
జవాన్ భౌతికకాయాన్ని మోసుకెళ్తున్న స్థానిక ప్రజలు, గౌరవవందనం సమర్పిస్తున్న పోలీస్, ఆర్మీ అధికారులు
సాక్షి, శృంగవరపుకోట(విజయనగరం) : భరతమాత సేవలో తరించిన జవాన్ తనువు చాలించి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతుంటే ‘అక్రమ్ అమర్ రహే’ అంటూ అందరూ అంజలి ఘటించారు. ఎస్‌కోట పట్టణంలో శ్రీనివాసకాలనీకి చెందిన మహ్మద్ ఫజరుల్లా అలియాస్ అక్రమ్ (40) భౌతికకాయం ఇండియన్ ఆర్మీ వింగ్ కమాండర్ల పర్యవేక్షణలో బుధవారం రాత్రి 12 గంటలకు ఆయన ఇంటికి చేరుకుంది. అక్రమ్‌ను తీసుకొచ్చిన సైనికులు అందరూ గురువారం ఉదయం 9 గంటల వరకు ఇక్కడే ఉన్నారు. తహసీల్దార్ రామారావు, ఎస్‌కోట ఎస్‌ఐ అమ్మినాయుడు, విజయనగరం నుంచి వచ్చిన ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసు బ్యాండ్ పార్టీ సైనిక లాంఛనాల మధ్య స్థానికులు, యువకులు అక్రమ్ భౌతికకాయాన్ని శ్మశానవాటికకు చేర్చారు. ముస్లిం మత పెద్దలు ముందుగా నమాజు చేశారు. అనంతరం ఏఆర్ పోలీసులు మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి వీరజవాన్‌కు నివాళులు అర్పించారు. అనంతరం సైనికులు, పోలీస్ అధికారులు సెల్యూట్ చేశారు.
కంటతడి పెట్టిన కోట..
ఈ సందర్భంగా స్థానికులు జాతీయ పతాకాలు చేత పట్టి, అక్రమ్ అమర్ రహే అన్న నినాదాలు చేశారు. స్థానికులు పెద్ద ఎత్తున ఆయన భౌతిక కాయాన్ని చూసేందుకు తరలివచ్చారు. పుట్టిన ఊరుకు, మతానికి పేరు తెచ్చాడని వేనోళ్ల పొగిడారు.
30 రోజుల్లో వస్తాడనుకుంటే..
1999లో మహ్మద్ ఫజరుల్లా భారత సైన్యంలో చేరాడు. ఆగష్టు 31 నాటికి సర్వీస్ పిరియడ్ ముగియనుంది. నెల రోజుల్లో ఇంటికి వస్తాడని ఇంటిల్లి పాది ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ఆయన మరణవార్త వినాల్సి రావడంతో కుటుంబీకులు శోక సంద్రంలో మునిగిపోయారు. సోమవారం ఉదయం ఫైరింగ్ ప్రాక్టీస్‌కి వెళ్తున్న సమయంలో ఫజరుల్లా గుండెపోటు కారణంగా కుప్పకూలాడు. ఆస్పత్రికి తీసుకెళ్లినా అప్పటికే మృతి చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment