
పోలీసుల తప్పేమి లేదు
నెల్లూరు(క్రైమ్): అనంతసాగరం మండలంలోని మల్లెంకొండ అటవీ ప్రాంతంలో జరిగిన ఘటనలో పోలీసుల తప్పేమి లేదని ఎస్పీ ఎస్.సెంథిల్‌కుమార్ అన్నారు. తప్పు చేశారు కాబట్టే ఫారెస్ట్ వాచర్లను అరెస్ట్ చేశామని వెల్లడించారు. నెల్లూరులోని ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం ఆయన విలేకరులతో మా ట్లాడారు. ఈ నెల 27వ తేదీ రాత్రి అనంతసాగరం ఎస్సై పుల్లారావు సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారన్నారు. ఓ టాటా మేజిక్ వాహనంలో నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. ఆటోడ్రైవర్ ఇచ్చిన సమాచారంతో మఫ్టీలో ఎస్సై తన సిబ్బందితో కలిసి చిలకలమర్రి శిలల వద్దకు చేరుకున్నారన్నారు.
వీరిని గమనించిన ఫారెస్ట్ బేస్ క్యాంప్ వాచర్స్ ఓబయ్య, మాల కొండయ్య అక్కడ నుంచి పరార య్యే ప్రయత్నం చేశారన్నారు. పోలీసులు వారిని వెంబడించగా ఓ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి చేశారన్నారు. వాచర్లు విధుల్లో ఉంటే పోలీసులను చూసి పారిపోవాల్సిన అవసరం లేదన్నారు. వాళ్లు స్మగ్లర్లకు కొమ్ముకాస్తున్నట్లు అర్థమవుతోందన్నారు. ఈ ఘటనపై తాము పూర్తిస్థాయిలో విచారణ జరిపిన తర్వాతే వాచర్లపై కేసు నమోదు చేశామన్నారు. స్మగ్లర్లతో పోలీసులకు సంబంధాలు ఉన్నాయని, గుట్టు బయటపడుతుందనే పోలీ సులు అక్రమ కేసులు బనాయించారని డీఎఫ్‌ఓ ఆరోపించడం దారుణమన్నారు. న్యాయనిపుణులతో మాట్లాడి డీఎఫ్‌ఓకు లీగల్ నోటీసులు పంపిస్తామన్నారు. ఒకరిద్దరు చేసిన తప్పిదాల వల్ల ఆ శాఖను తాము తప్పుబట్టలేదన్న విషయా న్ని డీఎఫ్‌ఓ గుర్తుంచుకోవాలన్నా రు. ఓబయ్య అటవీశాఖలో పని చేస్తూ సర్వీసు నుంచి తొలగింపబడ్డాడని, అలాంటి వ్యక్తికి ఎలా తిరిగి వాచర్‌గా అవకాశం కల్పించడంపై దర్యాప్తుచేస్తున్నామన్నారు.
ప్రజల చెంతకు పోలీసు
పోలీసు సేవలను ప్రజల చెంతకు చేరవేసేందుకు అన్నీ చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ తెలిపారు. రిసెప్షనిస్టు వ్యవస్థను బలోపేతం చేశామన్నారు. జిల్లా అధికారి నుం చి కిందిస్థాయి సిబ్బంది వరకు గ్రా మాల్లో పర్యటించి ప్రజలతో మమేకమై వారి సాదకబాధల్లో తోడుగా ఉంటామన్నారు. హోమ్‌గార్డు నుంచి అధికారి వరకు వారధి కార్యక్రమం ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు.
చోరీల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
అక్రమ రవాణాపై దృష్టి సారించి శాంతిభద్రతలు, దొంగతనాల విషయాన్ని పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలపై ఆయన స్పందిస్తూ అలాంటిదేమి లేదన్నారు. చట్టవ్యతిరేకమైన ప్రతి విషయాన్ని పోలీసులు విచారించవచ్చన్నారు. చోరీల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. నేరస్తుల కదలికలపై నిఘా ఉంచామనీ త్వరలోనే అన్ని రకాల దొంగతనాలను నియంత్రిస్తామన్నారు. నెల్లూరులో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నామన్నారు. మీడియాపై తాము ఎలాంటి ఆంక్షలు విధించలేదన్నా రు. ఎప్పటిలాగే పోలీసుస్టేషన్‌కు వెళ్లవచ్చన్నారు. అయితే కేసు విచారణ ఉన్న సమయంలో నిందితుల ఫొటోలను తీయడం తగదన్నారు. సమావేశంలో ఎస్‌బీ డీఎస్పీ బి.వి రామారావు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ వై. శ్రీనివాసరావు, ఎస్‌బీ ఎస్సై బి. శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.