army jawan died
-
కశ్మీర్ ప్రమాదంలో ఏపీ జవాన్ వీరమరణం.. సీఎం వైఎస్ జగన్ సంతాపం
సంబేపల్లె: కశ్మీర్ లోయలో బస్సు పడిన ఘటనలో అన్నమయ్య జిల్లా సంబేపల్లె మండలం దేవపట్లకు చెందిన జవాన్ దేవరింటి రాజశేఖర్ (35) మృతి చెందినట్లు బంధువులకు సమాచారం అందింది. బద్రీనాథ్ బందోబస్తు ముగించుకుని తిరిగి వస్తున్న ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) బస్సుకు మంగళవారం ప్రమాదం జరిగి ఏడుగురు మృతిచెందిన విషయం పాఠకులకు తెలిసిందే. ఈ ఘటనలో జవాన్ రాజశేఖర్ మృతి చెందినట్లు ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందింది. డి.చిన్నయ్య, రాములమ్మల పెద్దకుమారుడు అయిన రాజశేఖర్ ఐటీబీపీలో 12 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నాడు. రెండు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చి వెళ్లాడు. రాజశేఖర్‌కు భార్య ప్రమీల, కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీర జవాన్ల మృతిపై సీఎం సంతాపం సాక్షి, అమరావతి: విధినిర్వహణలో వీరమరణం పొందిన ఐటీబీపీ జవాన్ అన్నమయ్య జిల్లా దేవపట్టకు చెందిన డి. రాజశేఖర్ అతని సహచరుల మృతి పట్ల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలిపారు. ఇది కూడా చదవండి: అర్థం చేసుకోండి.. ప్రతి పథకానికీ ఒక అర్థం.. పరమార్థం ఉన్నాయి -
3 నెలల క్రితం పెళ్లి, రోడ్డు ప్రమాదంలో జవాన్ మృతి
పూతలపట్టు (యాదమరి): రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి చెందిన ఘటన శనివారం రాత్రి చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం రంగంపేట క్రాస్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగంపేటకు చెందిన పురుషోత్తం కుమారుడు మనోజ్ కుమార్ (24) జమ్మూకశ్మీర్‌లో జవాన్‌గా పనిచేస్తున్నారు. సెలవుపై స్వగ్రామానికి వచ్చి మూడు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఈ నెల 15 తర్వాత విధుల్లో చేరాల్సి ఉంది. కాగా, శనివారం రాత్రి ద్విచక్ర వాహనంపై సొంత పని మీద పూతలపట్టుకు వెళ్లి తిరిగి ఇంటికొస్తుండగా తిరుపతి నుంచి చిత్తూరు వైపు వస్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో మనోజ్ అక్కడికక్కడే మరణించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పెళ్లయిన మూడు నెలలకే ప్రమాదంలో మృతి చెందడంతో జవాన్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. -
అమర జవాన్‌కు సీఎం జగన్ నివాళి, రూ.50 లక్షల ఆర్థిక సాయం
సాక్షి, అమరావతి: ఉగ్రవాదులపై పోరులో భాగంగా కశ్మీర్లో ప్రాణ త్యాగంచేసిన గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాడ కొత్తపాలెంకు చెందిన జవాను జశ్వంత్‌రెడ్డి చిరస్మరణీయుడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. దేశ రక్షణలో భాగంగా కశ్మీర్లో తన ప్రాణాలు పణంగాపెట్టి పోరాటం చేశారని, జశ్వంత్‌రెడ్డి త్యాగం నిరుపమానమైనది అన్నారు. మన జవాన్ చూపిన అసమాన ధైర్యసాహసాలకు ప్రజలంతా గర్విస్తున్నారన్నాంటూ నివాళులు అర్పించారు. ఈ కష్టకాలంలో జశ్వంత్‌రెడ్డి కుటుంబానికి తోడుగా నిలవాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. జశ్వంత్‌రెడ్డి సేవలు వెలకట్టలేనివని, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. కడప జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రికి సమాచారం తెలియగానే.. తక్షణమే స్పందించారు. దేశరక్షణకోసం కశ్మీర్లో ప్రాణాలర్పించిన బాపట్లకు చెందిన మన జవాన్ జశ్వంత్‌రెడ్డి ధైర్యసాహసాలు, త్యాగం చిరస్మరణీయం. జశ్వంత్‌రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, ఈ కష్టసమయంలో ఆ కుటుంబానికి అండగా రాష్ట్ర ప్రభుత్వం రూ.50లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది.#jaswanthreddy — YS Jagan Mohan Reddy (@ysjagan) July 9, 2021 -
ఉగ్రపోరులో జవాన్ వీర మరణం
