కర్నూలు రూరల్, న్యూస్‌లైన్: తుంగభద్ర దిగువ కాలువ, కర్నూలు-కడప కాలువల వాటాల్లో మళ్లీ కోత పడింది. నీటి వాటా పంపకాలపై గురువారం కర్ణాటక రాష్ట్రం హోస్పేటలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) వాటా నీటిలో 0.4 టీఎంసీ, కేసీ వాటాలో 0.3 టీఎంసీ నీటిని తగ్గిస్తున్నట్లు బోర్డు అధికారులు ప్రకటించారు. ఎల్లెల్సీ కింద రబీలో సాగు చేసిన ఆయకట్టు పంటలకు 4.06 టీఎంసీ నీరు రావాల్సి ఉంది. ప్రస్తుతం టీబీ డ్యామ్‌లో నీటి లభ్యత ఆధారంగానే వాటా తగ్గించినట్లు సమాచారం.
కేసీ నీరు అనంతపురం జిల్లాకు మళ్లించడంతో ఇక మిగిలిన 0.8 టీఎంసీ వాటాలో కూడా 0.3 టీఎంసీ దాకా కోత పెట్టినట్లు సమాచారం. ఇప్పటికే కేసీ కాలువ జీరో కి.మీ., నుంచి 150 కి.మీ. వరకు ఉన్న 29,500 ఎకరాల్లో పంటలకు చివరి తడికి నీరు ఇచ్చే అవకాశం ఉండదు. ప్రస్తుతం సుంకేసుల ప్రాజెక్టులో 1.15 టీఎంసీ నీరు ఉండగా, ఎగువ నుంచి 900 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ఈ ప్రాజెక్టు నుంచే కర్నూలు నగర ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చేందుకు 2 టీఎంసీల నీరు అవసరం. సుంకేసులలో ఉన్న నీరు, టీబీ డ్యామ్‌లో మిగిలిన 0.5 టీఎంసీ నీరు వచ్చినా తాగునీటి అవసరాలు తీర్చడమే కష్టమని కొందరు అధికారులు చెబుతున్నారు.
పాలకులకు ముందు చూపు లేకపోవడం.. అధికారులు అలసత్వం వల్లే కేసీ ఆయకట్టు రైతులకు నీరందని పరిస్థితులు నెలకొంటున్నాయి. హొస్పేటలో నిర్వహించిన సమావేశానికి నీటి పారుదల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ ఆర్.నాగేశ్వరరావు హాజరయ్యారు. దిగువ కాలువ వాటా నీటిలో కొంత మేరకు తగ్గించారని, ఫిబ్రవరి 1వ తేది నుంచి కేసీ వాటా నీరు టీబీ డ్యామ్ నుంచి విడుదల అవుతుందన్నారు. ఉన్న నీటినే కేసీ 12 రోజుల పాటు విడుదల చేస్తామని, ఆ తరువాత మూడో తడికి ఆలోచిస్తామని చెప్పారు.
నీటి వాటాలో కోత
Published Fri, Jan 31 2014 3:10 AM | Last Updated on Tue, Oct 30 2018 5:51 PM
Advertisement