వెల్లువెత్తిన నిరసన
కడప కల్చరల్ : క్రైస్తవులు ఆందోళనకు దిగారు. కొన్ని పత్రికలు తమ మనోభావాలను కించపరచడంతో వారు నిరసించారు. కట్టు కథలు అల్లిన పత్రికల తీరును వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే ముందస్తు అనుమతి లేదంటూ నిరసన ప్రదర్శనను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో క్రైస్తవులు ప్రతిఘటించారు.
పోలీసులు, క్రైస్తవుల మధ్య వాగ్వాదం జరిగింది. శాంతియుతంగా చేస్తున్న ఆందోళలను అడ్డుకోవడం తగదని వారు హితవు పలికారు. దీంతో పోలీసులు ర్యాలీకి అనుమతించారు. చివరకు వారు కలెక్టరేట్ కు చేరుకున్నారు. అక్కడ బైఠాయించి ఆందోళనకు దిగారు.
ఏసుక్రీస్తు గురించి ఇటీవల ఓ దినపత్రికలో అవాస్తవాలు ప్రచురించడం తమ మనోభావాలు దెబ్బతీసినట్లైందంటూ కడపకు చెందిన ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ, ఆలిండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ విద్యార్థులు, క్రైస్తవులు సోమవారం ఎల్‌ఐసీ సర్కిల్‌లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహం నుంచి ర్యాలీ ప్రారంభించారు.
కథనం ప్రచురించిన పత్రికకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హెచ్‌బీ కాలనీ, రాజీవ్‌పార్కు, కోటిరెడ్డి సర్కిల్ మీదుగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అక్కడ కలెక్టర్ లేకపోవడంతో డీఆర్‌ఓ సులోచనకు వినతిపత్రం అందజేశారు. కలెక్టరేట్ గేటు వద్ద ైబె ఠాయించారు. ఆందోళననుద్దేశించి క్రైస్తవ గురువు జేకోబ్ మాట్లాడారు. మత విశ్వాసాలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదన్నారు. ఇలాంటి పొరపాటు మరోసారి జరగకూడదనే ఆవేదనతోనే శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్నామని మరో గురువు షడ్రక్ అన్నారు.
పోలీసులతో వాగ్వాదం
ర్యాలీ ప్రారంభం కాగానే కడప డీఎస్పీ రాజేశ్వరరెడ్డి తమ సిబ్బందితో కలసి ర్యాలీని అడ్డుకున్నారు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించకూడదని అభ్యంతరం తెలిపారు. ర్యాలీ ముందుకు సాగేందుకు వీల్లేదన్నారు. అనుమతి కోసం తాము పలుమార్లు పోలీసు అధికారులను ఆశ్రయించామని, అయినా అనుమతి ఇవ్వకుండా వేధించారని క్రైస్తవులు ఆరోపించారు. పోలీసులతో వాదనకు దిగారు. చివరకు డీఎస్పీ సూచించిన ప్రకారం ర్యాలీ నిర్వహించారు. క్రైస్తవ ప్రముఖులు ఏసన్న, చిన్నయ్య, ఆల్ జయశాలి బైబిల్ రీసెర్చి సెంటర్ ప్రతినిధులు, విశ్వాసులు, స్థానిక క్రైస్తవులు పాల్గొన్నారు.