సాక్షి, బాపట్ల టౌన్/సాక్షి, అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లా సుందర్‌బాని సెక్టార్లో గురువారం సాయంత్రం జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాద కొత్తపాలెంకు చెందిన జవాన్ జశ్వంత్‌రెడ్డి (23) అమరుడయ్యారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మొత్తం ఇద్దరు సైనికులు మృతి చెందగా వారిలో జశ్వంత్‌రెడ్డి ఒకరు. ఆయనకు తండ్రి శ్రీనివాసరెడ్డి, తల్లి వెంకటేశ్వరమ్మతోపాటు యశ్వంత్‌రెడ్డి, విశ్వంత్‌రెడ్డి అనే ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. వీరజవాన్ మృతి పట్ల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అమరుడి కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. తన తండ్రి ఆశయానికి అనుగుణంగా.. కౌలు రైతుగా జీవనం సాగిస్తున్న తన తండ్రి ఆశయానికి అనుగుణంగా ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన జశ్వంత్‌రెడ్డి 2015లో ఆర్మీలో ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం ఆయన జమ్మూకశ్మీర్‌లో ఇన్‌ఫ్రాంటీ విభాగంలో జవాన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఉద్యోగం చేస్తూ తన కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నారు. తన చిన్న తమ్ముడు విశ్వంత్‌రెడ్డిని ఐఏఎస్ అధికారిని చేయాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లో ఒక కోచింగ్ అకాడమీలో చేర్పించి శిక్షణ ఇప్పిస్తున్నారు. బుధవారం సాయంత్రం చివరిసారిగా తమతో మాట్లాడుతూ.. ‘నేను అడవుల్లో ఉన్నాను.. నా ఫోన్ మా సార్ దగ్గర ఉంది.. వేరే సార్ ఫోన్ నుంచి మాట్లాడుతున్నా.. నాన్నా మీరంతా బాగున్నారా.. పూలతోటలు ఎలా ఉన్నాయి.. ఒక్కసారి ఫోన్ అమ్మకివ్వు... అమ్మా నేను ఈరోజు కూడా అడవుల్లోనే ఉన్నాను. రేపు, ఎల్లుండి కూడా ఇక్కడే ఉండాలి.. రూమ్‌కు వెళ్లాక ఫోన్ చేస్తాను.. మీరంతా బాగున్నారా’ అని అన్నాడని, ఇంతలోనే తమ బిడ్డ మరణవార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని తల్లిదండ్రులు విలపిస్తున్నారు. నేడు అంత్యక్రియలు వీర జవాన్ జశ్వంత్‌రెడ్డి భౌతికకాయాన్ని ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి శుక్రవారం రాత్రి ప్రత్యేక విమానంలో తరలించారు. గన్నవరం నుంచి రోడ్డు మార్గంలో ఆయన స్వగ్రామం దరివాద కొత్తపాలెం తీసుకొస్తారు. శనివారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. గవర్నర్ ప్రగాఢ సానుభూతి వీర జవాన్ జశ్వంత్‌రెడ్డి మృతిపట్ల గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు గవర్నర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి, గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ, తదితరులు కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు జశ్వంత్‌రెడ్డి కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. జవాన్ చిరస్మరణీయుడు: సీఎం జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన పోరులో మృతి చెందిన వీర జవాన్ జశ్వంత్‌రెడ్డి చిరస్మరణీయుడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. దేశ రక్షణకు తన ప్రాణాలు పణంగా పెట్టి పోరాటం చేశారని, ఆయన త్యాగం నిరుపమానమైనది అని కొనియాడారు. మన జవాన్ చూపిన అసమాన ధైర్యసాహసాలకు ప్రజలంతా గర్విస్తున్నారన్నారు. ఈ కష్టకాలంలో జశ్వంత్‌రెడ్డి కుటుంబానికి అండగా నిలవాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. వీర జవాన్ సేవలు వెలకట్టలేనివని, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. ఈ మేరకు వైఎస్సార్ జిల్లా పర్యటనలో ఉన్న సీఎం వైఎస్ జగన్ వీర జవాన్ మరణ వార్త తెలియగానే వెంటనే స్పందించారు. జశ్వంత్‌రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తూ శుక్రవారం ట్వీట్ చేశారు. -
అయ్యో కొడుకా.. ఎంత పనాయె..!
