కరెంటు కోతలపై రైతన్న కన్నెర్ర
చండ్రగూడెం (మైలవరం), న్యూస్‌లైన్ : ఇష్టారాజ్యంగా విధిస్తున్న విద్యుత్ కోతలపై రైతులు కన్నెర్ర చేశారు. మండలంలోని చండ్రగూడెం శివాలయం వంతెన వద్ద విజయవాడ - ఛత్తీస్‌గఢ్ జాతీయ రహదారిపై శుక్రవారం రాస్తారోకో, ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. విద్యుత్ కోతల వల్ల బోర్లు పనిచేయటం లేదని, దీంతో సాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇబ్బందులపై అధికారులకు మొర పెట్టుకున్నా అరణ్య రోదనగానే మిగిలిందని విమర్శించారు.
నూజివీడు, జి.కొండూరు, తిరువూరు తదితర మండలాల్లో రైతులకు విద్యుత్ సరఫరా మెరుగ్గానే ఉందని, మైలవరంలో మాత్రం కోతలతో ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. వెంటనే కరెంటు కోతలు ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. రైతుల ఆందోళన నేపథ్యంలో అక్కడికి చేరుకున్న విద్యుత్ ఏఈ రంగారావును కరెంటు కోతల విషయమై రైతులు నిలదీశారు.
ఈ సందర్భంగా ఏఈకి, రైతులకు మధ్య వాగ్వివాదం జరిగింది. తమ చేతుల్లో ఏమీ లేదని పై నుంచే కోతలు విధిస్తున్నారని ఏఈ రంగారావు ఈ సందర్భంగా రైతులకు స్పష్టం చేశారు. నూజివీడు తదితర ప్రాంతాల్లో లేని ఇబ్బంది ఇక్కడే ఎందుకు ఉంటోందని రైతులు ఆయన్ని నిలదీశారు. ఈ నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి రైతులను సముదాయించారు.