కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించి పార్టీని బలోపేతం ....
కర్నూలు (హాస్పిటల్) : కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి భారతీయ జనతాపార్టీ శ్రేణులకు పురందేశ్వరి పిలుపునిచ్చారు. స్థానిక నంద్యాల రోడ్డులోని శకుంతలా కల్యాణ మంటపంలో ఆదివారం ఏర్పాటుచేసిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కపిలేశ్వరయ్య, జిల్లా అధ్యక్షులు హరీష్‌బాబు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పార్టీలో విభేదాలు బట్టబయలు
సమావేశం ప్రారంభమైన గంట వ్యవధిలోనే పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు నాగరాజు పార్టీ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయని, ఇవి తీవ్రనష్టదాయకమని పేర్కొన్నారు. ఇందుకు స్పందించిన హరీష్‌బాబు పార్టీలో అందరూ సమానమేనని, సర్ధుకుపోవాలని కోరారు. మిత్రపక్షం టీడీపీ వైఖరితో ఇబ్బందులు పడుతున్నామని కల్లూరు మండల మాజీ అధ్యక్షులు రమణారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయగా పొత్తు అనేది కేంద్ర నిర్ణయమని, పాటించాలని కపిలేశ్వరయ్య కోరారు. ఇదే సందర్భంగా కపిలేశ్వరయ్య మీడియా ప్రతినిధులపై అసహనం వ్యక్తం చేశారు. పార్టీ అంతర్గత సమావేశానికి ఎవరినీ పిలువలేదని, అందరూ వెళ్లిపోవాలని సూచించారు. అయితే 12.30 గంటలకు బీజేపీ సమావేశం ఉంది రావాలంటూ జిల్లా ప్రధాన కార్యదర్శి మీడియాకు మెసేజ్‌లు పంపడం గమనార్హం.