అవినీతికి పరాకాష్ట | The pinnacle of corruption | Sakshi
Sakshi News home page

అవినీతికి పరాకాష్ట

Published Thu, Aug 24 2017 5:51 AM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM

అవినీతికి పరాకాష్ట - Sakshi

అవినీతికి పరాకాష్ట

 కొత్తమరువాడ అంగన్‌వాడీకేంద్రంలోఅక్రమాలు ఆన్‌లైన్‌ హాజరు పేరిట మోసం 14  ఏళ్లుగా తెరచుకోని కేంద్రం పిల్లలకు, గర్భిణులకు అందని పౌష్టికాహారం బయట ప్రాంతాల్లో ఉంటున్న వారి పేర్లతో హాజరు సరుకులను దోపిడీ చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్త  ఇది అవినీతికి పరాకాష్ట. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పద్నాలుగేళ్లుగా జరుగుతున్న దోపిడీ.

వంగర మండలం కొత్తమరువాడ అంగన్‌వాడీ కేంద్రం–2లో అవినీతి విశ్వరూపం కనిపిస్తోంది. ఆన్‌లైన్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సాకుతో ప్రతినెలా ప్రభుత్వం అందజేసే పౌష్టికాహారాన్ని అక్కడి కార్యకర్తే మింగేస్తున్నారు. అధికారుల కళ్లు గప్పి, పాలకులకు తెలియకుండా జరుగుతున్న ఈ అక్రమం ఆనవాళ్లు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. పేరుకు మారుమూల గ్రామమే అయినా ఈ ఘటనతో కొత్త మరువాడ జిల్లాను ఉలిక్కి పడేలా చేస్తోంది.


వంగర: ఇక్కడ అధికారుల పర్యవేక్షణ ఉం డదు. నాయకుల రాక అంతంతమాత్రమే. ఇంకేం అవినీతి వృక్షం వేళ్లూనుకుపోయింది. పద్నాలుగేళ్లుగా అడ్డూ అదుపు లేనంతగా ఇక్కడ మింగుడు కార్యక్రమం జరుగుతోం ది. వంగర మండల పరిధి కొత్తమరువాడ అంగన్‌వాడీ కేంద్రం–2లో అవినీతి జరుగుతోంది. ఇక్కడ పనిచేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్త వడ్డి శోభారాణి ఆన్‌లైన్‌లో కార్యకలాపాలు జరిపినట్లు నమోదు చేసి ప్రతి నెల గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ప్రభుత్వం అందజేసే పౌష్టికాహారం కాజేస్తున్నారు. వలస వెళ్లిన వారు, గ్రామంలో పూర్తిగా లేని వారి పేర్లతో, ఇతర దేశాలు, దేశంలోని వివిధ పట్టణాల్లో నివాసం ఉన్న వారి పేర్లు, ఉద్యోగుల పిల్లల పేర్లు రికార్డుల్లో నమోదు చేసుకొని ఆన్‌లైన్‌లో హాజరు పేరుతో భారీ దోపిడీకి పాల్పడ్డారు.

14 ఏళ్లుగా..
గ్రామస్తుల కథనం ప్రకారం అంగన్‌వాడీ కేంద్రం 14 ఏళ్లుగా తెరుచుకోవడం లేదు. కేంద్రంలో 15 మంది గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఉన్నట్లు లెక్కలు చూపి అవకతవకలకు పాల్పడుతున్నారు. వీరికి ప్రతి నెల అందజేసే పౌష్టికాహారం అందడం లేదు సరికదా, సరుకులు కూడా స్వాహా చేస్తున్నట్లు సమాచారం. కేంద్రంలో నెలవారీ హాజరు ముందుగానే పూర్తి చేయ డం ఆ కార్యకర్త అవినీతికి నిదర్శనం. ఈ విషయాన్ని గ్రామానికి చెందిన యువత ‘సాక్షి’కి చెప్పడం ‘సాక్షి’ ఇంటింటా సర్వే చేపట్టింది. ఈ క్రమంలో కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి.  

అంతులేని అవకతవకలు
కేంద్రంలో వంట చేయడం అప్పుడప్పుడూ మాత్రమే జరుగుతోంది. కానీ ఇక్కడ ప్రతి రోజూ లబ్ధిదారులకు పౌష్టికాహారం ఇస్తున్నట్లు నమోదు చేశారు. ఇక్కడ ఎనిమిది మంది గర్భిణులు, ఐదు మంది బాలింతలున్నట్లు గత ఎనిమిది నెలలుగా రికార్డుల్లో నమోదై ఉంది. గర్భిణుల్లో గుళిపల్లి రేణుక, పైల విజయలక్ష్మిలు గ్రామంలో ఉన్నప్పటికీ పౌష్టికాహారం అందించలేదు. మరడాన వేణమ్మ(విశాఖపట్నం పరిధి గాజువాకలో నివాసం), శింగిరెడ్డి శిరీష(విశాఖ జిల్లా నక్కపల్లిలో నివాసం)లో ఉండడం విశేషం. బాలింతల జాబితాకి వస్తే పెద్దింటి లలిత గ్రామంలో ఉండగా శింగిరెడ్డి అనిత(హైదరాబాద్‌లో నివాసం), మరవాడన ఉమా (భర్త ఐఐటీ ప్రొఫెసర్‌ కావడంతో ఖరఖ్‌పూర్‌లో నివాసం), శింగిరెడ్డి సుమతి(విశాఖపట్నం–గాజువాకలో నివాసం), రెడ్డి సత్యవతి (ఈ గ్రామానికి చెందిన వ్యక్తి కాదు) ఇలా బయట నివాసం ఉన్న వారి పేర్లతో భారీగా సరుకులు దోపిడీకి పాల్పడుతున్న విషయం వెలుగుచూసింది.

పిల్లల విషయంలోనూ..
ఏడు నెలల నుంచి మూడేళ్లు నిండిన పిల్లలకు టేక్‌ హోమ్‌ రేషన్‌ అందించాల్సి ఉంది. ఈ జాబితాలో మొత్తం 22 మంది చిన్నారుల పేర్లు రికార్డుల్లో నమోదయ్యాయి. వీరిలో సిం గిరెడ్డి మోహిత్, శింగిరెడ్డి రిషిత, చింత శంకరరావు, మరడాన జస్వంత్, గాడి భరధ్వజ్, శింగిరెడ్డి జ్యోతిర్మయిలకు నెలలో ఒకటి, రెండు సార్లు టేక్‌హోమ్‌ రేషన్‌ ఇచ్చి అంగన్‌వాడీ కార్యకర్త చేతులు దులుపుకుంటోంది. గంట తరుణ్‌( గ్రామంకాదు), శింగిరెడ్డి హాసినివేద (విశాఖపట్నంలో నివా సం), వేగిరెడ్డి సియా(లండన్‌ దేశంలో నివాసం), శింగిరెడ్డి బిందు, శింగిరెడ్డి బింద్యా (వీరిద్దరూ కవలలు–విశాఖపట్నం లో నివాసం), మరడాన కిరణ్మయి (విశాఖపట్నం గాజు వాకలో నివాసం), శింగిరెడ్డి చైతన్య (ఈ గ్రామం కాదు), శింగిరెడ్డి సుజిత్‌ (ఏడేళ్లుగా గ్రామంలో నివాసం లేరు), గాడి చరిత్‌ (విశాఖపట్నం–ఆరిలోవలో నివాసం), శింగిరెడ్డి యువరాజు(విశాఖపట్నం–గాజువాకలో నివాసం), మరిపి అభిజిత్‌ (బొబ్బిలి మండలం అలజింగి), నల్ల హేమలత (విశాఖపట్నం హెచ్‌బీ కాలనీ నివాసం), కల్యంపూడి శ్రీకీర్తి(హైదరాబాద్‌లో నివాసం), గేదెల మోనిష (విజయనగరంజిల్లా బాడంగి మండలం కూనాయివలసలోనివాసం), గాడి గీతాదీపిక (తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్‌లో ఉపాధ్యాయుడిగా గీతాదీపిక తండ్రి పనిచేయడంతో అక్కడ నివాసం), మరడాన లక్ష్మిప్రియ (విశాఖపట్నం గాజువాకలో నివాసం)లో ఉంటున్నారు.

