పరిశోధనలే ప్రాణంగా..
-
చారిత్రక సంపద అన్వేషణకు కృషి చేస్తున్న గిరిపుత్రుడు
-
వివిధ రాష్ట్రాల్లో పలు పరిశోధనలు
-
సామాజిక సేవతో ప్రత్యేక గుర్తింపు
-
ప్రముఖుల ప్రశంసలు పొందుతున్న సుధాకర్
మరిపెడ : చరిత్ర మూలాలు తెలుసుకునేందుకు ఆయన పడే తపన అంతా ఇంతాకాదు. రాళ్లు, రప్పలు, గుట్టలు, చెట్లు ఇలా ఎన్నో ప్రాంతాలను సందర్శిస్తూ జాతి సంపదను వెలికితీసేందుకు కృషి చేస్తున్నాడు. కాలగర్భంలో కలిసిపోయిన చారిత్రక ఆనవాళ్లను వెలికితీస్తూ నేటి తరానికి వాటి ఆవశ్యకతను తెలియజేసేందుకు పాటుపడుతున్నాడు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వినూత్న పరిశోధనలు చేస్తూ ఓరుగల్లు కీర్తిని నలుదిశలా చాటుతున్న గిరిపుత్రుడు ఇస్లావత్ సుధాకర్‌పై కథనం. విద్యతోనే సమాజంలో గుర్తింపు ఉంటుందని పాలకులు, అధికారులు చెబుతుంటారు. అయితే చదువుతోపాటు పరిశోధనలతో కూడా పేరు సంపాదించుకోవచ్చని ఓ విద్యార్థి నిరూపిస్తూ ముందుకుసాగుతున్నాడు. కురవి మండలంలోని సీరోలు శివారు రేకులతండాకు చెందిన ఇస్లావత్ సుధాకర్ చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరుస్తున్నాడు. 1 నుంచి 10వ తరగతి వరకు కురవి జిల్లా పరిషత్ పాuý శాలలో, ఇంటర్ మానుకోటలో చదివిన సుధాకర్ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు.
డిగ్రీలో ప్రారంభం
2012లో ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్ బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న సమయంలో అధ్యాపకులు, విద్యార్థులు బృహత్ శిలా యుగపునాటి తవ్వకాలు జరిపారు. ఈ సందర్భంగా సుధాకర్ కూడా అందులో చురుగ్గా పాల్గొన్నాడు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా గుండాల మండలం పడుకోనిగూడెం అడవుల్లో పది కిలోమీటర్ల లోపల ఉన్న రాక్షసగూళ్లపై ఆయన పరిశోధన చేశాడు. అలాగే మరిపెడ మండలం జయ్యారంలో కూడా బృహత్ శిలలు ఉన్నాయని ఇటీవల కనుగొన్నాడు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో నవీనా శిలా యుగానికి చెందిన ఆదిమానవుల సంస్కృతి, అవశేషాలను గుర్తించి వాటిపై కూడా పరిశోధన చేశాడు. వీటితోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని అడవులు, గుట్టల్లోని బృహత్ శిలాయుగం నాటి సమాధులు, నవీనా శిలాయుగపు సాంస్కృతిక అవశేషాలను కనుగొన్నాడు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాలో గోల్కోండ నయా ఖిల్లా తవ్వకాల్లో అసిస్టెంట్ ఆర్కియాలజిస్ట్‌గా సుధాకర్ పరిశోధనలు జరిపి అధికారుల మన్ననలు పొందాడు.
సుధాకర్ అందుకున్న అవార్డులు
హిస్టరీ, ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ ద్వారా పరిశోధనల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ ప్రాచీన, పూర్వయుగపు సంస్కృతిని భావితరాలకు తెలియజేసేందుకు కృషి చేస్తున్న సుధాకర్‌కు 2015 నవంబర్ 14న ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రతిభా పురస్కార్ అవార్డు అందజేశారు. అలాగే ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్ బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ కాలేజీ నుంచి ఎన్‌సీసీ కేడెట్‌గా సామాజిక సేవలు అందించి 2010లో బెస్ట్ కేడెట్ అవార్డు అందుకున్నాడు. కాగా, 2010లో నేషనల్ బెస్ట్ కేడెట్ అవార్డును డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చేతుల మీదుగా సికింద్రాబాద్ క్యాంపులో అందుకున్నాడు. ఎన్‌ఐసీ (నేషనల్ ఇంటిగ్రేటెడ్ క్యాంపు) తిరుపతిలో బెస్ట్ కేడెట్ అవార్డు, ఆలిండియా ట్రెక్కింగ్ క్యాంపు కేరళలో బెస్ట్ కేడెట్ అవార్డు, వరల్డ్ టూరిజం డే సందర్భంగా బౌల్డ్ రింగ్ బెస్ట్ ఫర్మామెన్స్ అవార్డు, స్టేట్ ఎన్‌ఎస్‌ఎస్ మెగా క్యా ంపులో బెస్ట్ వలంటరీ అవార్డు, నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంపులో బెస్ట్ కేడెట్ అవార్డు అందుకున్నారు. వీటితోపాటు క్రీడా విభాగంలో వెయిట్ లిఫ్టింగ్‌లో నాగార్జున యూనివర్సిటీలో 110 కేజీల విభాగంలో ప్రతిభ కనబరిచి అక్కడి వీసీ చేతుల మీదుగా ప్రథమ బహుమతి అందుకున్నాడు.
చరిత్ర మూలాలు తెలుసుకునేందుకే..
మన పూర్వీకులు భావితరాల కోసం భద్రపరిచిన జాతిసంపదను కాపాడేందుకే నేను పరిశోధనలు చేస్తున్నాను. చారిత్రక అన్వేషణ చేయడమే నా లక్ష్యం. ప్రాచీన శిలాయుగం, నవీన శిలాయుగం, బృహత్ శిలాయుగం నాటి ఆదిమానవుల అవశేషాలు, వారి సంస్కృతిపై శాస్త్ర పరిశోధన చేస్తున్నాను. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని హిస్టరీ విభాగానికి చెందిన డాక్టర్ ఎస్.మురళీమోహన్ దగ్గర రీసెర్చ్ స్కాలర్‌గా పనిచేస్తున్నాను.
– ఇస్లావత్ సుధాకర్, రీసెర్చ్ స్కాలర్