సాక్షి, కోటపల్లి(ఆదిలాబాద్) : అయ్యో కొడుకా ఎంత పనాయే.. సెలవులకు రాకున్నా బతికేటోడివి. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటావనుకుంటే అంతలోనే కన్నుమూశావా కొడుకా.. అంటూ ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. సరదాగా స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు గోదావరిలోకి వెళ్లి నాటు పడవ మునిగి చెన్నూర్ పట్టణానికి ఆర్మీ జవాన్ రాజ్‌కుమార్ మృతి చెందిన విషయం తెల్సిందే. పట్టణానికి చెందిన గుండమీది రాజన్న, సునీత దంపతులకు కుమారుడు రాజ్‌కుమార్, కుమార్తె ఉన్నారు. రాజ్‌కుమార్‌ను తల్లిదండ్రులు కష్టపడి చదివించారు. ఉన్నత చదువులు చదివిన రాజ్‌కుమార్ 2017లో ఆర్మీలో ఉద్యోగం సాధించి.. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్‌లోని లేహ్ వద్ద విధులు నిర్వర్తిస్తున్నాడు. రాజ్‌కుమార్‌కు సెలవులు మంజూరుకాగా.. మూడురోజుల క్రితం ఇంటికొచ్చాడు. సోమవారం ఉదయం స్నేహితులతో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి మండలంలోని ఎర్రాయిపేట గోదావరినదిలో నాటుపడవ మునిగి మృత్యువాత పడటంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నిండింది. హోటల్లో దినసరి కూలీగా పనిచేసే రాజన్న తన కుమారుడిని కష్టపడి చదివించిన ప్రయోజకుడిగా చూద్దామన్న కల నెరవేరకుండా పోయింది. నదితీరం వద్దే ప్రశాంత్ తల్లిదండ్రులు చెన్నూర్‌కే చెందిన బండి శంకర్, రాజేశ్వరికి ఇద్దరు కుమారులు. ప్రశాంత్ డ్రైవింగ్ చేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు. సోమవారం ఉదయం గోదావరిలో స్నానం చేద్దామని స్నేహితులతో కలిసి వెళ్లాడు. నాటుపడవ మునగడంతో ప్రశాంత్ గల్లంతయ్యాడు. అతడి ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. కొడుకు ఇంటి నుంచి వెళ్లి రెండు రోజులు గడిచినా ఇంతవరకు జాడ తెలియకపోవడంతో తల్లిదండ్రులు గోదావరి వద్దే నిరీక్షిస్తూ.. ‘ఎప్పుడొస్తావు కొడుకా..’ అంటూ ఏడుస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టిస్తోంది. మంగళవారం రాత్రి వరకూ గోదావరిలో కొడుకు ఆచూకీ లభ్యం కాకపోవడంతో తల్లిదండ్రులు గోదావరి నది వద్దే వేచిచూస్తున్నారు. ఆరుగురు స్నేహితులు కలిసి సోమవారం నాటుపడవలో గోదావరిలో ఈతకొట్టేందుకు బయల్దేరి సగం దూరం వెళ్లగానే ప్రమాదవశాత్తు బోల్తాపడింది. వీరిలో నలుగురు క్షేమంగా ఒడ్డుకు చేరగా.. రాజ్‌కుమార్, ప్రశాంత్ గల్లంతయ్యారు. సంఘటన జరిగిన గంట తర్వాత బండి శ్రీనివాస్ అనే యువకుడు తన తండ్రి శంకర్‌కు ఫోన్లో విషయం చెప్పడంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సీఐ నాగరాజ్ సంఘటన స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లతో సోమవారం నుంచి మంగళవారం వరకూ గాలింపు చర్యలు చేపట్టగా.. రాజ్‌కుమార్ మృతదేహం లభించింది. ప్రశాంత్ జాడ మాత్రం ఇంకా తెలియడం లేదు. -
విధి చేతిలో ఓడిన సైనికుడు
అనునిత్యం ఫిరంగుల మోతలతో దద్దరిల్లే దేశ సరిహద్దులో విధి నిర్వహణకు ఏనాడూ అధైర్యపడలేదు. శత్రువుల భీకర దాడులను ధీటుగా తిప్పికొట్టాడు. విధి చేతిలో మాత్రం ఓడిపోయాడు ఆ సైనికుడు. యుద్ధమంటే ఉప్పొంగే గుండె ధైర్యం క్యాన్సర్ మహమ్మారి ముందు చిన్నబోయింది. రణరంగంలో కీలుగుర్రంలా దూసుకుపోయే అతడి కాళ్లను బంధించి అణువణువునా మింగేసింది. బోన్ క్యాన్సర్ బారిన పడి మృతి చెందిన బొడ్డపాడు గ్రామానికి చెందిన జవాను పాపారావుకు అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. సాక్షి, పలాస(శ్రీకాకుళం) : మండలంలోని బొడ్డపాడు గ్రామానికి చెందిన వీర జవాను బుడత పాపారావు(38) పేద రైతు కుటుంబంలో పుట్టి దేశ సైనికునిగా సేవలందించడానికి సైన్యంలో చేరాడు. జవాను నుంచి నాయక్ స్థాయికి ఎదిగాడు. తన బెటాలియన్‌లో మంచి పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం భోపాల్‌లో నాయక్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రెండు నెలల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. ఎన్ని మందులు వాడినా వ్యాధి నయం కాకపోవడంతో పుణెలోని సైనిక ఆస్పత్రిలో చేరాడు. అక్కడ మెరుగైన వైద్య సేవలంది మళ్లీ కోలుకుని సైన్యంలో చేరి విధులు నిర్వహిస్తాడని అందరూ ఆశించారు. అయితే విధి వక్రీకరించింది. ఆయనకు బోన్ క్యాన్సరు ఉందని అక్కడ వైద్యులు నిర్ధారించారు. అయినప్పటికీ అన్ని ప్రయత్నాలు చేసి వైద్య సేవలందించినా ఫలితం లేకపోయింది. మృత్యువుతో పోరాడుతూ ఈ నెల 24న ఉదయం 9 గంటలకు మృతి చెందాడు. తమ ఒక్కగానొక్క కుమారుడు జవాను నుంచి నాయక్ హోదాకు ఎదిగాడని ఎంతగానో ఆనందించిన అతడి తల్లిదండ్రులు పార్వతి, మోహనరావు ఈ విషయం తెలుసుకుని జీర్ణించుకోలేకపోతున్నారు. గురువారం తమ స్వగ్రామానికి తీసుకొచ్చిన మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించారు. మృతుడి భార్య ఉష, కుమారుడు యువరాజు(9), కుమార్తె (6) ఉషిత శోకతప్త హృదయాలతో విలపించారు. వీరిని ఓదార్చడానికి ప్రయత్నించిన గ్రామస్తులు, బంధువులు కూడా కన్నీళ్లు పెట్టారు. అనంతరం సహచర సైనికులు సైనిక వందనం చేసి మృతదేహంపై జాతీయ జెండా కప్పి అంతిమ యాత్ర చేపట్టి అంత్యక్రియలు పూర్తి చేశారు. -
అమర జవాన్‌కు కన్నీటి వీడ్కోలు
సాక్షి, శృంగవరపుకోట(విజయనగరం) : భరతమాత సేవలో తరించిన జవాన్ తనువు చాలించి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతుంటే ‘అక్రమ్ అమర్ రహే’ అంటూ అందరూ అంజలి ఘటించారు. ఎస్‌కోట పట్టణంలో శ్రీనివాసకాలనీకి చెందిన మహ్మద్ ఫజరుల్లా అలియాస్ అక్రమ్ (40) భౌతికకాయం ఇండియన్ ఆర్మీ వింగ్ కమాండర్ల పర్యవేక్షణలో బుధవారం రాత్రి 12 గంటలకు ఆయన ఇంటికి చేరుకుంది. అక్రమ్‌ను తీసుకొచ్చిన సైనికులు అందరూ గురువారం ఉదయం 9 గంటల వరకు ఇక్కడే ఉన్నారు. తహసీల్దార్ రామారావు, ఎస్‌కోట ఎస్ఐ అమ్మినాయుడు, విజయనగరం నుంచి వచ్చిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు బ్యాండ్ పార్టీ సైనిక లాంఛనాల మధ్య స్థానికులు, యువకులు అక్రమ్ భౌతికకాయాన్ని శ్మశానవాటికకు చేర్చారు. ముస్లిం మత పెద్దలు ముందుగా నమాజు చేశారు. అనంతరం ఏఆర్ పోలీసులు మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి వీరజవాన్‌కు నివాళులు అర్పించారు. అనంతరం సైనికులు, పోలీస్ అధికారులు సెల్యూట్ చేశారు. కంటతడి పెట్టిన కోట.. ఈ సందర్భంగా స్థానికులు జాతీయ పతాకాలు చేత పట్టి, అక్రమ్ అమర్ రహే అన్న నినాదాలు చేశారు. స్థానికులు పెద్ద ఎత్తున ఆయన భౌతిక కాయాన్ని చూసేందుకు తరలివచ్చారు. పుట్టిన ఊరుకు, మతానికి పేరు తెచ్చాడని వేనోళ్ల పొగిడారు. 30 రోజుల్లో వస్తాడనుకుంటే.. 1999లో మహ్మద్ ఫజరుల్లా భారత సైన్యంలో చేరాడు. ఆగష్టు 31 నాటికి సర్వీస్ పిరియడ్ ముగియనుంది. నెల రోజుల్లో ఇంటికి వస్తాడని ఇంటిల్లి పాది ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ఆయన మరణవార్త వినాల్సి రావడంతో కుటుంబీకులు శోక సంద్రంలో మునిగిపోయారు. సోమవారం ఉదయం ఫైరింగ్ ప్రాక్టీస్‌కి వెళ్తున్న సమయంలో ఫజరుల్లా గుండెపోటు కారణంగా కుప్పకూలాడు. ఆస్పత్రికి తీసుకెళ్లినా అప్పటికే మృతి చెందాడు. -
తుపాకీ మిస్ ఫైర్.. ఆర్మీ జవాన్ మృతి
అర్ధవీడు: తుపాకీ మిస్ ఫైర్ కావడంతో ప్రకాశం జిల్లాకు చెందిన ఆర్మీ జవాను మృతి చెందాడు. ఈ మేరకు అతని తల్లిదండ్రులకు సోమవారం అధికారుల నుంచి సమాచారం అందింది. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పాపినేనిపల్లెకు చెందిన తమ్మినేని అశోక్‌కుమార్ (21) రెండేళ్ల కిందట ఆర్మీలో చేరాడు. ప్రస్తుతం జమ్ముకాశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం ఉదయం విధుల్లో ఉండగా తుపాకీ మిస్ ఫైర్ కావడంతో అశోక్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తల్లిదండ్రులు నరసింహారావు, కాశమ్మలకు సమాచారం అందింది. భౌతికకాయాన్ని స్వగ్రామమైన పాపినేనిపల్లెకు తెచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తల్లిదండ్రులు చెప్పారు. మృతుడికి ఒక సోదరుడున్నాడు. -
ఆర్మీ జవాన్‌కు కన్నీటి వీడ్కోలు
మందమర్రిరూరల్(చెన్నూర్): అనారోగ్యంతో సోమవారం రాత్రి మృతి చెందిన ఆర్మీ జవాన్ కొత్తపల్లి ప్రకాష్ అంత్యక్రియలు బుధవారం అధికారిక లాంఛనాలతో ముగిశాయి. బుధవారం తెల్లవారుజామున ప్రకాష్ భౌతికకాయం మందమర్రిలోని గాంధీనగర్‌లో గల స్వగృహానికి చేరుకుంది. ప్రకాష్ భౌతికకాయాన్ని చూసి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. భార్య శ్వేత, తల్లి సరోజ రోధించిన తీరు అందరినీ కలచివేసింది. ఒక్కగానొక్క కొడుకు తనువు చాలించడంతో తండ్రి శంకరయ్య గుండెలు పగిలేలా ఏడ్చాడు. ప్రకాష్ 20 నెలల కొడుకును చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకున్నారు. ప్రకాష్ ఇక లేడని అతని మిత్రులు జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటూ దుఃఖసాగరంలో మునిగిపోయారు. బంధువులు, ఇరుగుపొరుగు వారు ప్రకాష్ కలివిడితనం గురించి బాధపడిన తీరు కలచివేసింది. కన్నీటి వీడ్కోలు.. ప్రకాష్ అంతిమ యాత్ర ఉదయం 11:30 గంటలకు మొదలై నాలుగు గంటల వరుకు సాగింది. గాంధీనగర్, సీఈఆర్ క్లబ్ నుంచి మార్కెట్ మీదుగా ప్రజలు, బంధు మిత్రుల అశ్రునయనాల మధ్య సాగిన అంతిమ యాత్ర శ్రీవేంకటేశ్వర ఆలయం వెనుక గల శ్మశాన వాటిక వరకు సాగింది. అక్కడే భౌతికకాయాన్ని ఖననం చేశారు. పోలీస్ అధికారుల నివాళులు.. ప్రకాష్ భౌతికకాయం వెంట ఆర్మీ నుంచి 32 ఎన్సీసీ బెటాలియన్ కమాండెంట్, లెఫ్టినెంట్ కల్నన్ సమల్‌కుమార్, ఆదిలాబాద్ లెఫ్టినెంట్ ఐలయ్య ఉన్నారు. వీరితో పాటు జేసీవో శ్రీనివాస్, జమేదార్ శోబారామ్, రాజనంద భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి సెల్యూట్ చేశారు. బెల్లంపల్లి ఏసీపీ బాలుజాదవ్, మందమర్రి సీఐ రాంచందర్‌రావ్, ఎస్సై శివకుమార్ నివాళులర్పించారు. -
సైనికుడి అనుమానాస్పద మృతి
కోల్‌కతాలో ఆర్మీలో పని చేస్తున్న మిర్యాలగూడ మండలం తడకమళ్ల వాసి అనంతుల లింగస్వామి పెళ్లికార్డులు పంచడంకోసం కోల్‌కతా వెళ్లి అనుమానాస్పదరీతిలో ఆదివారం శవమయ్యాడు. కుటుంబసభ్యులు తెలిపిన ప్రకారం.. తడకమళ్ల గ్రామానికి చెందిన అనంతుల వెంకయ్య, లక్ష్మమ్మ దంపతులకు ఆరుగురు సంతానం కాగా లింగస్వామి(25) ఒక్కడే మగ పిల్లవాడు. అతడు ఎనిమిదేళ్లుగా 206 ఫీల్డ్ కంపెనీలోని 20వ ఇంజినీరింగ్ సెగ్మెంటులో పని చేస్తున్నాడు.. కాగా, శనివారం రాత్రి తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడాడు. అయితే, లింగస్వామి ఆదివారం తెల్లవారు జామున చనిపోయాడని అక్కడి అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాగా, నకిరేకల్ మండలం గోరెంకలపల్లి గ్రామానికి చెందిన ఓ యువతితో లింగస్వామి వివాహం ఈనెల 22వ తేదీన జరగాల్సి ఉంది. దీంతో అతడు గత నెల 30వ తేదీన పైఅధికారులతో పాటు స్నేహితులకు పెళ్లి కార్డును ఇవ్వడానికి కోల్‌కతా వెళ్లి మృతి చెందాడు.అతని మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.