వీరి పేర్లను రికార్డుల్లో నమోదు చేసి ఆన్‌లైన్‌ ద్వారా హాజరు వేసుకొని సరుకుల స్వాహాకు పాల్పడుతున్నారు. అలాగే 3–6 ఏళ్ల పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రంలో ప్రీ స్కూల్‌ నిర్వహణ, భోజనం అందజేయాల్సి ఉంది. అయితే ఏదీ ఇక్కడ అమలు కావడం లేదు. మొత్తం 12 మంది ఉన్నప్పటికీ జాబితాలో బోగస్‌ పేర్లుతో రికార్డు నమోదు చేసి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. మరడాన కార్తీక్, చింత లిఖిత ఈ ఇద్దరు చిన్నారులు మాత్రమే గ్రామంలో ఉన్నప్పటికీ వీరికీ ఎలాంటి పౌష్టికాహారం, ప్రీ స్కూల్‌ నిర్వహణ జరగడం లేదని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. బొంతు ఝాన్సీ (విశాఖపట్నం–గాజువాక), అంపిల్లి సింహాచలం(విశాఖపట్నం–మాధవధార), వేమిరెడ్డి నిత్య (లండన్‌ దేశంలో నివాసం), మరడాన తేజశ్వని(విశాఖపట్నం–గాజువాకలో నివాసం), గాడి మహిధర్‌(విశాఖపట్నం–హెచ్‌బీ కాలనీలో నివాసం), పెరుమాళి జశ్వంత్‌(విశాఖపట్నం–గోపాలపట్నంలో నివాసం), అంపిల్లి షన్ముఖ(కైకలూరు), శింగిరెడ్డి జినిత్‌ (విజయనగరంజిల్లా పూసపాటిరేగ), గాడి నర్తనకుమార్‌(తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్‌లో నివాసం), శింగిరెడ్డి షన్ముఖ( గ్రామం కాదు) ఇలాంటి పేర్లతో మాయాజాలం నడుస్తోంది. జనవరి నుంచి ఇప్పటి వరకు కంది పప్పు రెండుక్వింటాళ్లు, ఆయిల్‌ 140 లీటర్లు, ఆరువేల గుడ్లు, 322 లీటర్లు పాలు ప్రభుత్వం పంపిణీ చేసినట్లు రికార్డులు చెబుతున్నప్పటికీ గ్రామంలో లబ్ధిదారులెవ్వరికీ అందడం లేదని చెబుతున్నారు.

యువత నుంచి వ్యతిరేకం...
గ్రామ యువత రగిలిపోతున్నారు. గత దశాబ్ద కాలం నుంచి కేంద్రం తెరవకుండా విధులు నిర్వహించినట్లు జీతం డ్రా చేయడం, సరుకులు స్వాహా చేస్తున్నారని, ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో లక్షలాది రూపాయల సరుకులు దారి మళ్లిస్తున్నారని యువత గుంట్రెడ్డి హరీష్, జామి నరేష్, శింగిరెడ్డి అనంత్, గాడి సంతోష్, శింగిరెడ్డి అశోక్,శింగిరెడ్డి సత్యన్నారాయణ, జామి శివప్రసాద్, చింత ప్రసాద్‌ తదితరులు గళమెత్తి అవినీతిని వెల్లడించారు. అంగన్‌వాడీ నిర్వహిస్తున్న భవనం కూడా ఆమె సొంత గృహమే. కార్యకలాపాలు నిర్వహించకుండా నెలనెలా అద్దె తీసుకుంటున్నారు. కూరగాయల బిల్లులు, గ్యాస్‌ బిల్లులు ఏవీ వదల్లేదు.

కొసమెరుపు..
‘సాక్షి’ గ్రామంలో అంగన్‌వాడీ కార్యకర్త అవినీతిపై దర్యాప్తు జరుగుతోందని వివరాలు తెలుసుకున్న ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ రత్నం హుటాహుటిన గ్రామానికి చేరుకోగా కేంద్రంలో ఒక్కరూ కూడా లేకపోవడం గుర్తించారు. ఈ విషయాన్ని వీరఘట్టం ఐసీడీఎస్‌ పీఓ వి.రమాదేవికి తెలియజేయగా మరో గంటలో ఆమె కేంద్రం వద్దకు చేరుకొని అవకతవకలున్నట్లు వెల్లడించి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టు నెలాఖరు వరకు రికార్డులో హాజరు పూర్తిగా వేసినట్లు, కేంద్రంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులెవరూ లేనట్లు గుర్తించారు. వంటలు వండడం లేదని, ప్రీ స్కూల్‌ ని ర్వహించడం లేదని, సరుకులు లబ్ధి దారులకు ఇవ్వడం లేదని పలువురు యువకులు, లబ్ధిదారులు పీఓ దృష్టికి తేవడం కొసమెరుపు.

ఒక్కరోజూ భోజనం పెట్టలేదు
కేంద్రంలో ఒక్కరోజూ భోజనం పెట్టలేదు. ఏ రోజూ సరుకులు కూడా ఇవ్వలేదు. ఏ రోజూ కేం ద్రం కూడా తెరవలేదు. సరుకులు స్వాహా చేస్తున్నారు.
– పైల విజయలక్ష్మి, గర్భిణి, కొత్తమరువాడ

ఈ ఫొటోలో కనిపిస్తున్న బాలింత పేరు మరిపి గౌరీ. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం అలజింగి గ్రామానికి చెందిన మహిళ. ఈమె గర్భిణిగా ఉన్నప్పుడు, అబ్బాయి పుట్టి ఏడు నెలలు కిందట నుంచి వీరికి పౌష్టికాహారం అందిస్తున్నట్లు రికార్డులో నమోదు చేశారు. అయితే తమకు ఏ ఒక్క రోజూ కేంద్రం నుంచి భోజనం కానీ, సరుకులు కానీ ఆమె అందలేదని తెలిపారు.

చిత్రంలో కనిపిస్తున్న బాలింత పేరు పెద్దింటి లలిత. వంగర మండలంలోని ఇరువాడ గ్రా మానికి చెందిన మహిళ. ఈమె పేరుతో తొమ్మిది నెలల నుంచి కేంద్రం వద్ద భోజనం అందిస్తున్నామని రికార్డులో రాశారు. వాస్తవానికి ఏ ఒక్క రోజూ కేంద్రంలో భోజనం పెట్టలేదని, సరుకులు కూడా పంపిణీ చేయలేదని ఆమె తెలిపారు.

మేమే కాపలా కాస్తున్నాం
అంగన్‌వాడీ కేంద్రం తెరవకపోవడంతో చిన్నపిల్లలను మేమే ఇంటి వద్ద కాపలా కాస్తున్నాం. కేంద్రం తెరవకపోవడంతో పనులకు కూ డా వెళ్లలేకపోతున్నాం.
– మరడాన అప్పలనాయుడు, కొత్తమరువాడ
కేంద్రం ఎన్నడూ తెరవరు
అంగన్‌వాడీ కార్యకర్త కేంద్రాన్ని ఎన్నడూ తెరవదు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం ఏనాడూ వండలేదు. గ్రామంలో లేని వారి పేర్లతో మోసం చేస్తున్నారు.
– గాడి కృష్ణవేణి, సర్పంచ్, మరువాడ

సమగ్ర దర్యాప్తు
గ్రామంలోని అంగన్‌వాడీ కార్యకర్తపై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తాం. అర్జెంట్‌ మెమో జారీ చేస్తాం. అవకతవకలు గుర్తించాం. కార్యకర్తపై చర్యలు తీసుకుంటాం.
– వి.రమాదేవి, సీడీపీఓ, వీరఘట్టం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement