కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ బాటలోనే నడుస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు సయ్యద్ అజీజ్ పాషా దుయ్యబట్టారు.
కీసర: కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ బాటలోనే నడుస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు సయ్యద్ అజీజ్ పాషా దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రస్థాయి జనసేవాదళ్ శిక్షణ శిబిరాన్ని ఆదివారం కీసరలోని కేబీఆర్ గార్డెన్‌లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అజీజ్ పాషా మాట్లాడుతూ.. కార్పొరేట్ సంస్థల అండతో అధికారంలోకి వచ్చిన మోడీ.. ఆ సంస్థల అభివృద్దికి కృషి చేస్తున్నారని ఆరోపించారు.
రైల్వే చార్జీలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతూ ఎన్డీఏ ప్రభుత్వం సామాన్య ప్రజలపై భారం మోపనుందన్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు ప్రజలకు మంచి పరిపాలన అందిస్తానని మోడీ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. ప్రస్తుతం ధరలను పెంచి ఏ విధంగా మంచి పాలన అందిస్తారో దేశ ప్రజలకు ఆయన వివరించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఈసారి వామపక్షాలను దెబ్బతియాలని కార్పొరేట్ సంస్థలు స్థానిక పార్టీలు తమతో పొత్తు పెట్టుకోకుండా ఒత్తిడి తీసుకువచ్చాయని ఆయన ఆరోపించారు. ఫలితంగా ఈసారి వామపక్షాలకు దేశంలో కొన్ని పార్లమెంట్ సీట్లు మాత్రమే దక్కాయన్నారు.
తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ... కేసీఆర్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చని పక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ధర్నాలు, ఉద్యమాలు చేస్తామన్నారు. ఆ పార్టీ రాష్ట్ర నేత సిద్ది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కమ్యూనిస్టు పార్టీకి జనసేవాదళ్ వెన్నెముకగా నిలుస్తుందన్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ ప్రశించే విధంగా జనసేవాదళ్ సభ్యులు ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి బాలమల్లేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ నేతలు డాక్టర్ సుధాకర్, రాములు యాదవ్, కుమారస్వామి, స్టాలిన్, శివరామకృష్ణ, ఛాయాదేవి, జ్యోతి, వెంకటాచారి, రమణ , నర్సింగ్‌రావు, నిమ్మల నర్సింహ, కృష్ణమూర్తి, కార్యకర్తలు పాల్గొన్నారు.