స్కాలర్‌షిప్ ఇవ్వకపోతే చనిపోతా
గిరిజన విద్యార్థి ఆవేదన
పార్వతీపురం: స్కాలర్ షిప్ ఇవ్వకపోతే చచ్చిపోవడమే మార్గమని ఓ గిరిజన విద్యార్థి కన్నీరు మున్నీరయ్యాడు. ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో సోమవారం కురుపాం మండలం వలస బల్లేరు గూడ పంచాయతీ, ఆగమగూడ గ్రామానికి చెందిన బిడ్డిక ధర్మారావు అనే గిరిజన విద్యార్థి తన ఆవేదనను సాక్షి ముందు వెళ్లబోసుకున్నాడు. తనది నిరుపేద కుటుంబమని, ఎలాగైనా చదివి ప్రయోజకుడిని కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం స్కాలర్‌షిప్ ఇస్తుందనే ఆశతో డిగ్రీలో చేరానన్నాడు. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతూ పట్టణంలోని హాస్టల్‌లో ఉంటున్నానన్నాడు.
రెండేళ్లుగా వేలిముద్రలు పడక స్కాలర్‌షిప్ రాలేదని వాపోయాడు. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం లేదన్నాడు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తనకు స్కాలర్‌షిప్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు.