తుని ఘటనలో మిగతా ముగ్గురికీ బెయిల్
- అయినా సాంకేతిక ప్రతిబంధకంతో విడుదల నేడే
- 12వ రోజుకు ముద్రగడ దీక్ష
- డిమాండ్ నెరవేరడంతో నేడు విరమించే అవకాశం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: తుని ఘటనల్లో అరెస్టు చేసిన 13 మందినీ విడుదల చేయూలన్న డిమాండ్‌తో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష సోమవారం 12వ రోజుకు చేరింది. అరెస్టయిన 13 మందిలో 10 మందికి శనివారమే బెయిల్ రాగా 8 మంది ఆ రోజే విడుదలయ్యారు. సాంకేతిక కారణాలతో కూరాకుల పుల్లయ్య, సీఐడీ కస్టడీ తీసుకోవడంతో లగుడు శ్రీనివాస్ ఆ రోజు విడుదల కాలేదు. వారిద్దరూ సోమవారం రాత్రి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. మిగిలిన ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణుమూర్తి, వాసిరెడ్డి ఏసుదాసులకు కాకినాడ నాలుగో అదనపు జిల్లా జడ్జి, పిఠాపురం ఇన్‌చార్జి అదనపు జిల్లా జడ్జి బి.గాయత్రి సోమవారం బెయిల్ మంజూరు చేశారు. సాంకేతిక కారణాలవల్ల వారు మంగళవారం విడుదల కానున్నారు. ఇలా 13 మందికీ బెయిల్ వచ్చినందున సంబంధితపత్రాలు చూపించి, ముద్రగడతో దీక్ష విరమింపచేయాలని కాపు జేఏసీ నేతలు, బంధువులు సోమవారం విశ్వప్రయత్నం చేశారు. అందుకు ముద్రగడ ససేమిరా అన్నారు. జైలులో ఉన్నవారంతా బయటకు వచ్చాకే విర మణ అని తేల్చి చెప్పారు.
సర్కారులో కానరాని చిత్తశుద్ధి
ముద్రగడ దీక్ష చేపట్టడానికి సూటిగా చెప్పిన రెండే రెండు డిమాండ్లను నెరవేర్చాలన్న ఉద్దేశం ప్రభుత్వంలో ఏమాత్రం లేదని కాపు నేతలు అంటున్నారు. ముద్రగడ ఆరోగ్యం విషయంలో కూడా సర్కారు మొదటి నుంచీ పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. అటు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో సోమవారం కూడా ఆందోళనలు, ధర్నాలు, కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. అంబాజీపేటలో టీడీపీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తిని ఘెరావ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏరువాకలో పాల్గొనేందుకు సీఎం రావడంతో పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు.
దీక్ష విరమించండి : జక్కంపూడి విజయలక్ష్మి లేఖ
సాక్షి, రాజమహేంద్రవరం: కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష విరమించాలని వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అభ్యర్థించారు. ఈ మేరకు ఆమె సోమవారం ముద్రగడకు లేఖ రాశారు.