కన్నా.. పార్టీ వీడేందుకు మనసెలా వచ్చింది?
రైలుపేట(గుంటూరు)
‘కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టుపై ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచావు.. మంత్రి పదవులను అనుభవించావు.. కన్నతల్లి లాంటి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలి వెళ్లేందుకు నీకు మనసెలా వచ్చింది..?’అని ఆ పార్టీ జిల్లా పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్టు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై ధ్వజమెత్తారు. ఏపీసీసీ పిలుపు మేరకు ‘ఇందిరమ్మ మాట-కాంగ్రెస్ బాట’ పేరిట జిల్లాలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బుధవారం ఆయన డీసీసీ కార్యాలయంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏదో ఒక్కరు బయటకు వెళ్లినంతమాత్రాన పార్టీకి ఏమీ కాదన్నారు. కన్నా లక్ష్మీనారాయణ పార్టీకి వెన్నుపోటు పొడిచి ద్రోహం చేశారని విమర్శించారు. ఎవరు ఎన్నిచేసినా పార్టీకి ప్రజాబలం ఉందన్నారు. టీడీపీ మాయమాటలతో అధికారంలోకి వచ్చిందన్నారు. టీడీపీ పాలన ఎలా ఉంటుందో ఐదునెలల్లోనే అందరికీ అర్ధమైందన్నారు. ఈ నెల 19 వరకు పార్టీ సభ్యత్వ నమోదు కొనసాగుతుందని వెల్లడించారు. ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి పోరాటం చేస్తామన్నారు.
డీసీసీ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ ఏపీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి పిలుపు మేరకు జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందకు అన్ని నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి నాయకులు మాట్లాడుతూ అన్ని మండలాలకు కమిటీలు వేయాలని, సొంత మీడియా సంస్థ ఒకటి పార్టీకి ఉండాలని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పార్టీ నగరశాఖ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే షేక్‌మస్తాన్‌వలి, పీసీసీ ప్రధాన కార్యదర్శి రమాదేవి, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్ కొరివి వినయ్‌కుమార్, పార్టీ నేతలు రత్నకుమారి, ఈరి రాజశేఖర్, అబ్దుల్ వహీద్, కూచిపూడి సాంబశివరావు, రామకృష్ణారెడ్డి, పక్కాల సూరిబాబు, సవరం రోహిత్, బిట్రగుంట మల్లిక తదితరులు పాల్గొన్నారు.