పాత కార్మిక చట్టాలను ప్రక్షాళన చేస్తాం
కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ
సాక్షి, విజయవాడ : పాత కార్మిక చట్టాలను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి, పది మంది కార్మికులు పని చేసే సంస్థనూ ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకువచ్చేలా కొత్త చట్టాలు చేస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. శనివారం గుణదలలో కార్మిక రాజ్య బీమా సంస్థ(ఈఎస్‌ఐ) ఉప ప్రాంతీయ కార్యాలయం నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర కార్మిక శాఖ పరిధిలో 59 కోట్ల మంది ఉన్నారని, వారి కుటుంబసభ్యుల సంక్షేమం, ఆరోగ్యం, సాం ఘిక భద్రత కల్పించేందుకు కార్మిక శాఖ ప్రయత్నిస్తోందన్నారు.
ఉప ప్రాంతీయ కార్యాలయం పరిధిలో 9.68 లక్షల మంది కార్మిక కుటుం బాలు ఆధారపడి ఉన్నాయని, కృష్ణా, గుంటూ రు, ప్రకాశం, ఉభయగోదావరి జిల్లాలు ఈ కార్యాలయ పరిధిలోకి వస్తాయని ఆయన వివరించారు. ఈ-బిజ్ విధానం ద్వారా కార్మికుల వివరాలను సమోదు పక్రియ చేపడతామన్నారు. దీని ద్వారా కార్మికుడు ఎక్కడ పని చేసి నా అతను పని చేసిన కాలానికి సంబంధించి ఈపీఎఫ్ తదితర మొత్తాలు వెంటనే తీసుకునే వీలుంటుందని తెలిపారు.
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు మాట్లాడుతూ కొద్ది కాలంలోనే దేశంలో అభివృద్ధి రేటు 7.3 శాతానికి పెరిగిందని, దేశం ఇదే తరహాలో అభివృద్ధి చెందితే చైనాను అధిగమించే అవకాశం ఉందని తెలిపారు. ఈ సమావేశంలో ఈఎస్‌ఐ డెరైక్టర్ జనరల్ ఎ.కె.అగర్వల్ మాట్లాడుతూ ఈఎస్‌ఐ హస్పటల్‌లో లేని వైద్య సేవలను కార్పొరేట్ హస్పటల్ ద్వారా అందజేస్తున్నామని అన్నారు. కార్మికులు ఈఎస్‌ఐపై అవగాహన పెంచుకుని మెరుగైన వైద్య సేవలు పొదాలని సూచించారు. సమావేశంలో జెడ్పీ చైర్మన్ గద్దె అనూరాధ మాట్లాడుతూ కార్మికులు ఈఎస్‌ఐ, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలుపొందటం తమ హక్కుగా భావించాలన్నారు.
సీఐటీయూ నేతల విన్నపం
ఈఎస్‌ఐ హాస్పటల్‌లో కనీస సౌకర్యాలు లేవం టూ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు ఆధ్వర్యం లో పలువురు సీఐటీయూ నేతలు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను కలిసి విజ్ఞాపన పత్రం అందజేశారు. హాస్పటల్‌లోఎంఆర్‌ఐ, సీటీ స్కాన్, అల్ట్రాస్కాన్ పరీక్షలు చేసే యంత్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
మంత్రి వార్డుల్లో తనిఖీలు
మంత్రి దత్తాత్రేయ ఈఎస్‌ఐ హాస్పటల్‌లోని వార్డుల్లో పర్యటించి రోగులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. క్యాంటిన్ సౌకర్యం లేదని ఒక మహిళా రోగి మంత్రి దృష్టికి తీసుకువచ్చింది. హాస్పటల్‌లో సౌకర్యాలు మెరుగుపరచాలని పలువురు రోగులు కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీలు కె.లక్ష్మణరావు, బొడ్డు నాగేశ్వరరావు, కార్పొరేటర్ అపర్ణ, ఈఎస్‌ఐ రీజినల్ డెరైక్టర్ చిన్మయబోస్, డెప్యూటీ డెరైక్టర్ ఎస్.కృష్ణమూర్తి, బీజేపీ నాయకులు యూవీ శ్రీనివాసరాజు, లాకా వెంగళరావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.