* అనారోగ్యంతో కృష్ణవేణి రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థి మృతి
* సమయానికి వైద్యం అందించలేదని కుటుంబ సభ్యుల ఆందోళన
* మార్చురీ ఎదుట రాత్రి వరకు బైఠాయింపు
ఆదిలాబాద్ రూరల్/ఆదిలాబాద్ క్రైం : పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యానికి గిరిజన విద్యార్థిని బలైంది. ధనార్జనే ధ్యేయంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలు.. విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపకుండా ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఆదిలాబాద్ మండలంలోని మావల గ్రామ పంచాయతీ పరిధిలోని కృష్ణవేణి రెసిడెన్షియల్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న కోవ దివ్య (14) మంగళవారం అనారోగ్యంతో రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన కలకలం రేపింది.
సిర్పూర్-యూ మండలం రాగాపూర్ గ్రామానికి చెందిన విమలాబాయి, అమృత్‌రావులు వ్యవసాయకూలీ పనిచేసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. వీరి పెద్దకుమార్తె దివ్య. వీరికి నలుగురు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నాడు. పెద్ద కూతురును పెద్ద చదువులు చదివించాలనుకున్నారు. కానీ వారి ఆశలు ఆదిలోనే ఆవిరైపోయాయి. దివ్య 7వ తరగతి వరకు ఆసిఫాబాద్‌లోని ప్రభుత్వ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో చదివింది. ఇటీవలే ఐటీడీఏ పరిధిలో నిర్వహించే బెస్ట్ అవైలేబుల్ స్కూల్ కింద మావల గ్రామంలోని కృష్ణవేణి రెసిడెన్షియల్ పాఠశాలలో సీటు లభించింది. తల్లిదండ్రులు ఈనెల 1వ తేదీన పాఠశాలలో చేర్పించారు.
మంగళవారం దివ్య అనారోగ్యానికి గురికావడంతో పాఠశాల యాజమాన్యం ఉదయం 7 గంటలకు రిమ్స్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. పరిస్థితి విషమించడంతో మధ్యాహ్నం 1.20 గంటలకు మృతిచెందినట్లు ఆదిలాబాద్ రూరల్ ప్రొహిబిషన్ ఎస్సై సుబ్బారావు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
యాజమాన్యం నిర్లక్ష్యంతోనే మృతి..
కనీసం మా కూతురు ఆరోగ్యం బాగాలేదని కూడా తమకు సమాచారం ఇవ్వలేదని, కడసారి మాట్లాడుకుండా చేశారని దివ్య తల్లిదండ్రులు విమలాబాయి, అమృత్‌రావులు ఆవేదన వ్యక్తం చేశారు.
మార్చూరీ ఎదుట ధర్నా..
విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల నాయకులు, కుల సంఘాలు దివ్య కటుంబ సభ్యులతో కలిసి రిమ్స్ మార్చురి ఎదుట ధర్నా చేపట్టారు. సుమారు నాలుగు గంటల పాటు అక్కడే బైఠాయించారు. వర్షంలో కూర్చొని ఆందోళన చేశారు. యాజమాన్యం రావాలని నినాదాలు చేశారు. అనంతరం ఐటీడీఏ ఏటీడబ్ల్యూవో చంద్రమోహన్ బంధువుల డిమాండ్ మేరకు ఏటీడబ్ల్యూవో ఐటీడీఏ పీవో ఆర్వీ కర్ణన్‌తో మాట్లాడారు. స్పందించిన పీవో పాఠశాల యాజమాన్యంతో మాట్లాడి కుటుంబంలో ఒకరికి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం వచ్చేలా చూస్తామని పీవో హామీ ఇచ్చారు. యాజమాన్యం నిర్లక్ష్యం ఉంటే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని పీవో హామీ ఇచ్చినట్లు చంద్రమోహన్ తెలిపారు.
యాజమాన్యం నిర్లక్ష్యానికి గిరిజన విద్యార్థిని బలి
Published Wed, Jul 6 2016 3:52 AM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM
Advertisement
Advertisement