ప్రజలకు పోలీసులు చేరువకావాలి
అనంతపురం క్రైం : ప్రజల ఆశయాలకు అనుగుణంగా సేవలు అందిస్తూ, వారికి చేరువ అయినప్పుడే పోలీసుల విధులకు సార్థకత లభిస్తుందని జిల్లా ఎస్పీ ఎస్వీ రాజశేఖర్‌బాబు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు టూటౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక చంద్రబాబునాయుడు కాలనీలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఆశా ఆస్పత్రి యాజమాన్యం సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలలో సుమారు వెయ్యిమందికి వైద్య చికిత్సలు నిర్వహించారు.
జనరల్ ఫిజీషియన్, గైనకాలజిస్ట్, పీడియాట్రీషిన్ తదితర విభాగాలకు చెందిన ప్రత్యేక వైద్య నిపుణులు వైద్య సేవలు అందించారు. సుగర్ తదితర రక్తపరీక్షలు జరిపారు. గుండె జబ్బుల నిర్ధారణ కోసం ఈసీజీ చేపట్టారు. వీటితో పాటు స్కానింగ్ అవసరమైన వారికి స్థానిక ఆశా ఆస్పత్రిలో ఉచితంగా చేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్పీ రాజశేఖర్‌బాబు మాట్లాడుతూ నిత్యం బందోబస్తులు, రోజువారీ విధులతో తలమునకలయ్యే తమ సిబ్బందికి ప్రజాసేవ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు.
గతంలోనూ పోలీసులు స్వచ్ఛభారత్, ఉచిత మెగా వైద్య శిబిరాలు నిర్వహించారని గుర్తు చేశారు. ప్రజలు ప్రశాంతంగా జీవించడం కోసం పోలీసుశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. ఏ కష్టమొచ్చినా పోలీసుల వద్దకు వెళ్తే తక్షణమే పరిష్కారం లభిస్తుందన్నారు. కాలనీల్లో ఎక్కడైనా మట్కా, పేకాట, భూకబ్జాలు తదితర అరాచకాలు ఉంటే వెంటనే తమ సిబ్బంది దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన టూటౌన్ సీఐ శుభకుమార్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
ఆశా ఆస్పత్రి ఎండీ డాక్టర్ సోమయాజులు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు ఏ సమయంలో ఫోన్ చేసినా తక్షణమే స్పందిస్తున్నారన్నారు. అనంతపురం ఎస్పీ జే. మల్లికార్జునవర్మ, ఇతర సీఐలు శుభకుమార్, ఆంజనేయులు, ఎంఆర్ కృష్ణమోహన్, శివనారాయణస్వామి, గోరంట్ల మాధవ్, శ్రీనివాసులు, ఎస్‌ఐలు సుబ్బరాయుడు, రవిశంకర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, జగదీష్, రుద్రంపేట సర్పంచు కాలేనాయక్, ఎంపీటీసీలు వెంకటలక్ష్మీ, కృష్ణవేణి, ఆశా ఆస్పత్రి వైద్యులు డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి, మున్నీసా పాల్గొన్నారు.