కోర్టు ఆదేశాలు పట్టని ’తమ్ముళ్లు’
- కొట్టాలంలో టీడీపీ ఆధ్వర్యంలో జల్లికట్టు
- ప్రేక్షకపాత్ర వహించిన పోలీసులు
- పది మందికి గాయాలు
యాదమరి: సుప్రీం కోర్టు నిషేధం విధించినప్పటికీ మండల సరిహద్దు ప్రాంతమైన కొట్టాలం హరిజనవాడలో బుధవారం జల్లికట్టు నిర్వహించారు. టీడీపీ మండల నాయకుల ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ముందస్తు హెచ్చరికలు జారీ చేసినా ఖాతరు చేయకుండా టీడీపీ నాయకులు మారెమ్మ జాతర పేరుతో జల్లికట్టు ప్రారంభించారు.
మండలం నుంచేగాక తమిళనాడు నుంచి సైతం యువకులు పాల్గొన్నారు. మూడు గంటలు సాగిన జల్లికట్టులో దాదాపు పది మంది యువకులు గాయపడ్డారు. అడ్డుకోవాల్సిన సర్పంచ్ జగదీష్, టీడీపీ మండల కన్వీనర్ వినాయకగౌండర్, మాజీ ఎంపీపీ రాజమాణిక్యం, సహకార సంఘం ఉపాధ్యక్షుడు పూర్ణ ఈ క్రీడను తిలకించడమేగాక విజేతలకు బహుమతులు అందజేశారు.
ప్రేక్షకపాత్ర వహించిన పోలీసులు
జల్లికట్టుపై మండల పోలీసులకు ముందస్తు సమాచారం రావడంతో సరిహద్దు ప్రాంతాల నుంచే పశువులను తిప్పి పంపేందుకు ప్రయత్నించారు. తవణంపల్లి, గుడిపాల, యాదమరి ఎస్‌ఐలు, 50మంది కానిస్టేబుళ్లు హాజరయ్యారు. జల్లికట్టు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసినా గ్రామస్తులు, టీడీపీ నాయకులు వారితో వాగ్వాదానికి దిగారు. పోలీ సులు ప్రేక్షకపాత్ర పోషించారు.