కబ్జాకోరల్లో రూ.10 కోట్ల స్థలం!
Published Fri, Jan 17 2014 2:56 AM | Last Updated on Sat, Sep 2 2017 2:40 AM
విజయనగరం మున్సిపాలిటీ, న్యూస్‌లైన్ : జిల్లాలో అధికార పార్టీ నాయకుల అక్రమాలకు అడ్డూ అదుపూలేకుండాపోతోంది. వారు చెప్పిందే న్యాయం.. వారు చేసిందే చట్టం అన్నట్టుగా అధికార యంత్రాంగం తల ఊపుతుండడంతో అంతా వారి ఇష్టారాజ్యమైపోరయింది. ఎన్నికలకు ఇంకా మూడు నెలలే సమయం ఉండడంతో దీపం ఉండగానే ఖాళీ జాగాలో పాగా వేయాలన్న చందంగా పట్టణంలో కనిపించిన ప్రతి స్థలాన్ని కబ్జా చేస్తున్నారు. తాజాగా సుమారు రూ.10 కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలంపై కొందరు కన్నేశారు. ఇప్పటికే అక్కడ నిర్మాణాలు చేపట్టారు. పట్టణంలోని దాసన్నపేట నుంచి కొత్తపేట వెళ్లే రింగ్‌రోడ్డు సమీపంలోని బుంగవీధికి శ్మశానం ఉంది. ఈ శ్మశానానికి ఆనుకుని ప్రభుత్వ, దేవాదాయ శాఖకు చెందిన సుమారు ఏడు ఎకరాల స్థలం ఉంది.
బుంగవీధి వాసులు దీన్ని బహిర్భూమిగా వాడుతున్నారు. ఈ స్థలంలో పెద్ద పెద్ద గుట్టలు కూడా ఉన్నాయి. ఈ గుట్టలను సైతం తొలచి కొందరు అక్రమార్కులు స్థలాన్ని చదును చేస్తున్నారు. శ్మశానం ముందు ప్రాంతంలో కల్కి భగవాన్ ఆశ్రమాన్ని నిర్మించారు. బుంగవీధికి చెందిన చిన్న పిల్లలు మృతి చెందితే ఈ ఆశ్రమం వెనుక ఉన్న ప్రభుత్వ స్థలంలో పూడ్చుతారు. అరుుతే ఈ స్థలం కూడా ఆక్రమణకు గురవుతోంది. సిమెంట్ ఇటుకలతో అడ్డంగా గోడ నిర్మిస్తున్నారు. దీంతో ఆ వీధికి చెందిన వారు ఆందోళన చెందుతున్నారు. ఎవరైనా చనిపోతే పూడ్చడానికి ఆరడుగుల స్థలమైనా లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శివరామ దీక్షితులు పేరిట ఉన్న ట్రస్ట్ కార్యకలాపాలను దేవాదాయ శాఖ పర్యవేక్షిస్తోంది. శ్మశానం పక్కనే ఉన్న ఈ ట్రస్ట్‌కు చెందిన ఖాళీ స్థలంలో కూడా చిన్నపాటి రోడ్డు నిర్మించి, తరువాత నెమ్మదిగా లేఅవుట్ వేసేందుకు అధికార పార్టీ నేతలకు చెందిన కొందరు అనుచరులు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఇంతస్థాయిలో ఆక్రమణలు జరుగుతున్నా.. ఇటు మున్సిపల్ అధికారులు గాని, అటు దేవాదాయ శాఖ అధికారులు గాని పట్టించుకోవడం లేదు.
తెర వెనుక అధికార పార్టీ నాయకులు
మున్సిపాలిటీలోని ప్రభుత్వ స్థలాల ఆక్రమణల వెనుక జిల్లాకు చెందిన ముఖ్యనేత, పట్టణానికి చెందిన అధికార పార్టీ నాయకుడు ఉన్నట్టు తెలుస్తోంది. తమ అనుచర గణాన్ని ప్రభుత్వ స్థలాలపైకి పంపి కబ్జా చేసేలా వారు సహకరిస్తున్నారన్న విమర్శలు ఉన్నారుు. కబ్జాదారులు ఆక్రమించిన స్థలాల వద్దకు వెళ్లి మున్సిపల్ అధికారులు పనులను నిలిపివేసినా.. వారు వెళ్లగానే మళ్లీ పనులను ప్రారంభిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండడం వల్లే ఆక్రమణదారులు ఇలా రెచ్చిపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
Advertisement
Advertisement