి, బాధితులకు న్యాయం చేయాలని ఆందోళనలు జరుపుతున్న వారికి మావోయిస్టులు పూర్తి మద్దతు ఇస్తారని వెల్లడించారు. ఈ మేరకు సోమవారం కొరాపుట్ జిల్లా బందుకు మావోలు పిలుపునిస్తున్నారని తెలిపారు. మరోపక్క జిల్లా కాంగ్రెస్ పార్టీ సోమవారం కొరాపుట్ జిల్లా బందుకు పిలుపునిచ్చిన విషయం విదితమే. ఒక పక్క కాంగ్రెస్, మరో పక్క మావోయిస్టులు బందుకు పిలుపునీయటంతో పోలీసులు, ప్రభుత్వం అప్రమత్తం అవుతుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయోనని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బందుకు పిలుపు ఇవ్వగా, మావోయిస్టులు సమయ నిర్ధారణ లేకుండా బందుకు పిలుపునిచ్చారు. మావోలు బందుకు పిలుపునివ్వడంతో మావో ప్రభావిత ప్రాంతాలు ముఖ్యంగా నారాయణపట్న, బందుగాం, పొట్టంగి, సెమిలిగుడ, నందపూర్ లమతాపుట్, లక్ష్మీపూర్ తదితర ప్రాంతాలలో బందు తీవ్రంగా ఉండవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బందుతో జనజీవనం, రవాణా స్తంభించవచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. దోషులను అరెస్టు చేయండి జయపురం:కొరాపుట్ జిల్లా కుందులి సమీప సోరిసిపొదర్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ముసాసగుడ గ్రామం విద్యార్థినిపై సామూహిక లైంగికదాడి చేయడం దారుణమని కొరాపుట్ జిల్లా భారతీయ కమ్యూనిస్టు పార్టీ పేర్కొంది. ఈ ఘటనకు వ్యతిరేకంగా పార్టీ నాయకులు జయపురంలో శనివారం ర్యాలీ నిర్వహించారు. జయనగర్‌లోని జయపురం çసబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి రాష్ట్ర గవర్నర్‌కు ఉద్దేశించి రాసిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మావోయిస్టుల ప్రభావిత ప్రాంతంలో ఈ సంఘటన జరగటంతో దోషులను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. బాలికపై సామూహిక లైంగికదాడి చేసిన దుండగులు ఎవరైనా వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనకు కొరాపుట్ జిల్లా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి జుధిష్టర రౌళో, సహాయ కార్యదర్శి రామకృష్ణ దాస్, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు ప్రమోదకుమార్ మహంతి తదితరులు నాయకత్వం వహించారు. -
గిరిజన బాలుడికి సెరిబ్రల్ మలేరియా లక్షణాలు ?
పార్వతీపురం : సెరిబ్రల్ మలేరియాతో బాధపడుతున్న రెండేళ్ల గిరిజన చిన్నారిని తల్లిదండ్రులు బుధవారం స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. కొమరాడ మండలం గొర్లిమ గ్రామానికి చెందిన మీనక పూలు, రుత్తు దంపతులకు చెందిన చిన్న దాదాపు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో వారు చిన్నాను ఆస్పత్రికి తీసుకురాగా వైద్యులు పరీక్షించి సెరిబ్రల్ మలేరియాగా గుర్తించి విశాఖ తీసుకెళ్లాలని సూచించారు. -
పరిశోధనలే ప్రాణంగా..
చారిత్రక సంపద అన్వేషణకు కృషి చేస్తున్న గిరిపుత్రుడు వివిధ రాష్ట్రాల్లో పలు పరిశోధనలు సామాజిక సేవతో ప్రత్యేక గుర్తింపు ప్రముఖుల ప్రశంసలు పొందుతున్న సుధాకర్ మరిపెడ : చరిత్ర మూలాలు తెలుసుకునేందుకు ఆయన పడే తపన అంతా ఇంతాకాదు. రాళ్లు, రప్పలు, గుట్టలు, చెట్లు ఇలా ఎన్నో ప్రాంతాలను సందర్శిస్తూ జాతి సంపదను వెలికితీసేందుకు కృషి చేస్తున్నాడు. కాలగర్భంలో కలిసిపోయిన చారిత్రక ఆనవాళ్లను వెలికితీస్తూ నేటి తరానికి వాటి ఆవశ్యకతను తెలియజేసేందుకు పాటుపడుతున్నాడు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వినూత్న పరిశోధనలు చేస్తూ ఓరుగల్లు కీర్తిని నలుదిశలా చాటుతున్న గిరిపుత్రుడు ఇస్లావత్ సుధాకర్‌పై కథనం. విద్యతోనే సమాజంలో గుర్తింపు ఉంటుందని పాలకులు, అధికారులు చెబుతుంటారు. అయితే చదువుతోపాటు పరిశోధనలతో కూడా పేరు సంపాదించుకోవచ్చని ఓ విద్యార్థి నిరూపిస్తూ ముందుకుసాగుతున్నాడు. కురవి మండలంలోని సీరోలు శివారు రేకులతండాకు చెందిన ఇస్లావత్ సుధాకర్ చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరుస్తున్నాడు. 1 నుంచి 10వ తరగతి వరకు కురవి జిల్లా పరిషత్ పాuý శాలలో, ఇంటర్ మానుకోటలో చదివిన సుధాకర్ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. డిగ్రీలో ప్రారంభం 2012లో ఖమ్మంలోని ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న సమయంలో అధ్యాపకులు, విద్యార్థులు బృహత్ శిలా యుగపునాటి తవ్వకాలు జరిపారు. ఈ సందర్భంగా సుధాకర్ కూడా అందులో చురుగ్గా పాల్గొన్నాడు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా గుండాల మండలం పడుకోనిగూడెం అడవుల్లో పది కిలోమీటర్ల లోపల ఉన్న రాక్షసగూళ్లపై ఆయన పరిశోధన చేశాడు. అలాగే మరిపెడ మండలం జయ్యారంలో కూడా బృహత్ శిలలు ఉన్నాయని ఇటీవల కనుగొన్నాడు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో నవీనా శిలా యుగానికి చెందిన ఆదిమానవుల సంస్కృతి, అవశేషాలను గుర్తించి వాటిపై కూడా పరిశోధన చేశాడు. వీటితోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని అడవులు, గుట్టల్లోని బృహత్ శిలాయుగం నాటి సమాధులు, నవీనా శిలాయుగపు సాంస్కృతిక అవశేషాలను కనుగొన్నాడు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాలో గోల్కోండ నయా ఖిల్లా తవ్వకాల్లో అసిస్టెంట్ ఆర్కియాలజిస్ట్‌గా సుధాకర్ పరిశోధనలు జరిపి అధికారుల మన్ననలు పొందాడు. సుధాకర్ అందుకున్న అవార్డులు హిస్టరీ, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ద్వారా పరిశోధనల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ ప్రాచీన, పూర్వయుగపు సంస్కృతిని భావితరాలకు తెలియజేసేందుకు కృషి చేస్తున్న సుధాకర్‌కు 2015 నవంబర్ 14న ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రతిభా పురస్కార్ అవార్డు అందజేశారు. అలాగే ఖమ్మంలోని ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ కాలేజీ నుంచి ఎన్సీసీ కేడెట్‌గా సామాజిక సేవలు అందించి 2010లో బెస్ట్ కేడెట్ అవార్డు అందుకున్నాడు. కాగా, 2010లో నేషనల్ బెస్ట్ కేడెట్ అవార్డును డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చేతుల మీదుగా సికింద్రాబాద్ క్యాంపులో అందుకున్నాడు. ఎన్ఐసీ (నేషనల్ ఇంటిగ్రేటెడ్ క్యాంపు) తిరుపతిలో బెస్ట్ కేడెట్ అవార్డు, ఆలిండియా ట్రెక్కింగ్ క్యాంపు కేరళలో బెస్ట్ కేడెట్ అవార్డు, వరల్డ్ టూరిజం డే సందర్భంగా బౌల్డ్ రింగ్ బెస్ట్ ఫర్మామెన్స్ అవార్డు, స్టేట్ ఎన్ఎస్ఎస్ మెగా క్యా ంపులో బెస్ట్ వలంటరీ అవార్డు, నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంపులో బెస్ట్ కేడెట్ అవార్డు అందుకున్నారు. వీటితోపాటు క్రీడా విభాగంలో వెయిట్ లిఫ్టింగ్‌లో నాగార్జున యూనివర్సిటీలో 110 కేజీల విభాగంలో ప్రతిభ కనబరిచి అక్కడి వీసీ చేతుల మీదుగా ప్రథమ బహుమతి అందుకున్నాడు. చరిత్ర మూలాలు తెలుసుకునేందుకే.. మన పూర్వీకులు భావితరాల కోసం భద్రపరిచిన జాతిసంపదను కాపాడేందుకే నేను పరిశోధనలు చేస్తున్నాను. చారిత్రక అన్వేషణ చేయడమే నా లక్ష్యం. ప్రాచీన శిలాయుగం, నవీన శిలాయుగం, బృహత్ శిలాయుగం నాటి ఆదిమానవుల అవశేషాలు, వారి సంస్కృతిపై శాస్త్ర పరిశోధన చేస్తున్నాను. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని హిస్టరీ విభాగానికి చెందిన డాక్టర్ ఎస్.మురళీమోహన్ దగ్గర రీసెర్చ్ స్కాలర్‌గా పనిచేస్తున్నాను. – ఇస్లావత్ సుధాకర్, రీసెర్చ్ స్కాలర్ -
నెల్లికుదురులో గిరిజన విద్యార్థిని అదృశ్యం
నెల్లికుదురు : ఓ గిరిజన విద్యార్ధిని అదృశ్యమైన సంఘటన మండలంలోని జామతండా శివారు జాదుతండాలో ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రొబేషనరీ ఎస్సై రాకేష్ కథనం ప్రకారం.. జాదు తండాకు చెందిన గిరిజన విద్యార్థి నెల్లికుదురు జెడ్పీ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈ నెల 19న పాఠశాలకని వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. బంధువుల ఇళ్ల వద్ద వెతికినా లాభం లేకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి ఉంటారని విద్యార్థిని మేనమామ గుగులోతు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ప్రొబేషనరీ ఎస్సై తెలిపారు. -
తండా వాసి.. పరిశోధనల్లో మెరిసి
ఫార్మసీ రంగంలో ప్రతిభచూపుతున్న గిరిజన విద్యార్థి డయాబెటిస్, వెన్నునొప్పి మందులపై పలు పరిశోధనలు మారుమూల తండా నుంచి అంతర్జాతీయస్థాయికి ఎదిగిన శ్రీనివాస్ ఇంటర్ పూర్తికాగానే చాలా మంది విద్యార్థులు ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సులు పూర్తి చేసి ప్రశాంతంగా జీవించాలని కలలుగంటుంటారు. అయితే ఓ విద్యార్థి మాత్రం అందరిలా సంప్రదాయ కోర్సుల వైపు వెళ్లకుండా డిఫరెంట్ విభాగాన్ని ఎంచుకున్నారు. సమాజంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలనే లక్ష్యంతో ఫార్మసీ విద్యను అభ్యసించాడు. వినూత్న పరిశోధనలు చేస్తూ జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నాడు. కృషి, పట్టుదల ఉంటే ఎంతటి మహత్కార్యాన్ని అయినా సాధించవచ్చని చెబుతున్న గిరిజన విద్యార్థి ‘లావుడ్యా శ్రీనివాస్’పై ప్రత్యేక కథనం. పాలకుర్తి : పుట్టింది మారుమూల తండాలో అయినప్పటికీ ఓ గిరిపుత్రుడు చదువులో ప్రతిభ కనబరిచాడు. తల్లిదండ్రులు నిరుపేద కుటుంబానికి చెందినప్పటికీ ఆయన క్రమశిక్షణతో విద్యనభ్యసించి కన్నవారి కలలు నెరవేర్చాడు. వివరాల్లోకి వెళితే.. పాలకుర్తి మండలంలోని కొండాపురం గ్రామ శివారు పెద్ద తండాకు చెందిన లావుడ్యా దేవానాయక్–బుజ్జి దంపతుల మొదటి కుమారుడు శ్రీనివాస్ ఫార్మసీ రంగంలో సత్తాచాటుతున్నాడు. 1 నుంచి 10వ తరగతి వరకు పాలకుర్తి జిల్లా పరిషత్ పాఠశాలలో, వరంగల్‌లో ఇంటర్, బీ ఫార్మసీ చదివిన శ్రీనివాస్ పంజాబ్ రాష్ట్రం చంఢీగర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ అండ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ (ఎంఎస్ ఫార్మ) పూర్తి చేశాడు. డయాబెటిస్ మందులపై పరిశోధన.. శ్రీనివాస్ ఎంఎస్ ఫార్మ విద్యను అభ్యసిస్తున్న సమయంలోనే పలు పరిశోధనలు చేశాడు. ఇందులో భాగంగా 2014 నవంబర్ 21 నుంచి 24 వరకు సింగపూర్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ‘డయాబెటిస్ న్యూరోపతి’ అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు. ఈ సదస్సుకు భారతదేశం నుంచి విద్యార్థి ప్రతినిధిగా శ్రీనివాస్‌కు మాత్రమే అవకాశం రావడం గమ నా ర్హం. 2015 సంవత్సరంలో యూఎస్ఏలోని బోస్టన్ సిటీలో జరిగిన ఫార్మాసుయో పియోమెడియాలజీ (ఐసీపీఈ) అంతర్జాతీయ సదస్సుకు కూడా భారతదేశం తరపున పాల్గొని పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చాడు. వీటితోపాటు పలు జాతీయ సదస్సుల్లో తాను చేసిన పరిశోధనలనలపై ప్రజెంటేషన్ ఇచ్చి నిర్వాహకుల మన్ననలు పొందాడు. శ్రీనివాస్ ప్రస్తుతం ఛండీగర్‌లోని అంతర్జాతీయ ఎం ఎన్సీ ఫార్మసీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మరిన్ని పరిశోధనలు జరగాలి ఫార్మసీ రంగంలో మరిన్ని పరిశోధనలు జరిగి పేద ప్రజలకు ఫలితాలు అందాలి. ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న మధుమేహ వ్యాధిని నియంత్రించేందుకు తాను కొన్ని పరిశోధనలు చేసి సమాచారం సేకరించాను. సింగపూర్‌లో జరిగిన అంతర్జాతీయ ఫా ర్మసీ సదస్సులో పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చాను. డయాబెటీస్ నివారణకు తక్కువ ఖర్చుతో కొనుగోలు చేయాల్సిన మందుల విష యాన్ని అక్కడ వివరించాను. వెన్నెముక నొప్పి రావడానికి గల కారణాలు, వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అమెరికాలో జరిగిన అంతర్జాతీయ ఫార్మసీ సదస్సులో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాను. ఈ రెండు సదస్సుల్లో నేను ఇచ్చిన ప్రజెంటేషన్‌ను నిర్వాహకులు ఆమోదించారు. లావుడ్యా శ్రీనివాస్, పరిశోధకుడు, పెద్దతండా మాకు సంతోషంగా ఉంది మా కుమారుడు శ్రీనివాస్ చదువులో ప్రతిభ కనబరుస్తుండడంతో అందరూ అభినందిస్తున్నారు. తండా పేరును విదేశాల వరకు తీసుకెళ్లడం సంతోషంగా ఉంది. శ్రీనివాస్ భవిష్యత్‌లో మరిన్ని పరిశోధనలు చేసి తండాకు, దేశానికి మంచి పేరు తీసుకొస్తాడని ఆశిస్తున్నాం. –లావుడ్యా దేవానాయక్–బుజ్జి (శ్రీనివాస్ తల్లిదండ్రులు) -
యాజమాన్యం నిర్లక్ష్యానికి గిరిజన విద్యార్థిని బలి
* అనారోగ్యంతో కృష్ణవేణి రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థి మృతి * సమయానికి వైద్యం అందించలేదని కుటుంబ సభ్యుల ఆందోళన * మార్చురీ ఎదుట రాత్రి వరకు బైఠాయింపు ఆదిలాబాద్ రూరల్/ఆదిలాబాద్ క్రైం : పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యానికి గిరిజన విద్యార్థిని బలైంది. ధనార్జనే ధ్యేయంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలు.. విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపకుండా ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఆదిలాబాద్ మండలంలోని మావల గ్రామ పంచాయతీ పరిధిలోని కృష్ణవేణి రెసిడెన్షియల్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న కోవ దివ్య (14) మంగళవారం అనారోగ్యంతో రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన కలకలం రేపింది. సిర్పూర్-యూ మండలం రాగాపూర్ గ్రామానికి