ప్రజలతో కలిసి పనిచేయాలి
పాలమూరు :
పోలీసులు ప్రజలతో కలిసి పనిచేయాలని.. శాంతిభద్రతల పరిరక్షణే ప్రథమ కర్తవ్యమని జిల్లా నూతన ఎస్పీ శివప్రసాద్ అన్నారు. గురువారం ఆయన బదిలీ అయిన ఎస్పీ నాగేంద్రకుమార్ నుంచి జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇతర వర్గాలతో సమానంగానే సామాన్య, పేదవర్గాల వారికి పోలీసు సేవలు అందుతాయన్నారు. శాఖాపరంగా ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని అమలు చేస్తున్నారని, అందులో ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్ది ప్రజాసేవలో పోలీసులను భాగస్వామ్యులను చేస్తానని పేర్కొన్నారు.
పోలీసులకు ఏవైనా ఇబ్బందులుంటే తక్షణం తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఆయా పోలీస్ స్టేషన్‌లలో కేసులు పెండింగ్ లేకుండా జాగ్రత్త వహిస్తామని, పోలీస్ శాఖలోని అన్ని స్థా యిల అధికారులు, సిబ్బంది ప్రజలతో కలిసిపోయి పనిచేయాలని, సామాజిక సే వా దృక్పథంతో ఈ వృత్తిలో కొనసాగాలన్నారు. పోలీస్ స్టేషన్‌లలో ఎస్‌ఐ, సీఐ, ఆ పై అధికారుల స్థాయిలో న్యాయం జరగకుంటే బాధితులు నేరుగా తన వద్దకు వచ్చి సమస్యలు చెప్పాలన్నారు.
వృత్తిపరంగా జిల్లా ఎస్పీ స్థాయిలో ఉన్నప్పటికీ అటు సామాన్య ప్రజలు, పోలీసు శాఖలోని కింది స్థాయి సిబ్బందికి సైతం ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు పాటుపడతానన్నారు. గతంలో మాదిరిగానే ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రతిసోమవారం గ్రీవెన్స్ సెల్‌ను కొనసాగిస్తామన్నారు. జిల్లాలో శాంతి భద్రతలను నెలకొల్పేందుకు శాఖాపరంగా అన్ని స్థాయిల్లోని సిబ్బంది కలుపుకొని పనిచేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్‌లు, సర్కిల్‌ల పరిధిలో కేసుల నమోదు, వాటి పరిష్కారం సకాలంలో జరిగే విధంగా దృష్టి పెడతామన్నారు.