సాక్షి శృంగవరపుకోట(విజయనగరం) : మండలంలోని మూలబొడ్డవర గ్రామానికి చెందిన డిప్పల సింహాచలం (14) అనే గిరిజన విద్యార్థి అనారోగ్యంతో బుధవారం తెల్లవారుజామున ఇంటి వద్ద మృతి చెందాడు. సింహాచలం మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 21వ తేదీన గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న వరుసకు అన్నయ్య అయిన తోటి విద్యార్థితో కలిసి సింహాచలం మూలబొడ్డవరలో గల ఇంటికి వెళ్లాడు. అప్పటి నుంచి సింహాచలం హాస్టల్‌కు వెళ్లకపోవడంతో వసతిగృహ సంక్షేమాధికారి ఎం. భాస్కర్ ఆరా తీయగా ఇంటి వద్ద ఉన్నట్లు తేలింది.
ఇంతలో హఠాత్తుగా ఈ నెల 30న సింహాచలం అనారోగ్యానికి గురయ్యాడు. వెంటనే తండ్రి అడివేసు కుమారుడ్ని ఎస్.కోట ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల ప్రైవేట్ ల్యాబ్‌కు తీసుకువచ్చి రక్తపరీక్షలు చేయించగా.. హిమోగ్లోబిన్ 2.6 శాతం ఉన్నట్లు తేలింది. వెంటనే సింహాచలంను ప్రైవేట్ క్లినిక్‌కు తీసుకెళ్లి వైద్యసేవలందించి.. ఇంటికి తీసుకెళ్లిపోయాడు. బుధవారం మరో ఆస్పత్పికి తీసుకెళ్దామనుకున్న సమయంలో ఘోరం జరిగిపోయిందని విద్యార్థి తల్లిదండ్రులు అంకాలమ్మ, అడివేసి బోరున రోదిస్తూతెలిపారు. ఆడుతూ పాడుతూ కళ్లముందు తిరుగుతున్న విద్యార్థి సింహాచలం మృతి చెందడంతో మూలబొడ్డవర గ్రామంలో విషాదం నెలకొంది.
ప్రభుత్వం ఆదుకోవాలి..
మృతి చెందిన గిరిజన విద్యార్థి డి.సింహాచలం కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని ఏపీ గిరిజన సంఘ డివిజన్ కార్యదర్శి జె.గౌరీష్, సభ్యులు ఆర్.శివ, జి.గౌరినాయుడు డిమాండ్ చేశారు. బుధవారం వారు మాట్లాడుతూ, గిరిజన విద్యార్థులు విషజ్వరాల బారిన పడుతున్నప్పటికీ హాస్టల్ వార్డెన్, ఐటీడీఏ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వారి నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు మృతి చెందుతున్నారన్నారు.
దీర్ఘకాలిక రోగంతో బాధపడుతున్నాడు..
విద్యార్థి సింహాచలం సికిల్‌సెల్ ఎనీమియా, రుమటాయిడ్ ఆర్థ్రరైటిస్ అనే వ్యాధితో దీర్ఘకాలంగా బాధపడుతున్నాడని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల హాస్టల్ వార్డెన్ ఎం.భాస్కర్ తెలిపారు. 2014లో విశాఖలోని కేజీహెచ్‌లో కూడా చికిత్స తీసుకున్నాడన్నారు. గతేడాది జనవరిలో ఆశ్రమ పాఠశాలలో చేరి అంతలోనే డ్రాపౌట్ అయ్యాడని తెలిపారు. మరలా జూన్ 2019లో విద్యార్థి డి.సింహాచలం 5వ తరగతిలో చేరాడని, ఈ నెల 21వ తేదీన ఇంటికి వెళ్లిపోయాడని స్పష్టం చేశారు. హాస్టల్‌లో ఏఎన్‌ఎం ఉంటున్నారని, ఎప్పటికప్పుడు కొట్టాం పీహెచ్‌సీ వైద్యులు, సిబ్బంది విద్యార్థులను పరీక్షించి వెళ్తుంటారని తెలిపారు. ఇదిలా ఉంటే సింహాచలం మృతి వార్త తెలుసుకున్న ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం పీవీ ప్రసాదరావు, ఏటీడబ్ల్యూఓ వరలక్ష్మి, వార్డెన్ ఎం.భాస్కర్ మూలబొడ్డవర వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దహన సంస్కారాల నిమిత్తం హెచ్‌ఎం ప్రసాదరావు రూ. ఐదు వేల ఆర్థిక సాయం చేశారు.
కుమారుడి మృతదేహం వద్ద దీనంగా రోదిస్తున్న తల్లి, కుటుంబసభ్యులు
Comments
Please login to add a commentAdd a comment