
తపాలా శాఖలో అక్రమాలు
► దొరికితేనే దొంగ..
► ఒంటిమిద్దె బ్రాంచ్ పోస్టు మాస్టర్‌పై చర్యలకు సిఫార్సు?
అనంతపురం రూరల్: దొరికితే దొంగ.. లేకపోతే దొరే.. అనే చందంగా తపాలాశాఖ వ్యవహారాలు సాగుతున్నాయి. గతంలో ఉపాధి బిల్లుల చెల్లింపుల పక్రియ పోస్టాఫీసుల ద్వారా సాగేది. ఈ క్రమంలో 2009లో నూతిమడుగు పోస్టాఫీసు పోస్టుమాస్టర్ ఆర్. శ్రీనివాసులు రూ. 3లక్షలు సొంతానికి వినియోగించుకున్నట్లు విచారణలో వెల్లడైంది. అయితే మరుసటి రోజు ఆయన ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించడంతో ఆయనను గార్లదిన్నె పోస్టాఫీసుకు బదిలీతో సరిపెట్టారు. అక్కడ కూడా ఆయన రూ. 5 కోట్ల వరకూ అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. చివరకు ఆయనను సస్పెండ్ చేసి, మొత్తం ఆయన అక్రమాల చిట్టాపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఇందులో 60 మంది తపాలా సిబ్బందిపై అప్పట్లో అభియోగాలు మోపడంతో ప్రస్తుతం వారిపై విచారణ జరుగుతోంది.
ఆన్‌లైన్‌తో వెలుగులోకి...
పోస్టాఫీసుల్లో ఆన్‌లైన్ పక్రియ పూర్తి కావడంతో బ్రాంచ్ పోస్టుమాస్టర్లు, తపాలా సిబ్బంది అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. 15 రోజుల కిందట శెట్టూరు మండలంలోని కునుకూరు బ్రాంచ్‌లో రూ.6 లక్షల ఉపాధి నిధులు పక్కదారి పట్టినట్లు విచారణలో తేలింది. స్వాహా చేసిన సొమ్మును రికవరీ చేసి, బీపీఎంను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కళ్యాణదుర్గం మండలం ఒంటిమిద్దె బ్రాంచ్ పోస్టుమాస్టర్ సుకన్య యోజన సమృద్ధి పథకం కింద ఆడపిల్లల తల్లిదండ్రులు డిపాజిట్ కోసం చెల్లించిన సొమ్మును తన జేబులో వేసుకున్నాడు. బాండ్లు అందజేయడంలో జాప్యం చేస్తుండడంతో అనుమానించిన డిపాజిట్‌దారులు పోలీసులతోపాటు, తపాలా శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై కళ్యాణదుర్గం తపాలా ఇన్‌స్పెక్టర్ విచారణ చేయగా రూ. 4 లక్షల వరకూ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని తపాలా ఏఎస్పీ సంజీవ్‌కుమార్‌ను ధ్రువీకరిస్తూ స్వాహా చేసిన సొమ్మును రికవరీ చేస్తున్నట్లు తెలిపారు.