చెందిన విమలాబాయి, అమృత్రావులు వ్యవసాయకూలీ పనిచేసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. వీరి పెద్దకుమార్తె దివ్య. వీరికి నలుగురు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నాడు. పెద్ద కూతురును పెద్ద చదువులు చదివించాలనుకున్నారు. కానీ వారి ఆశలు ఆదిలోనే ఆవిరైపోయాయి. దివ్య 7వ తరగతి వరకు ఆసిఫాబాద్‌లోని ప్రభుత్వ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో చదివింది. ఇటీవలే ఐటీడీఏ పరిధిలో నిర్వహించే బెస్ట్ అవైలేబుల్ స్కూల్ కింద మావల గ్రామంలోని కృష్ణవేణి రెసిడెన్షియల్ పాఠశాలలో సీటు లభించింది. తల్లిదండ్రులు ఈనెల 1వ తేదీన పాఠశాలలో చేర్పించారు. మంగళవారం దివ్య అనారోగ్యానికి గురికావడంతో పాఠశాల యాజమాన్యం ఉదయం 7 గంటలకు రిమ్స్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. పరిస్థితి విషమించడంతో మధ్యాహ్నం 1.20 గంటలకు మృతిచెందినట్లు ఆదిలాబాద్ రూరల్ ప్రొహిబిషన్ ఎస్సై సుబ్బారావు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. యాజమాన్యం నిర్లక్ష్యంతోనే మృతి.. కనీసం మా కూతురు ఆరోగ్యం బాగాలేదని కూడా తమకు సమాచారం ఇవ్వలేదని, కడసారి మాట్లాడుకుండా చేశారని దివ్య తల్లిదండ్రులు విమలాబాయి, అమృత్రావులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్చూరీ ఎదుట ధర్నా.. విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల నాయకులు, కుల సంఘాలు దివ్య కటుంబ సభ్యులతో కలిసి రిమ్స్ మార్చురి ఎదుట ధర్నా చేపట్టారు. సుమారు నాలుగు గంటల పాటు అక్కడే బైఠాయించారు. వర్షంలో కూర్చొని ఆందోళన చేశారు. యాజమాన్యం రావాలని నినాదాలు చేశారు. అనంతరం ఐటీడీఏ ఏటీడబ్ల్యూవో చంద్రమోహన్ బంధువుల డిమాండ్ మేరకు ఏటీడబ్ల్యూవో ఐటీడీఏ పీవో ఆర్వీ కర్ణన్‌తో మాట్లాడారు. స్పందించిన పీవో పాఠశాల యాజమాన్యంతో మాట్లాడి కుటుంబంలో ఒకరికి ఔట్సోర్సింగ్ ఉద్యోగం వచ్చేలా చూస్తామని పీవో హామీ ఇచ్చారు. యాజమాన్యం నిర్లక్ష్యం ఉంటే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని పీవో హామీ ఇచ్చినట్లు చంద్రమోహన్ తెలిపారు. -
నిందితులపై నిర్భయ కేసు
► మంత్రి సునీత, కలెక్టర్ కోన శశిధర్ ► బాధిత గిరిజన విద్యార్థినికి పరామర్శ అనంతపురం అర్బన్: గిరిజన విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన కామాంధులపై నిర్భయ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత, కలెక్టర్ కోన శశిధర్ ప్రకటించారు. అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత విద్యార్థినిని బుధవారం వారు పరామర్శించారు. ‘భయపడొద్దు. నీకు అండగా ఉంటామంటూ’ బాధితురాలితో పాటు వారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. బాగా చదువుకుని ఉన్నత స్థాయి చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం తరఫున తక్షణ సాయం కింద రూ.లక్ష అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. గిరిజన విద్యార్థినిపై జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. బాలికకు మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. బాలిక తనకు ఇష్టమైన చోట చదువుకునేందుకు సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని ప్రభుత్వ వసతి గృహాలు, కళాశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తామన్నారు. దోషులను చట్టప్రకారం శిక్షిస్తామన్నారు. ఘటనపై నివేదిక ఇవ్వండి గిరిజన విద్యార్థినిపై జరిగిన అత్యాచారానికి సంబంధించి నివేదిక ఇవ్వాలని జిల్లా అధికారులను ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారం శివాజీ ఆదేశించారు. ఈ మేరకు సమాచార శాఖ అధికారులు పత్రికలకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
‘చిలక’ పలుకు
♦ గిరిజన విద్యార్థి రాహుల్ అద్భుత ప్రతిభ ♦ 7.40 నిమిషాల్లో వేమన శతక పద్యధారణ ♦ రికార్డును తిరగరాసిన సిద్ధారం విద్యార్థి ♦ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ స్క్రూట్నీలో ఎంపిక సత్తుపల్లి: సిద్ధారం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న చిలక రాహుల్ అద్భుత ప్రతిభ ప్రదర్శించాడు. తెలుగుబుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు కోసం సోమవారం పాఠశాలలో జరిగిన స్క్రూట్నీలో వేమన శతకంలోని 100 పద్యాలను 7.40 నిమిషాల్లో పూర్తి చేసి రికార్డులు తిరగరాశాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఈ తరహా రికార్డు గతంలో సింగరాజు మంజునాథ్ పేరున ఉండేది. 11 ఏళ్ల వయసులో మంజునాథ్ 2015 అక్టోబర్‌లో తిరుపతిలో జరిగిన వేమన పద్యాల పోటీల్లో 11.40 నిమిషాల్లో రికార్డు నమోదు చేశాడు. దాన్ని సోమవారం 12 ఏళ్ల రాహుల్ తిరగరాయటం గమనార్హం. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధి డాక్టర్ బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి, ముఖ్య అతిథులు తహసీల్దార్ దొడ్డా పుల్లయ్య, ఎంపీడీఓ రవి చేతులమీదుగా రాహుల్ స్క్రూట్నీ గుర్తింపు పత్రాన్ని పొందాడు. త్వరలో ప్రధాన ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ♦ రాహుల్ నేపథ్యం: ఎస్టీ నాయకపోడు వర్గానికి చెందిన చిలక రాంబాబు, వెంకటలక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలు. రాహుల్ (8వ తరగతి), సుస్మిత (6వ తరగతి). వీరు సిద్ధారం యూపీఎస్ పాఠశాలలో చదువుతున్నారు. తల్లిదండ్రులిద్దరూ కూలీ పనులు చేస్తే తప్ప పూట గడవని పరిస్థితి. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ అద్భుత ప్రదర్శనపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ♦ ఇదో అద్భుత ఘట్టమని తహసీల్దార్ పుల్లయ్య పేర్కొన్నారు. రా హుల్‌ను ప్రోత్సహించిన ఉపాధ్యా య బృందాన్ని అభినందించారు. ♦ 8 నిమిషాల్లోపే వేమన శతక పద్యాలను పూర్తి చేయడం అద్భుత ఘట్టమని ఎంపీడీఓ రవి పేర్కొన్నారు. ♦ తెలుగుబుక్ ఆఫ్ రికార్డ్స్ అధికార ప్రతినిధి డాక్టర్ బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి రాహుల్‌కు గుర్తింపు పత్రాన్ని ఇచ్చారు. ప్రధాన పోటీలకు అనుమతించారు. ఈ కార్యక్రమంలో సిద్ధారం సర్పంచ్ మోరంపూడి ప్రమీలారాణి, ప్రసాద్, హెచ్ఎం బి.మధుసూదన్‌రాజు, సృజన బాధ్యులు రామకృష్ణ తదితరులు రాహుల్‌కు, బొమ్మారెడ్డికి జ్ఞాపికలు ఇచ్చి సత్కరించారు. శేషగిరి, మాలతి దంపతులు వీరిని శాలువాలతో సత్కరించారు. ఉపాధ్యాయులు రాజేశ్వరి, రాజ్యలక్ష్మి, నాగాచారి, మస్తాన్, రజనీదేవిలతో పాటు ఎంపీపీ జ్యేష్ట అప్పారావు, ఎంఈఓ బి.రాములు, ఎంపీటీసీ వినుకొండ కృష్ణ, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం ఎన్.రాజేశ్వరరావు, గురుజ్యోతి నిర్వాహకులు చిత్తలూరి ప్రసాద్, ఎస్ఎంసీ చైర్మన్ దుర్గాచారి, ఉపసర్పంచ్ శ్రీరాములు రాహుల్‌ను అభినందించిన వారిలో ఉన్నారు. -
స్కాలర్షిప్ ఇవ్వకపోతే చనిపోతా
గిరిజన విద్యార్థి ఆవేదన పార్వతీపురం: స్కాలర్ షిప్ ఇవ్వకపోతే చచ్చిపోవడమే మార్గమని ఓ గిరిజన విద్యార్థి కన్నీరు మున్నీరయ్యాడు. ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో సోమవారం కురుపాం మండలం వలస బల్లేరు గూడ పంచాయతీ, ఆగమగూడ గ్రామానికి చెందిన బిడ్డిక ధర్మారావు అనే గిరిజన విద్యార్థి తన ఆవేదనను సాక్షి ముందు వెళ్లబోసుకున్నాడు. తనది నిరుపేద కుటుంబమని, ఎలాగైనా చదివి ప్రయోజకుడిని కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం స్కాలర్షిప్ ఇస్తుందనే ఆశతో డిగ్రీలో చేరానన్నాడు. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతూ పట్టణంలోని హాస్టల్లో ఉంటున్నానన్నాడు. రెండేళ్లుగా వేలిముద్రలు పడక స్కాలర్షిప్ రాలేదని వాపోయాడు. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం లేదన్నాడు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తనకు స్కాలర్షిప్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. -
ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి
వరంగల్ జిల్లా ఏటూరునాగారం గిరిజన ఆశ్రమ పాఠశాల వసతిగృహం విద్యార్థి అనారోగ్యంతో బుధవారం ఉదయం మృతి చెందాడు. కడుపునొప్పితో బాధపడుతున్న ఏడవ తరగతి విద్యార్థి భూక్యా రాయషెల్‌ను సిబ్బంది ఏటూరు నాగారం ఆస్పత్రికి బుధవారం ఉదయం తీసుకెళ్లారు. కొద్దిసేపటికే అతడు మృతి చెందాడు. కామెర్ల వ్యాధి వల్లే మృతి చెందినట్టు సమాచారం. తమకు సమాచారం అందించకుండానే తమ కుమారుడ్ని ఆస్పత్రికి తరలించారని మృతుడి తండ్రి భూక్యా బీకోజీ ఆరోపించాడు. -
అస్వస్థతతో గిరిజన విద్యార్థిని మృతి
బెజ్జూరు మండలం గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలకు చెందిన కొమరం మమ్మీ(13) అనే 8వ తరగతి విద్యార్థిని తీవ్ర అస్వస్థతతో గురువారం మృతి చెందింది. బాలిక రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. బుధవారం వాంతులు, విరేచనాలు కావడంతో స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్సపొందుతూ గురువారం తెల్లవారుజామున మరణించింది. బాలిక స్వగ్రామం బెజ్జూరు మండలం కోయపల్లి. -
తండా కుర్రోడు... జేఈఈలో టాపర్
నర్సంపేట (వరంగల్): గిరిజన తండాలో పుట్టిన ఓ నిరుపేద విద్యార్థి ప్రతిష్టాత్మక జేఈఈలో మెయిన్ ఫలితాల్లో సత్తా చాటాడు. ఇక్కడ మరో విశేషమేమంటే ఆ విద్యార్థి తన పేదరికంతో ఉన్నప్పటికీ కష్టపడి చదివి ఏకంగా ఆలిండియా స్థాయిలో అగ్రస్థానాన్ని అక్రమించాడు. వరంగల్ జిల్లాలోని జఫర్‌గఢ్ వుండలం ఓబులాపూర్ తండాకు చెందిన బానోతు వెంకన్న వికలాంగుల విభాగంలో ఆలిండియా స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించాడు. ఎంటెక్ చేసిన తన అన్నే తనకు స్ఫూర్తి అని, వరంగల్ ఎన్ఐటీలో చదివి సివిల్స్ పరీక్షలో విజయం సాధించడం తన లక్ష్యమని వికలాంగ విద్యార్థి వెంకన్న చెప్పాడు. ఎస్టీ విభాగంలోనూ తెలంగాణ బిడ్డే టాప్ భైంసా (ఆదిలాబాద్): జేఈఈ మెయిన్స్ ఫలితాలలో ఎస్టీ విభాగంలోనూ తెలంగాణకు చెందిన విద్యార్థి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా కుభీర్ మండలం మార్లగొండకు చెందిన రాథోడ్ దినేశ్ జేఈఈ మెయిన్‌లో ఎస్టీ విభాగంలో జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. మార్లగొండకు చెందిన రాథోడ్ మంగీలాల్-సవిత దంపతుల కుమారుడైన రాథోడ్ దినేశ్ పదో తరగతి వరకు భైంసాలో, ఇంటర్ హైదరాబాద్‌లో చదివాడు.